రష్యా తీరును ఖండించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి

ABN , First Publish Date - 2022-03-02T23:48:27+05:30 IST

నిజానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఏ దేశం వైపున భారత్ తన అభిప్రాయాన్ని బహిర్గతంగా వ్యక్తం చేయలేదు. శత్రుత్వాన్ని విరమించుకోవాలని, శాంతిని కొనసాగించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది. ఇది అమెరికా సహ దాని మిత్ర దేశాలకు అంతగా రుచించడం లేదని వార్తలు గుప్పుమంటున్నాయి..

రష్యా తీరును ఖండించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. భారత్ తన తటస్థ వైఖరిని ఆపేసి.. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని ఆపేందుకు ప్రయత్నించాలని మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. మంగళవారం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి ఉక్రెయిన్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం భారతీయ విద్యార్థులను వెంటనే దేశానికి తరలించేందుకు ప్రభుత్వ సత్వర చర్యలకు దిగాలని, తటస్థ వైఖరిని నిలిపివేయాలని అంటున్నారు.


నిజానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఏ దేశం వైపున భారత్ తన అభిప్రాయాన్ని బహిర్గతంగా వ్యక్తం చేయలేదు. శత్రుత్వాన్ని విరమించుకోవాలని, శాంతిని కొనసాగించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది. ఇది అమెరికా సహ దాని మిత్ర దేశాలకు అంతగా రుచించడం లేదని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే కొంత మంది విద్యార్థులు స్వదేశానికి వచ్చినప్పటికీ, ఇంకా వేలాది మంది విద్యార్థులు ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. తరలింపు ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి రష్యాపై ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని ప్రతిపక్షాలు అంటున్నాయి.


ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం బుధవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘భారత ప్రభుత్వం తన తటస్థ విధానానికి స్వస్తి పలకాలి. ఉక్రెయిన్ నగరాలపై రష్యా చేస్తున్న బాంబు దాడులను వెంటనే ఆపేసేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి. బాంబు దాడులను ఆపేస్తే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. పరిస్థితులు బాగాలేవని తెలిసి కూడా భారతీయుల తరలింపులో ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఉక్రెయిన్ పరిస్థితి నమ్మేలా లేదు. విద్యార్థులు సహా అనేక మంది భారతీయుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. భారత్ ధైర్యంగా గట్టిగా మాట్లాడాలి. దాడులను ఆపమని రష్యాను డిమాండ్ చేయాలి’’ అని ట్వీట్ చేశారు.


రష్యాపై ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితి సమావేశమైన సందర్భంలో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అలాగే విదేశాల సార్వభౌమాధికారతను వారి ప్రాదేశిక వ్యవహారాలను గౌరవించాలని కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దీంతో రష్యాకు అనుకూలంగా భారత్ బలమైన స్టాండ్ తీసుకుందని కొందరు అంటున్నారు. భారత్‌కు రష్యా అనేక సందర్భాల్లో మద్దతుగా నిలిచింది. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్ వివాదల సమయంలో ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు రష్యా మద్దతుగా నిలిచింది. అలాగే భారత్‌కు ఎప్పటి నుంచో అతి పెద్ద రక్షణ పరికరాల ఎగుమతిదారుగా ఉంది.


‘‘ప్రస్తుతం రష్యా తీసుకున్న నిర్ణయం పట్ల, దాని వ్యవహారల శైలి పట్ల భారత్ చాలా అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బయటికి వెల్లడించే పరిస్థితి లేదు’’ అని రక్షణ, భౌగోళిక పరిశోధకులు హర్ష పంత్ అన్నారు. ఇండియన్ మిలిటరీకి చెందిన 60 శాతం హర్డ్‌వేర్ రష్యా తయారు చేసేదేనని, భవిష్యత్‌లో మాస్కోతో భారత్‌కు మరిన్ని అవసరాలు ఉన్నాయని, వాటి దృష్ట్యా రష్యాకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించబోదని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-02T23:48:27+05:30 IST