ఫీజులుం..!

ABN , First Publish Date - 2021-06-24T06:09:10+05:30 IST

కొవిడ్‌తో ప్రజలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటుంటే పాఠశాల యాజమాన్యాలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై తీవ్ర వత్తిడి చేస్తున్నాయి. అది కూడా గత సంవత్సరానిది కావడం గమనార్హం. కరోనా నేపఽథ్యంలో విద్యాసంస్థలు మూతబడ్డాయి. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరుగుతుండడంతో ఏప్రిల్‌

ఫీజులుం..!

ఫీజుల కోసం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల ఒత్తిడి
స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
చితికిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు


కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య జనం వైద్యం, ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అప్పులపాలవుతున్నారు. ఇటువంటి సమయంలో పాఠాలు చెప్పకుండానే.. తరగతి గదిలో పిల్లలు కూర్చోకుండానే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇంతచేసినా ఇందులో అధిక శాతం యాజమాన్యాలు వారి సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం గమనార్హం.

కడప(ఎడ్యుకేషన), జూన 23: కొవిడ్‌తో ప్రజలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటుంటే  పాఠశాల యాజమాన్యాలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై తీవ్ర వత్తిడి చేస్తున్నాయి. అది కూడా గత సంవత్సరానిది కావడం గమనార్హం. కరోనా నేపఽథ్యంలో విద్యాసంస్థలు మూతబడ్డాయి. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరుగుతుండడంతో ఏప్రిల్‌ తొలి వారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పది, ఇంటర్‌ పరీక్షలను సైతం వాయిదా వేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలను సైతం నిలిపివేశారు. ఇటువంటి విపత్కర సమయంలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆనలైన బోధన పేరిట ఫీజుల వసూళ్లకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు కట్టాలని ఫోన్లకు మెసేజ్‌లు పంపడంతో పాటు నేరుగా తల్లిదండ్రులకు ఫోను చేసి ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడంతో సామాన్య, మధ్యతరగతికి చెందిన వారు తమ పిల్లల ఫీజులు కట్టలేమని తెగేసి చెబుతున్నారు. కొందరైతే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కొంత మొత్తం చెల్లిస్తున్నారు.

ఆనలైన పేరుతో
లాక్‌డౌన భయంతో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముందుగానే ఫీజులు వసూలు చేశాయి. గత ఏడాది జూలై, ఆగస్టు నుంచి ఆనలైన క్లాసుల పేరుతో ఫీజుల దందా మొదలుపెట్టాయి. ఎవరైనా సమయానికి ఫీజులు చెల్లించకపోతే పాస్‌వర్డ్‌ ఇవ్వకుండా ఆనలైన తరగతులకు అనుమతించకుండా ఇబ్బంది పెట్టాయి. దీంతో తల్లిదండ్రులు కరోనా  కష్టకాలంలో అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లించిన ఉదంతాలు ఉన్నాయి.

ముందుగానే వసూళ్లు
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌కు సంబంధించి 1,253 పాఠశాలలున్నాయి. గత ఏడాది కరోనా వ్యాప్తితో మార్చి 22 నుంచి లాక్‌డౌన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పాఠశాలలు మూతబడ్డాయి. కరోనా ఉధృతి నేపఽథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభంలో తీవ్రజాప్యం జరిగింది. నవంబరు 5తేదీన 9, 10 తరగతులు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 14న 8వ తరగతి, జనవరి 18న 6, 7, తరగతులను ప్రారంభించారు. ఫిబ్రవరి 1న 1 నుంచి 5వ తరగతి ప్రారంభమయ్యాయి. కరోనా సెకండ్‌వేవ్‌తో ఏప్రిల్‌ తొలివారం నుంచి కేసులు పెరగడంతో ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేసింది. పది, ఇంటర్‌ పరీక్షలు సైతం వాయిదా వేసింది. అయితే కొన్ని యాజమాన్యాలు గత ఏడాది నవంబరు, డిసెంబరులోనే అధికశాతం ఫీజులు వసూలు చేశారు. జనవరిలో ప్రభుత్వం అమ్మఒడి నగదు వేసినప్పుడే తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేశారు. సాధారణంగా ట్యూషన ఫీజు ప్రతి మూడు నెలలకొకసారి వసూలు చేయాలి. తరగతులు ప్రారంభించి సుమారు 80 రోజులే అయింది. 6, 7 తరగతులు ప్రారంభించి 96 రోజులు పూర్తయింది. 8, 9, 10 తరగతులు మాత్రం నాలుగు నెలలు దాటింది. మూడు నెలల ఫీజుల వసూలు ప్రామాణికంగా తీసుకోకుండా విద్యా సంవత్సరాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని కొన్ని యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి.

పాఠశాలలు మూతబడినా..
ప్రస్తుతం అన్ని పాఠశాలలు మూతబడ్డాయి. ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా లేరు. తమకు వేతనాలు అందడంలేదని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. అటు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకున్నా, ఇటు పాఠశాలల్లో కనీస నిర్వహణ ఖర్చులు  లేకున్నా ఫీజులు వసూలు చేస్తుండడం అందరినీ విస్మయపరుస్తోంది. కొన్ని యాజమాన్యాలైతే ఫీజులు కడితేనే మీకు ఆనలైన తరగతులకు పాస్‌వర్డ్‌ ఇస్తామని బెదిరింపు ఽధోరణిలో మాట్లాడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజులు చెల్లించి పాస్‌వర్డ్‌ పొందుతున్నారు. చిరుద్యోగులు, ఉపాధి లేక సతమతమవుతున్న కార్మిక కుటుంబాలు మాత్రం వెనకడుగు వేస్తున్నాయి అధికారులు కూడా ఫీజులు చెల్లించాలో లేదో స్పష్టత ఇవ్వడంలేదు. ఈ విషయంలో ప్రైవేటు యాజమాన్యాల వత్తిళ్లు  అధికారులపై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చెల్లించిన మొత్తాన్ని సరిపెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఒత్తిడి తెస్తే చర్యలు తప్పవు
- డీఈవో శైలజ

ప్రస్తుతం పాఠశాలలు మూతబడ్డాయి. ఈ సమయంలో ఫీజులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఆనలైన తరగతుల నిర్వహణ విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఎక్కడైనా ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి.

Updated Date - 2021-06-24T06:09:10+05:30 IST