test driveకు కారు తీసుకెళ్లి చోరీ...నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-16T16:38:40+05:30 IST

టెస్టు డ్రైవ్ పేరిట కారును చోరీ చేసిన ఓ వ్యాపారిని పోలీసులు ఐపీ అడ్రస్ సాయంతో ఎట్టకేలకు అరెస్టు చేసిన ఉదంతం...

test driveకు కారు తీసుకెళ్లి చోరీ...నిందితుడి అరెస్ట్

బెంగళూరు (కర్ణాటక): టెస్టు డ్రైవ్ పేరిట కారును చోరీ చేసిన ఓ వ్యాపారిని పోలీసులు ఐపీ అడ్రస్ సాయంతో ఎట్టకేలకు అరెస్టు చేసిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. బెంగళూరు కాఫీ బోర్డు లేఅవుట్ లో నివాసముంటున్న ఇంజినీర్ రవీంద్ర ఎల్లూరి(47)తన మారుతీ విటారా బ్రెజ్జా కారును ఓఎల్ఎక్స్ ఆన్‌లైన్ ప్లాట్ ఫారమ్‌లో విక్రయానికి ఉంచారు. బెంగళూరులోని అమృతనగర్ కు చెందిన వ్యాపారి ఎంజీ వెంకటేష్ నాయక్ కారు కొనేందుకు ఆసక్తి చూపించారు. జరవరి 30వతేదీన వచ్చి టెస్ట్ డ్రైవింగ్ పేరిట కారును యజమాని నుంచి తీసుకువెళ్లి చోరీ చేశాడు. దీంతో కారు యజమాని ఎల్లూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయక్ చిరునామా తెలియక పోవడంతో మొదట గుర్తుతెలియని వ్యక్తి అంటూ కేసు నమోదు చేశారు. 


మొబైల్ యాప్ ద్వారా నిందితుడిని గుర్తించేందుకు యత్నించినా ఫలితం లేదు. దీంతో పోలీసులు ఓఎల్ఎక్స్ కార్యాలయాన్ని సంప్రదించి బెంగళూరులో కార్ల కోసం వెతికిన 2,500 మంది ఐపీ అడ్రసులను పరిశీలించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 30వతేదీన కారును దొంగిలించగా, నిందితుడిని మే 10వతేదీన పట్టుకున్నారు.టెస్టు డ్రైవ్ పేరిట కారును దొంగిలించిన నాయక్ ఓఎల్ఎక్స్ లో అందించిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) చిరునామా ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు.పోలీసులు నిందితుడు నాయక్ ను అరెస్టు చేసి, చోరీ చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు.



నిందితుడు కారు చోరీ ఎందుకు చేశాడంటే...

తన భార్య 2020 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైందని నిందితుడు నాయక్ చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం కోసం తాను స్నేహితుల వద్ద అప్పు చేశానని, అప్పు తీర్చేందుకు తన కారును అమ్మేశానని నాయక్ పేర్కొన్నారు. తాను సొంత కారు లేకుండా గ్రామానికి వెళ్లడం అవమానంగా భావించి కారు చోరీ చేశానని నిందితుడు నాయక్ వివరించారు. తన నేరాన్ని నాయక్ అంగీకరించాడు.దొంగిలించిన తర్వాత కారు నంబర్‌ ప్లేట్‌ మార్చినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు నాయక్ ను స్థానిక కోర్టులో హాజరుపర్చగా,జడ్జి అతన్ని జ్యుడీషియల్ రిమాండుకు తరలించారు.


Updated Date - 2022-05-16T16:38:40+05:30 IST