అలుగు కోసం అలుపెరుగని పోరాటం

ABN , First Publish Date - 2022-05-19T06:47:33+05:30 IST

రాయలసీమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణవాయువైన సిద్ధేశ్వరం అలుగు కోసం అలుపెరుగని పోరాటం చేద్దామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.

అలుగు కోసం అలుపెరుగని పోరాటం

రాయలసీమ సాగునీటి సాధన సమితి 

అధ్యక్షుడు బొజ్జా 

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మే 18: రాయలసీమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణవాయువైన సిద్ధేశ్వరం అలుగు కోసం అలుపెరుగని పోరాటం చేద్దామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం జలదీక్షపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రాయలసీమ సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు డాక్టర్‌ అప్పిరెడ్డి హరినాథరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. సీమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం దారుణమని మండిపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులను కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతించిన ప్రాజెక్టులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రత, పూడిక సమస్య నేపథ్యంలో సిద్ధేశ్వరం వద్ద వంతెనతోపాటు అలుగు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. పొతిరెడ్డిపాడు వద్ద కరువు నేలకు నీరందాలంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తప్పనిసరి అన్నారు. అనంతపురం జిల్లాకు హంద్రీనీవా నీరు అందాలంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణమే శరణ్యమని అన్నారు. అలుగు నిర్మించకుండా, వంతన కట్టే ప్రయత్నాల్ని సీమ ప్రజానీకం పక్షాన వ్యతిరేకిస్తామని పునరుద్ఘాటించారు. ఈ నెల 31న నంద్యాల జిల్లాలోని సిద్ధేశ్వరం వద్ద జరిగే జలదీక్షకు అన్నివర్గాల ప్రజానీకం హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతుకూలీ సంఘం నాయకులు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, జలసాధన సమితి అధ్యక్షుడు రాంకుమార్‌, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థల నాయకులు నాగరాజు, అశోక్‌రెడ్డి, వీరనారప్ప, ప్రకాష్‌, వీరేంద్ర, జగదీష్‌, రవికుమార్‌, దామోదర్‌ రెడ్డి, రాయుడు, శ్రీరాములు, మురళి, జగదీష్‌, ప్రముఖ సాగునీటి నిపుణులు పాణ్యం సుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాస్త్రవేత్త కంతూరు శ్రీనివాసరెడ్డి, ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి, ప్రజాసంఘాల నాయకులు బంగి సుదర్శన, రాహుల్‌, కవులు, రచయితలు, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T06:47:33+05:30 IST