రైతన్నపై ధరల పిడుగు..!

ABN , First Publish Date - 2021-03-03T04:55:41+05:30 IST

వ్యవసాయ జూదంలో చితికిపోతున్న రైతుకు మరో షాక్‌. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరకు ధర పెరిగిందని కంపెనీలు ఎరువుల ధరలు పెంచేశాయి.

రైతన్నపై ధరల పిడుగు..!
కడప ఆర్‌బీకే స్టాక్‌ పాయింట్‌లో ఎరువుల నిల్వలు

ఎరువుల ధరలకు రెక్కలు

డీఏపీ, కాంప్లెక్స్‌ బస్తాపై రూ.150-250 పెంపు

ముడిసరుకు ధరలు పెరగడం వల్లే అంటున్న కంపెనీలు

సాగు వ్యయంపై తీవ్ర ప్రభావం

ఆర్థికంగా చితికిపోతున్న చిన్న, సన్నకారు రైతులు


(కడప-ఆంధ్రజ్యోతి): వ్యవసాయ జూదంలో చితికిపోతున్న రైతుకు మరో షాక్‌. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరకు ధర పెరిగిందని కంపెనీలు ఎరువుల ధరలు పెంచేశాయి. రేపో మాపో పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. డీఏపీ 50 కిలోల బస్తాపై రూ.250, కాంప్లెక్స్‌ బస్తాపై రూ.150 పెరగనుంది. అసలే నష్టాల సాగుతో కుదేలవుతున్న రైతులను ధరలు పెంచి మరింతగా కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. పెరిగిన ధరలు అమల్లోకి వస్తే జిల్లా రైతులపై రూ.75-85 కోట్ల భారం పడుతుంది. రైతు భరోసా పేరుతో కొసరు ఇచ్చి రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు పెంచేసి కష్టజీవులను నిలువునా ముంచుతున్నారు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ఎరువుల ధరలు పెంచడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 1,15,836 హెక్టార్లు. ఆహార ధాన్యాలు 46,660, పప్పు దినుసులు 12,842, ఆయిల్‌ సీడ్స్‌ 25,939, వాణిజ్య పంటలు 28 వేల హెక్టార్లలో సాగు చేస్తారు. రబీలో 1.25 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ అధికారుల అంచనా. అలాగే ఉద్యాన పంటలు మరో 1.22 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌, ఎస్‌ఎ్‌సపీ వంటి రసాయన ఎరువులు ఆయా పంటలకు వేస్తున్నారు. ఖరీఫ్‌, రబీ పంటలకు ఏటా సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల రసాయన ఎరువులు అవసరమని వ్యవసాయ అధికారుల అంచనా వేస్తున్నారు. అధికారుల సిఫారసు కంటే రైతులు రెట్టింపు ఎరువులు వినియోగిస్తున్నారు.


ఎరువు.. బరువు

ఖరీ్‌ఫలో ఒక్క యూరియా 35 వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 8,850, కాంప్లెక్స్‌ 28,092, ఎంవోపీ 5,100, ఎస్‌ఎ్‌సపీ 6 వేలు, మినరల్‌ ఎరువులు 1,700 మెట్రిక్‌ టన్నులు కలిపి 84,745 మెట్రిక్‌ టన్నుల రసాయన ఎరువులు అవసరం. ఇది వ్యవసాయ శాఖ సిఫారసు ప్రకారమే. ఈ లెక్కన ఖరీఫ్‌, రబీ వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఖరీఫ్‌, రబీ సీజన్‌కు సరాసరి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంది. అందులో డీఏపీ 35-50 వేల టన్నులు, కాంప్లెక్స్‌ 1.25 నుంచి 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరమని అధికారులు తెలిపారు. డీఏపీ 50 కిలోల బస్తాపై రూ.250, కాంపెక్స్‌ బస్తాపై రూ.150 వరకు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్స్‌ కంపెనీలు సంకేతాలు పంపాయి. ఏప్రిల్‌ ఒకటో తారీఖు నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ఏపీ ఎరువులు, పురుగుమందుల విక్రయదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు. 20:20:0 కాంపెక్స్‌ ఎరువు 50 కిలోల బస్తా ప్రస్తుత ఎమ్మార్పీ ధర రూ.975 నుంచి  రూ.1,125లకు పెంచారు. బస్తాపై రూ.150 పెరిగింది. డీఏపీ బస్తా రూ.1,200 నుంచి రూ.1,450 పెంచడంతో బస్తాపై రూ.250 పెరిగింది. 14:25:14, 28:28:0 కాంప్టెక్స్‌ ఎరువుల బస్తాపై రూ.250 పెరిగిందని డీలర్లు తెలిపారు. పెరిగిన ధరల వల్ల జిల్లా రైతులపై సరాసరి రూ.75-85 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డీజిల్‌ ధర పెరిగింది. తాజాగా ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయ పెట్టుబడి 25-30 శాతం పెరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.


ముడిసరుకు ధర పెరిగిందని..

డీఏపీ, కాంప్లెక్స్‌ తయారీకి ప్రధానంగా పాస్ఫరిక్‌ యాసిడ్‌ వినియోగిస్తున్నారు. వీటి ధరతో పాటు ఎరువుల తయారా ముడిసరుకు ధరలు అంతర్జాతీయంగా పెరగడం వల్లే ఎరువుల ధరలు పెంచక తప్పడం లేదని ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల బస్తాపై రాయితీ ఇచ్చేది. ప్రధాని నరేంద్రమోదీ వచ్చాక ఎరువుల బస్తాపై కాకుండా ఎన్‌పీకే విలువ ఆధారిత రాయితీ విధానం తీసుకొచ్చారు. దీని వల్ల ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు అంతర్జాతీయంగా ముడిసరుకు ధరలు పెరుగుదలకు అనుగుణంగా ఎరువుల ధరలు పెంచుకునే హక్కు వచ్చిందని, దీంతో కేంద్ర ప్రభుత్వంపై రాయితీ భారం తగ్గి రైతులపై భారం పడుతుందని ఎరువుల డీలర్ల సంఘం నాయకులు అంటున్నారు.

Updated Date - 2021-03-03T04:55:41+05:30 IST