కొందరికే ఎంఎస్‌ఎంఈ రాయుతీలు

ABN , First Publish Date - 2020-07-11T09:59:58+05:30 IST

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా మారింది రాష్ట్రంలోని ఐటీ కంపెనీల పరిస్థితి. కేంద్రం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’

కొందరికే ఎంఎస్‌ఎంఈ రాయుతీలు

ఐటీ కంపెనీలకు మొండిచేయి 

విద్యుత్‌ మినిమమ్‌ డిమాండ్‌ చార్జీలకు ఒత్తిడి


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా మారింది రాష్ట్రంలోని  ఐటీ కంపెనీల పరిస్థితి. కేంద్రం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, వ్యాపారులను ఆదుకోవడానికి కోట్ల రూపాయలు రాష్ట్రాలకు విడుదల చేయగా... అవి ఆంధ్రప్రదేశ్‌లో అర్హులకు సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు బకాయిపడిన రాయితీలను ఇస్తున్నామని పరిశ్రమల శాఖ ప్రకటించింది. రెండు విడతలుగా నిధులు విడుదల చేసింది. అయితే అందులో కేవలం తయారీ రంగానికి చెందిన సంస్థలకే తప్ప సేవా రంగానికి చెందిన సంస్థలకు నిధులు విడుదల చేయలేదు. ఎవరైనా జిల్లా పరిశ్రమల కేంద్రంలో తమ సంస్థలను నమోదు చేసుకుని, వారి ద్వారా దరఖాస్తు పెట్టుకున్న వారికే రాయితీ బకాయిలు అందజేశారు.


ఐటీ కంపెనీలు సేవా రంగంలోకి వస్తాయి. వాటిని జిల్లా పరిశ్రమల కేంద్రంలో రిజిస్టర్‌ చేయడం లేదు. దాంతో వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీల బకాయిలు విడుదల కాలేదు. సుమారుగా రూ.60 కోట్లు వరకు రావలసి ఉంది. ఏపీలో ఐటీ కేంద్రంగా విశాఖపట్నమే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి రుషికొండ ఐటీ పార్కుతోపాటు నగరంలోని టెక్‌ హబ్‌, ఇతర ప్రాంతాల్లో సుమారు 200 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో 20 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. గతంలో ఎంత మందికి ఉపాధి కల్పించారో లెక్కలు వేసి ఆ ప్రకారం రాయితీలు ఇస్తామని ప్రకటించింది. దాంతో విశాఖపట్నంలో వందల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన అనేక కంపెనీలు రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఎవరికీ ఇప్పటివరకు రూపాయి కూడా మంజూరు చేయలేదు. ఐటీ మంత్రి గౌతం రెడ్డికి విన్నవిస్తే.. త్వరలోనే మంజూరు చేస్తామని, దశల వారీగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇపుడు కేంద్రం సాయం చేసినా... తమకు బకాయిలు రాలేదని, ఇది చాలా అన్యాయమని ఐటీ కంపెనీల ప్రతినిధులు వాపోతున్నారు.


విద్యుత్‌ మినిమమ్‌ డిమాండ్‌ చార్జీల్లోనూ అదే ధోరణి

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో  ఐటీ కంపెనీలను కూడా మూసేశామని, అయినా ఈపీడీసీఎల్‌ విద్యుత్‌ కోసం మినిమమ్‌ డిమాండ్‌ చార్జీలు చెల్లించాలని ఒత్తిడి తెస్తోందని, వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని పరిశ్రమ ప్రతినిధులు కోరారు. దానికి ప్రభుత్వం స్పందించి ఎంఎస్‌ఎంఈలకు మూడు నెలల మినిమమ్‌ డిమాండ్‌ చార్జీలు రద్దు  చేస్తున్నామని ప్రకటించింది. దాంతో కంపెనీల యజమానులు తమ విద్యుత్‌ బిల్లులో ఆ డిమాండ్‌ చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాలను చెల్లించారు. అయితే ఈపీడీసీఎల్‌ అధికారులు మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ప్రభుత్వం నుంచి తమకు ప్రత్యేకంగా ఉత్తర్వులు ఏమీ రాలేదని, ముందు బిల్లు మొత్తం కట్టేసి, ఆ తరువాత మినిమమ్‌ డిమాండ్‌ చార్జీల కోసం రీఎంబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. బకాయిలు పెడితే విద్యుత్‌ సర్వీసు డిస్‌కనెక్ట్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంలోనే వివిధ శాఖల మధ్య ఈ ద్వంద్వ వైఖరి ఏమిటంటూ ఐటీ కంపెనీల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. కరోనా వల్ల వ్యాపారాలు దెబ్బతిని చేతిలో డబ్బులు లేవని, ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే... వాడని విద్యుత్‌కు చార్జీలు కట్టమని ఒత్తిడి చేయడం తగదని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరుతున్నారు. 


మాట నిలుపుకోవాలి: ఓ.నరేశ్‌కుమార్‌, రుషికొండ ఐటీ పార్క్‌ అసోసియేషన్‌

ప్రభుత్వం రాయితీల బకాయిలు దశలవారీగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఏడాది అయిపోయింది. ఇపుడు మిగతా రంగాలకు ఇచ్చి ఐటీకి ఇవ్వకపోవడం అన్యాయం. విద్యుత్‌ మినిమమ్‌ డిమాండ్‌ చార్జీలు వసూలు చేయవద్దని డిస్కమ్‌లను ఆదేశించాలి. 

Updated Date - 2020-07-11T09:59:58+05:30 IST