భూమిలేని పేదలకు మిగులు భూమిని పంచాలి

ABN , First Publish Date - 2021-02-27T06:38:01+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు కాదని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ)జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్‌

భూమిలేని పేదలకు మిగులు భూమిని పంచాలి

కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే


పంజాగుట్ట, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): నూతన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు కాదని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ)జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. కులాల వారీగా జనాభా లెక్కలు చేపడితే ఎవరి జనాభా ఎంత ఉందో తెలుస్తుందని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు పైగా మిగులు భూమి ఉందని, దానిని భూమి లేని పేద కుటుంబాలకు ఐదు ఎకరాల చొప్పున పంపిణీ చేస్తే 4 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భూమి లెక్కలు తయారు చేయాలని, దీనికోసం ప్రత్యేక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలన్నారు. మే 4న హైదరాబాద్‌లో, మే 5న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సులను నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆర్పీఐ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్‌. అనుపమ, ఏపీ రాష్ట్ర విభాగం అధ్యక్షురాలిగా డాక్టర్‌. దేనాను ఆయన నియమించారు. సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఇన్‌చార్జి పేరం శివనాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


‘దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి’


 దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్‌కు కేటాయించిన విధంగానే దివ్యాంగులకు కూడా రెండు సీట్లు కేటాయించేలా కృషి చేస్తానన్నారు. అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దక్షిణ భారత దివ్యాంగుల సదస్సు, ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వేదిక ఆధ్వర్యంలో తమ డిమాండ్లపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జె.పరశురాం, జాతీయ సలహాదారు అశోక్‌ కుమార్‌, వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:38:01+05:30 IST