సన్నాలను నొక్కేస్తున్నారు

ABN , First Publish Date - 2022-04-14T05:30:00+05:30 IST

జిల్లాలో సన్న రకం వరి ధాన్యాన్ని పండించిన రైతులను దళారులు దగా చేస్తున్నారు. సన్న రకం ధాన్యానికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సన్నాలను నొక్కేస్తున్నారు
బీర్కూర్‌లో పంట పొలాల వద్దనే సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న దృశ్యం

- సన్న రకం ధాన్యం రైతులను దగా చేస్తున్న దళారులు

- మద్దతు ధర కంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న వైనం

- సన్నాలకు మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడమే కారణం

- ప్రభుత్వం అంతంత మాత్రంగానే కొనుగోలు

- దిక్కు తోచక దళారులకు విక్రయిస్తున్న రైతులు

- నష్టపోతున్న అన్నదాతలు

- జిల్లాలో 1.47 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం దిగుబడులు


కామారెడ్డి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సన్న రకం వరి ధాన్యాన్ని పండించిన రైతులను దళారులు దగా చేస్తున్నారు. సన్న రకం ధాన్యానికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని దొడ్డు రకం కాకుండా సన్న రకం సాగు చేస్తే బహిరంగా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో రైతులు యాసంగిలో వేల ఎకరాల్లోనే సన్న రకం వరిని సాగు చేశారు. ఎన్నో కష్టాలను అధిగమించి పండించిన ధాన్యాన్ని దళారులు గద్దల్లా తన్నుకపోతున్నారు. ప్రభుత్వం దొడ్డు, సన్న రకానికి ఒకే మద్దతు ధరను ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు పంట చేనులోని కళ్లాల వద్దనే సన్న రకం ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 60వేల ఎకరాలకు పైగా సన్నాల సాగు

యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వాలు ప్రకటించాయి. కేంద్రం సైతం బాయిల్డ్‌ రైస్‌ తీసుకుబోమని, రారైస్‌ మాత్రమే ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తామని సూచించింది. దీంతో జిల్లా రైతులు దొడ్డు రకంతో పాటు సన్న రకం వరి ధాన్యాన్ని సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 1.61 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో లక్ష ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు కాగా 61 వేల ఎకరాల్లో సన్న రకం వరి రైతులు సాగు చేశారు. సన్న రకం వరిని ఎక్కువగా బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌, బిచ్కుంద, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట తదితర మండలాల్లో రైతులు సాగు చేశారు. అయితే సాగుకు తగ్గట్టుగా 1.47 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో దొడ్డు రకానికి ఏ ధర ఉందో అదే ధర సన్నాలకు ఉంది. బహిరంగ మార్కెట్‌లో సన్నాలకు ఎక్కువగా ధర వస్తుందని ప్రభుత్వాలు చెప్పడంతో దిగుబడులు తక్కువ వచ్చినప్పటికీ సన్నాలనే సాగు చేశారు. తీరా బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా పలకడం లేదు.

సన్నాలకు మద్దతు ధర కరువు

జిల్లాలో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర కరువవుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాల్లో ఈ సంవత్సరం యాసంగి సీజన్‌లో బీపీటీకి, ఆర్‌ఎన్‌ఆర్‌, బాపట్ల, గంగా కావేరిలతో పాటు నూతనంగా బీపీటీ-95 సన్న రకం వరిని సాగు చేశారు. గతంలో ఇవి సాగు చేసిన రైతులకు రూ.1900 నుంచి రూ.2వేల వరకు ధర రావడంతో లాభలను ఆర్జించారు. ఈ సారి కూడా అదే ఆశతో సాగు చేశారు. జోరుగా కురుసిన వర్షాలతో పంటను ఇళ్లలో నిల్వ చేసుకోలేక, గిట్టుబాటు ధరకు కొనే నాథుడే లేక దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఒకవేళ నిల్వ చేసుకుందామంటే పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దండుకుంటున్న దళారులు

జిల్లాలో సన్న రకం ధాన్యం రైతులను దళారులు దండుకుంటున్నారు. ప్రభుత్వం తరపు నుంచి మద్దతు ధర లేకపోవడంతో ఇదే అదునుగా భావించి ప్రైవేట్‌ వ్యాపారులు దళారులతో కలిసి సన్నరకం వరి ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు ప్రభుత్వ ప్రకటనను నమ్మి సన్నాలను సాగు చేశారు. దిగుబడులు తక్కువగా వస్తాయని తెలిసినప్పటికీ దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయరేమోనని సన్న రకం వరి వైపే మొగ్గు చూపారు. తీరా పంట చేతికొచ్చింది. మరోవైపు ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. చేతికొచ్చిన పంటను రోజుల తరుబడి అలాగే ఉంచలేక తప్పని పరిస్థితుల్లో దళారులకు విక్రయిస్తున్నారు. కోతల ప్రారంభంలో దళారులు సన్న రకం ధాన్యాన్ని రూ.1,910 ధరకు కొనుగోలు చేయగా ఇప్పుడు రూ.1,400 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా అదును చూసి దళారులు సన్న రకం రైతుల వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. గిట్టుబాటు కాకపోయినా చేసేదేమిలేక అన్నదాతలు వారికే విక్రయిస్తున్నారు.

వ్యాపారులకు పరోక్ష సహకారం

జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు వ్యాపారులకు పరోక్ష సహకారం అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వరి కోతలు ప్రారంభం కాగానే మార్కెట్‌ యార్డులలో బీట్‌లు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యానికే మద్దతు ధర లభిస్తోంది. సన్న రకం ధాన్యానికి గ్రేడ్‌ టు రకం కింద పరిగణిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్న రకం ధాన్యానికి డిమాండ్‌ ఉండటంతో వ్యాపారులకు పరోక్షంగా తోడ్పాటు అందిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌ యార్డులలో బీట్‌ నిర్వహిస్తే వ్యాపారుల మధ్య పోటీ పెరిగి అన్నదాతలు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌, మిర్యాలగూడ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, గుజరాత్‌ రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు దళారుల ద్వారా సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. జిల్లాలో బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ, బిచ్కుంద మండలాల్లో దళారులు ప్రత్యేకంగా దుకాణాలు తెరిచి బహిరంగంగానే వ్యాపారం నిర్వహిస్తున్నా చర్యలు తీసుకున్న వారే లేకపోయారు.


దళారులు దోచుకుంటున్నారు

- ఓంకార్‌, వరి రైతు, బీర్కూర్‌

బీర్కూర్‌ శివారులో నాకున్న నాలుగు ఎకరాల్లో సన్న రకం వరి ధాన్యాన్ని సాగు చేశాను. మంచి దిగుబడులే వచ్చాయి. ప్రభుత్వ పరంగా మంచి ధర ఉంది. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యాన్ని దాచుకునే పరిస్థితులు లేక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదే అదనుగా భావించి క్వింటాల్‌కు రూ.1,400లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాల్‌కు రూ.500 చొప్పున నష్టపోవాల్సి వస్తోంది.


పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు

- ఎస్‌కే యాకుబ్‌, రైతు, నస్రుల్లాబాద్‌

దళారులకు, ప్రైవేట్‌ వ్యక్తులకు వరి ధాన్యం అమ్మితే పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తూ వారు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తున్నారు. మరో దారిలేక పెట్టుబడులకు పెట్టిన అప్పులను తీర్చుకునేందుకు ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నాం.

Updated Date - 2022-04-14T05:30:00+05:30 IST