నూతన విద్యా విధానంతో భారత్ కీర్తి ప్రతిష్ఠల పునరుద్ధరణ : రాష్ట్రపతి కోవింద్

ABN , First Publish Date - 2020-09-19T18:10:11+05:30 IST

కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా దేశ కీర్తి ప్రతిష్ఠలు పునరుద్ధరించబడతాయని

నూతన విద్యా విధానంతో భారత్ కీర్తి ప్రతిష్ఠల పునరుద్ధరణ : రాష్ట్రపతి కోవింద్

న్యూఢిల్లీ : కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా దేశ కీర్తి ప్రతిష్ఠలు పునరుద్ధరించబడతాయని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. 2035 నాటికి విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 50 శాతానికి పెంచడం అన్నది నూతన విద్యా విధానంలో ఓ లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు. నూతన విద్యా విధానం -2020 పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రపతి కోవింద్ ప్రసంగించారు. ప్రాచీన కాలంలో భారత్ విద్యా కేంద్రంగా వెలుగొందిందని, తక్షశిల, నలంద విశ్వ విద్యాయాలతో పేరు ప్రఖ్యాతులు గాంచిందని ఆయన గుర్తు చేశారు.


కానీ నేటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, అంతర్జాతీయ ర్యాంకుల్లో దేశ యూనివర్శిటీలు గొప్ప గొప్ప స్థానాలను ఆక్రమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) అనేది ఈ విద్యా విధానంలో కీలకమైనదని, దీనివల్ల విద్యార్థులకు చాలా ఉపయోగం ఉంటుందని ఆయన తెలిపారు.


ఈ ఏబీసీ విధానంలో విద్యార్థులు సాధించిన ప్రగతి ఆధారంగానే వివిధ యూనివర్శిటీలు డిగ్రీ పట్టాను ప్రదానం చేస్తాయని అన్నారు. విద్యార్థుల అభిరుచులకు తగ్గట్లుగా వొకేషనల్ కోర్సులను, ప్రొఫెషనల్ కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత అవసరాల వల్ల చదువును ఆపేసినా... పరిస్థితులు చక్కబడ్డ తర్వాత తిరిగి చదువును కొనసాగించే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ర్యాంకులు, గ్రేడింగ్ విధానం తగ్గి, విద్యార్థుల్లో ప్రతిభ పెంపొందించడమే ఈ నూతన విద్యా విధానం లక్ష్యమని కోవింద్ తెలిపారు. 

Updated Date - 2020-09-19T18:10:11+05:30 IST