పైన పదహారు నొక్కేస్తున్నారు

ABN , First Publish Date - 2020-12-05T05:38:19+05:30 IST

ఆసరా పింఛన్ల పంపిణీలో కొందరు సిబ్బంది పైన రూ.16 నొక్కేస్తున్నారు. చిల్లర లేదనే సాకుతో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన మొత్తంలో నుంచి రూ.16ను స్వాహా చేస్తు న్నారు. చిల్లరే కదా అనుకుని లబ్ధిదారులు వదిలేస్తుండగా ఇదే అదును గా భావిస్తున్న సదరు పింఛన్‌ చెల్లింపు సిబ్బంది రూ. లక్షల్లో దండు కుంటున్నారు.

పైన పదహారు నొక్కేస్తున్నారు

ఆసరా పింఛన్ల చెల్లింపుల్లో సిబ్బంది నిర్వాహకం

రూ.లక్షల్లో స్వాహా.. మోసపోతున్న పింఛన్‌దారులు

జిల్లాలో మొత్తం 67,652 లబ్ధిదారులు

ప్రతి నెలా రూ.14,35,02,432 చెల్లింపులు

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 4: ఆసరా పింఛన్ల పంపిణీలో కొందరు సిబ్బంది పైన రూ.16 నొక్కేస్తున్నారు. చిల్లర లేదనే సాకుతో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన మొత్తంలో నుంచి రూ.16ను స్వాహా చేస్తు న్నారు. చిల్లరే కదా అనుకుని లబ్ధిదారులు వదిలేస్తుండగా ఇదే అదును గా భావిస్తున్న సదరు పింఛన్‌ చెల్లింపు సిబ్బంది రూ. లక్షల్లో  దండు కుంటున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 67వేల652 మంది ఉన్నారు. ఇందులో వృద్ధులు 58304, వికలాంగులు 7116, ఒంటరి మహిళలు 2232 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.14,35,02,432 ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇందులో దివ్యాంగులకు రూ.3,016 వృద్ధులు, ఇతరులకు రూ.2,016 చొప్పున చెల్లిస్తోంది. అయితే ఇందులో లబ్ధిదారులకు వెళ్లాల్సిన పైన చిల్లర పైసలు ఇవ్వడం లేదని మావల, ఆదిలాబాద్‌, జైనథ్‌తో పాటు ఉట్నూర్‌, బోథ్‌, నేరడిగొండ, సిరికొండ, గుడిహత్నూర్‌, ఇచ్చోడ మండలాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతి నెలా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీతో పాటు చుట్టు పక్క మండలాల్లో వేల మంది లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లలో పింఛన్‌ డబ్బులు వేస్తున్నారు. మిగతా వారికి పోస్టాఫీసుల వారీగా బ్యాంకుల్లో జమ అయిన పైసలను బీపీఎంలు డ్రా చేసి గ్రామాల్లోని లబ్ధిదారులకు పంపణీ చేయాల్సి ఉంటుంది. ఆసరా పింఛన్ల పంపిణీలో ఇప్పుడు చిల్లర పెద్ద సమస్యగా మారింది. చిల్లర తెచ్చిన లబ్ధిదారులకు మొత్తం సొమ్ము ఇస్తుండగా, చాలా మందికి చిల్లర లేవనే సాకుతో ఇవ్వడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 40నుంచి 50శాతం మంది లబ్ధిదారులకు మీది పైసలు చెల్లించడం లేదు.  ఈ లెక్కన నెలకు రూ.లక్షల సొమ్ము పక్కదారి పడుతోంది. అధికారులకు తెలిసిన చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

రూ. లక్షల్లో స్వాహా..

ప్రతి నెలా పింఛన్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా రూ.3016, రూ.2016 చొప్పున చెల్లిస్తోంది. ఇందులో కొందరు సిబ్బంది, బీపీఎంలు రూ.16 చొప్పున ఇవ్వకుండా స్వాహా చేస్తున్నట్లు స్థానికులు చెబుతు న్నారు. నెల రోజుల క్రితం తాంసి మండలంలో ఓ గ్రామంలో  వృద్ధురాలు తనకు వితంతువు పింఛన్‌ రూ2016 లు ఇవ్వాల్సి ఉండగా చిల్లర లేవనే సాకుతో రూ.16 ఇవ్వడం లేదని ప్రశ్నించింది.

మొత్తం డబ్బులు ఇవ్వాల్సిందే : రాజేశ్వర్‌ (డీఆర్డీఏ పీడీ)

ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు వస్తున్న ఆసరా పింఛన్ల డబ్బులు మొత్తం ఇవ్వాల్సిందే. ఆసరా పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు చిల్లర లేవని మీది పైసలు ఇవ్వక పోవడం సరైంది కాదు. మొత్తం పైసలు ఇవ్వాలని స్టాఫ్‌కు పలుమార్లు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడైనా చిల్లర  ఇవ్వని పరిస్థితి వచ్చినట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-12-05T05:38:19+05:30 IST