Joe Biden: అలా చేసిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే!

ABN , First Publish Date - 2022-01-07T15:56:36+05:30 IST

గతేడాది అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.. అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా గురువారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Joe Biden: అలా చేసిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే!

వాషింగ్టన్: గతేడాది అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.. అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా గురువారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలో అధికారమార్పిడి శాంతియుతంగా జరగకుండా చేసిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రమేనని దుమ్మెత్తిపోశారు. ట్రంప్​ చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. అమెరికా రాజకీయాలకు ట్రంప్ వల్ల తీవ్ర ముప్పు అని పేర్కొన్నారు. 


2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమిని అంగీకరించకుండా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లిక్ పార్టీ కార్యకర్తలు జనవరి 6న క్యాపిటల్ భవనంపై చేసిన దాడిని ఉద్దేశిస్తూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే పోలీసులపై దాడి చేయించడంతో పాటు స్పీకర్‌ను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని అధ్యక్షుడు విమర్శించారు. ట్రంప్‌ చర్యలను బైడెన్ ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంపై దాడి జరిగిన ఆ చీకటి రోజును ప్రజలంతా గుర్తుంచుకోవాలని బైడెన్‌ చెప్పారు. 


ఇదిలాఉంటే.. అధ్యక్షుడు జో బైడెన్ తనపై చేసిన వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. తన వల్ల రాజకీయాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని చెప్పడం సమంజసం కాదన్నారు. తన పేరును ఉపయోగించి దేశాన్ని విభజించాలని  చూస్తున్నారంటూ బైడెన్‌పై ట్రంప్ మండిపడ్డారు. "ఇవాళ నా పేరును వాడుకుని రాబోయే రోజుల్లో అగ్రరాజ్యాన్ని రెండుగా విభజించాలని చూస్తున్నారు. పాలనపరంగా బైడెన్ పూర్తిగా విఫలమయ్యారు. అది అందరికీ తెలుసు" అని ట్రంప్ దుయ్యబట్టారు.        

Updated Date - 2022-01-07T15:56:36+05:30 IST