భళా.. ఉప్పల్‌ భగాయత్‌ గజం 1.01 లక్షలు!

ABN , First Publish Date - 2021-12-03T07:40:48+05:30 IST

ఉప్పల్‌ భగాయత్‌.. మరో సారి రికార్డు సృష్టించింది. రియల్టర్ల లెక్కలు, అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ చదరపు గజం అక్షరాలా లక్షా వెయ్యి రూపాయలు పలికింది. హెచ్‌ఎండీఏ అధికారులు చదరపు గజానికి అప్‌సెట్‌ ధర రూ.35వేలుగా నిర్ణయిస్తే...

భళా.. ఉప్పల్‌ భగాయత్‌ గజం 1.01 లక్షలు!

  • రికార్డు స్థాయిలో పలికిన ధర
  • గజం సగటు ధర 71వేలపైనే
  • ఈ-వేలంలో 23 ప్లాట్ల విక్రయం
  • సర్కార్‌కు 141 కోట్ల ఆదాయం
  • రెండేళ్ల క్రితం ధర 73,900


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ భగాయత్‌.. మరో సారి రికార్డు సృష్టించింది. రియల్టర్ల లెక్కలు, అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ చదరపు గజం అక్షరాలా లక్షా వెయ్యి రూపాయలు పలికింది. హెచ్‌ఎండీఏ అధికారులు చదరపు గజానికి అప్‌సెట్‌ ధర రూ.35వేలుగా నిర్ణయిస్తే...  మూడింతల స్థాయిలో ఆదాయం వచ్చింది. ఐటీ కారిడార్‌గా పేరున్న మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లోని భూములకు ఏ మాత్రం తగ్గకుండా ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో ధరలు పలకడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఉప్పల్‌ భగాయత్‌లోని ఫేజ్‌-1, ఫేజ్‌-2 లేఅవుట్లలో 23 ప్లాట్లను గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎ్‌సటీసీ ద్వారా హెచ్‌ఎండీఏ ఈ-వేలం నిర్వహించింది.


ఇందులో 21 రెసిడెన్షియల్‌ ప్లాట్లు కాగా, రెండు మాత్రమే కమర్షియల్‌ ప్లాట్లు ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నాం రెండు సెషన్లలో ఈ-వేలం ప్రక్రియ నిర్వహించగా, అప్‌సెట్‌ ధరను హెచ్‌ఎండీఏ రూ.35వేలుగా నిర్ణయించింది. ఇందులో 813, 856వ నంబర్‌ ప్లాట్లు అత్యధికంగా చదరపు గజానికి రూ.1.01లక్షలు పలికాయి. 368 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ను రూ.3.71కోట్లకు, 222చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ రూ.2.24కోట్లకు దక్కించుకున్నారు. ఈ రెండు ప్లాట్లు ఉప్పల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వెళ్లే ప్రధాన రోడ్డులో ఎడమ వైపు ఉన్న ఫేజ్‌-1 లేఅవుట్‌లో ఉన్నాయి. ఫేజ్‌-2 లేఅవుట్‌లో శిల్పారామనికి సమీపంలో ఉన్న 55వ నంబర్‌ ప్లాటు 1787 గజాల విస్తీర్ణం ఉండగా, గజం ధర రూ.53వేలు పలికింది. ఉదయం వేళ మొదటి విడతలో 12 ప్లాట్లను ఈ-వేలం వేయగా చదరపు గజం ధర రూ.53వేల నుంచి రూ.73వేల వరకూ పలికింది. మొత్తం 14,486 గజాలను విక్రయించగా రూ.97.27కోట్ల ఆదాయం వచ్చింది. మధ్యాహ్నం నుంచి జరిగిన రెండో విడత వేలంలో 11 ప్లాట్లు.. చదరపు గజానికి రూ.70వేల నుంచి రూ.1.01లక్షల మధ్య ధర పలికాయి. రెండు సెషన్లలో కలిపి 19,719 చదరపు గజాలను ఈ-వేలం వేయగా.. సగటు ధర రూ.71వేల వరకూ పలికింది.  ప్రభుత్వానికి రూ.141.61కోట్ల ఆదాయం సమకూరింది.


చిన్న ప్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌

ఈ వేలంలో చిన్న ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపారు. గురువారం ఈవేలం వేసిన 23 ప్లాట్లలో పది ప్లాట్లు 500 చదరపు గజాల్లోపే ఉన్నాయి. వీటిని కొనేందుకు చాలా మంది పోటీ పడ్డారు. వీధి పోటు కలిగిన 1293వ నెంబర్‌ 200చదరపు గజాల ప్లాటును చదరపు గజాన్ని రూ.73వేల చొప్పున రూ.1.46కోట్లకు దక్కించుకున్నారు. వీధిపోటు కలిగిన నాలుగు ప్లాట్లు కూడా చదరపు గజం రూ.70వేలకు పైగా పలికాయి. రెండేళ్ల క్రితం 2019 ఏప్రిల్‌లో ఉప్పల్‌ భగాయత్‌లో చదరపు గజం అత్యధికంగా రూ.73వేలు, సగటున రూ.51వేలు పలుకగా, అదే ఏడాది డిసెంబరులో వేలం వేస్తే చదరపు గజం రూ.77వేలు, సగటున రూ.53వేలు పలికింది.

Updated Date - 2021-12-03T07:40:48+05:30 IST