కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల వేడి

ABN , First Publish Date - 2022-09-22T07:19:26+05:30 IST

కాంగ్రె్‌సలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ పోటీచేయడం దాదాపు ఖాయమైపోయింది.

కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల వేడి

కార్యకర్తలు కోరితే నామినేషన్‌.. కాంగ్రెస్‌  అన్నీ ఇచ్చింది

నేనూ రేసులో ఉన్నా: దిగ్విజయ్‌ 

పీసీసీల నుంచి ఆగని ‘ఏకగ్రీవ’ తీర్మానాలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: కాంగ్రె్‌సలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ పోటీచేయడం దాదాపు ఖాయమైపోయింది. ఆయనపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ సైతం పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గహ్లోత్‌ బుధవారమిక్కడ 10-జన్‌పథ్‌లో తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాతో సమావేశమయ్యారు. రాజస్థాన్‌ రాజకీయాలు.. తన తర్వాత అక్కడ ఎవరు సీఎం అవుతారు.. కొన్నాళ్లపాటు తాను జోడు పదవుల్లో కొనసాగడం తదితరాలపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి మంగళవారమే ఆయనకు అధ్యక్ష ఎన్నికపై పూర్తి స్పష్టత వచ్చింది.


సీఎం పీఠంపై తన ప్రత్యర్థి సచిన్‌ పైలట్‌ను కూర్చోబెట్టడానికి వీల్లేదని, తన అదుపాజ్ఞల్లో ఉండే నేతనెవరినైనా ఎంపిక చేయాలని సోనియాను ఆయన కోరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో మంగళవారం రాత్రి జైపూర్‌లో ఆయన సమావేశమవడం గమనార్హం. ఢిల్లీలో ఉన్న పైలట్‌ ఈ భేటీకి రాలేదు. సోనియాతో భేటీకి ముందు బుధవారం గహ్లోత్‌ మీడియాతో మాట్లాడారు.


పార్టీ పగ్గాలు మళ్లీ చేపట్టాల్సిందిగా అగ్రనేత రాహుల్‌గాంధీని ఒప్పించేందుకు చిట్టచివరి ప్రయత్నం చేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు కోరితే నామినేషన్‌ వేస్తానన్నారు. కాంగ్రెస్‌ తనకు అన్నీ ఇచ్చిందని, 40-50 ఏళ్లుగా తాను పదవుల్లో ఉన్నానని వ్యాఖ్యానించారు. శశి థరూర్‌ పోటీ గురించి ప్రస్తావించగా.. పోటీ జరగాల్సిందేనని.. అంతర్గత ప్రజాస్వామ్యానికి అది మంచిదని బదులిచ్చారు. గురువారం ఆయన కేరళలోని కోచీ చేరుకుని ‘భారత్‌ జోడో యాత్ర’లో ఉన్న రాహుల్‌తో భేటీ అవుతారు. తాను తటస్థంగా ఉంటానని.. ఎవరి పక్షానా నిలవనని గహ్లోత్‌కు సోనియా చెప్పినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. మరోవైపు.. కాంగ్రె్‌సలో జోడు పదవులు కుదరవని.. గహ్లోత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని రాహుల్‌కు అత్యంత సన్నిహితుడైన సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికల రేసులో తాను కూడా ఉన్నానని ప్రకటించారు. 


తెలంగాణ, పంజాబ్‌ పీసీసీల తీర్మానాలు

ఇంకోవైపు.. రాహుల్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలంటూ పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూనే ఉన్నాయి. బుధవారం తెలంగాణ, పంజాబ్‌ పీసీసీలు కూడా రాహుల్‌ అధ్యక్ష పదవి చేపట్టాలని తీర్మానించాయి. సల్మాన్‌ ఖుర్షీద్‌, పి.చిదంబరం వంటి సీనియర్‌ నేతలు కూడా పార్టీ బలోపేతానికి రాహుల్‌నే అధ్యక్షుడిని చేయాలని.. అందరూ కలిసి ఒప్పించాలని కోరడం గమనార్హం.

Updated Date - 2022-09-22T07:19:26+05:30 IST