ధరల.. దడ

ABN , First Publish Date - 2020-06-06T09:17:33+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గుంటూరులోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ని మూసేయడంతో వివిధ కూరగాయల ధరలు పెరిగిపోయాయి.

ధరల.. దడ

కూరగాయల మార్కెట్‌ మూతతో బాదుడు

రెండు రోజుల్లోనే కేజీకి రూ.10కిపైగా పెరుగుదల


గుంటూరు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గుంటూరులోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ని మూసేయడంతో వివిధ కూరగాయల ధరలు పెరిగిపోయాయి. మార్కెట్‌లో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా తొలి జాబితాలోనే 18 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ జరిగింది. దాంతో ఉలిక్కిపడిన జిల్లా యంత్రాంగం మార్కెట్‌ని మూసేయాలని ఆదేశించింది. అనధికారికంగా మరి కొంతమందికి కూడా పాజిటివ్‌ ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌ మూతతో ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల కూరగాయల దిగుబడి నిలిచిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది. స్థానికంగా వస్తోన్న కూరగాయలను మాత్రమే తాత్కాలిక మార్కెట్లకు సర్దుబాటు చేస్తోన్నారు.


మార్కెట్‌ మూసేయక ముందు, ప్రస్తుతం ఉన్న ధరల్లో కేజీకి రూ.10 వంతున వ్యత్యాసం కనిపిస్తోన్నది. మార్కెట్‌ని తిరిగి తెరిపించకపోతే వచ్చే వారానికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. అసలే లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలకు ధరల పెరుగుదల శరాఘాతంగా మారుతున్నది. గత వారంలో టమాట కేజీ రూ. 15 ఉంటే నేడు రూ.30కి చేరుకొన్నది. పచ్చిమిరపకాయలు కేజీ రూ. 50కి వెళ్లింది. బంగాళదుంపలు, బీరకాయలు వంటివి రూ.30 నుంచి రూ.40కి చేరుకొన్నాయి. దొండకాయ, బెండకాయ కేజీ రూ.20 నుంచి రూ.30కి పెరిగాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిర్ధిష్టమైన జాగ్రత్తలు తీసుకొంటూ మార్కెట్‌ని తెరిపించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. 

Updated Date - 2020-06-06T09:17:33+05:30 IST