‘నేను చెప్పినంత ఇస్తేనే సీటు.. లేకుంటే ఆశలు వదులుకో..’

ABN , First Publish Date - 2021-01-27T06:27:02+05:30 IST

మైలవరం నియోజకవర్గంలోని..

‘నేను చెప్పినంత ఇస్తేనే సీటు.. లేకుంటే ఆశలు వదులుకో..’

ఖర్చెంత పెడతావ్?

సర్పంచ్‌ అభ్యర్థిత్వానికి రూ.అరకోటి 

పంచాయతీల్లో సీటుకు బేరాలు షురూ

5 వేల ఓట్లున్న పంచాయతీకి రూ.50 లక్షలు

మైలవరం, పెడన నియోజకవర్గాల్లో కాసుల వేట

అధికార పార్టీలో జోరుగా బేరసారాలు

అయోమయంలో ఆశావహులు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ‘పంచాయతీ సర్పంచిగా పోటీ చేస్తావా? ఎంత ఖర్చు పెట్టగలవు? నీ వద్ద ఎంత ఉంది? ముందుగా నేను చెప్పినంత ఇస్తేనే నీకు సీటు. లేకుంటే ఆశలు వదులుకో..’ జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న మైలవరం నియోజకవర్గంతోపాటు మూడో విడత ఎన్నికలు జరగనున్న పెడన నియోజకవర్గంలో కొందరు అధికార పార్టీ నాయకులు సర్పంచ్ సీటు ఆశిస్తున్న వారితో జరుపుతున్న బేరసారాలివి..


మైలవరం నియోజకవర్గంలోని సుమారు 60 గ్రామ పంచాయతీలకు అధికార పార్టీ తరఫున సీటు ఆశిస్తున్నవారితో ఆ పార్టీ నేత బామ్మర్ది బేరాలు ప్రారంభించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే ఆయా పంచాయతీల జనాభాని అనుసరించి నిర్దేశిత మొత్తాన్ని ముందుగా తమకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కో పంచాయతీకి రూ.50 లక్షలకు పైగా డిమాండ్‌ చేస్తున్నారు. సర్పంచ్‌గా పోటీ చేసే వ్యక్తే అధికార పార్టీ మద్దతుతో పోటీ చేసే వార్డు సభ్యులను గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని, దీని కోసమే తాము డబ్బులు ఎంత ఖర్చు చేయగలరో అడుగుతున్నామని సదరు బామ్మర్ది సెలవిస్తున్నారని సమాచారం. ఆయన తీరుతో చాలా మంది ఆశావహులు అంత మొత్తం ఇచ్చేవారికే సీటు ఇవ్వండి అంటూ వెనుదిరుగుతున్నట్టు సమాచారం. కొందరు ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్‌గా గెలిచేందుకు ఎలాగూ తాము ఖర్చు పెట్టుకుంటామని, సీటు ఖరారు చేసేందుకూ ఈ బేరాలు ఏమిటని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దోచుకున్నది చాలక చివరికి సర్పంచ్‌ సీటునూ బేరం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


బరితెగింపు బేరాలు ఎందుకు?

నియోజకవర్గంలో తన పట్టు కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో విజయం ఒక్కటే మార్గం. స్థానికంపై పట్టు సాధించకుంటే అధినేత నుంచి అక్షింతలు తప్పవు. అదీకాక మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగితే తనకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో సదరు నేత ఉన్నారు. ఈ కారణంగా ఎలాగైనా నియోజకవర్గంలోని పంచాయతీల్లో ఆర్థికంగా బలమైన వారినే రంగంలోకి దింపాలని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే ఖర్చుకు వెనుకాడని వారికే సర్పంచ్‌ సీటు ఇవ్వాలని భావించి ఆమేరకు బేరాలకు దిగుతున్నారు. సర్పంచ్‌ అభ్యర్థి నుంచి వసూలు చేసే మొత్తంలో కొంత వార్డు సభ్యులను గెలిపించుకునేందుకు ఖర్చు పెడితే తమకు తిరుగుండదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 


ఇక మూడో విడత ఎన్నికలు జరిగే మచిలీపట్నం డివిజన్‌లో భాగమైన పెడన నియోజకవర్గంలోనూ సర్పంచ్‌ పదవికి జోరుగా బేరాలు నడుస్తున్నాయి. మైలవరం స్థాయిలో కాకపోయినా ఇక్కడ సర్పంచ్‌ సీటుకు రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకు బేరాలు నడుస్తున్నాయి. అయితే ఈ వసూళ్లన్నీ నియోజకవర్గ నేత జేబులోకేనని వార్డు సభ్యులను గెలిపించుకునే బాధ్యత సర్పంచ్‌ అభ్యర్థిదేనని స్పష్టం చేస్తున్నారు. 


గతంలోనూ బేరాలు

మైలవరం నియోజకవర్గంలో గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు జోరుగానే బేరాలు నడిచాయి. అప్పట్లో సర్పంచ్‌ సీటుకు రూ.30 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఎంపీపీ స్థానానికి రూ.కోటి, ఎంపీటీసీ స్థానానికి రూ.10 లక్షలు చొప్పున వసూలు చేశారని అప్పట్లో అభ్యర్థులే ఆరోపించారు. ఈసారి ఆ రేట్లు మరింత పెంచి మరీ వసూళ్లు ప్రారంభించారు. 


పంచాయతీకో రేటు

విజయవాడ డివిజన్‌ పరిధిలోని పంచాయతీలకు ఈ నెల 29 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. అయితే అధికార పార్టీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసేవారి నుంచి పంచాయతీ స్థాయి, ఓటర్ల సంఖ్య, రిజర్వేషన్లను బట్టి ముఖ్యనేత బామ్మర్ది ధర నిర్ణయించారు. ఐదు వేల ఓట్లున్న పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థిగా రంగంలో నిలిచే వ్యక్తి రూ.50 లక్షలు ముందుగా తమకు ముట్టచెప్పాలని బామ్మర్ది స్పష్టం చేస్తున్నారు. ఓ మోస్తరు పంచాయతీకే ఈ రేటు. అదే మేజర్‌ పంచాయతీలకు అయితే ఏకంగా కోటి సమర్పించుకోవాల్సిందే. 

Updated Date - 2021-01-27T06:27:02+05:30 IST