Abn logo
Oct 1 2020 @ 03:03AM

నువ్వు అబద్ధాలకోరువి.. నోర్ముయ్.. నువ్వో సర్కస్ జోకర్‌వి..

Kaakateeya

బదులివ్వలేక అడ్డగోలు వాదన.. పదే పదే వ్యక్తిగత దాడి

73 సార్లు అడ్డగింత.. తొలి చర్చను కీచులాటగా మల్చిన ట్రంప్‌


నేను లేకుంటే కొవిడ్‌ మృతులు 20 లక్షలు దాటేవి.. మితవాద గ్రూపులకు సమర్థన

ఆర్థికం భేష్‌.. ఉద్యోగ కల్పనా మెరుగు.. ట్రంప్‌ వ్యాఖ్యలు.. కొట్టిపడేసిన బైడెన్‌


నువ్వు పచ్చి అబద్ధాలకోరువి... అతివాద వామపక్ష విధానాల్ని సమర్థిస్తావా? నీ కొడుకు వ్యాపారం కోసం ఉపాధ్యక్ష పదవి వాడుకుంటావా?క్లాసులో లాస్ట్‌ వచ్చావ్‌.. నీకేం తెలుసు? 47 ఏళ్లుగా అమెరికాకు ఏం చేశావ్‌?

- డొనాల్డ్‌ ట్రంప్‌


నోర్ముయ్‌... నువ్వో విదూషకుడివి, సర్కస్‌ జోకర్‌వి.. పుతిన్‌ దగ్గర కుక్కపిల్లవి.. జాత్యహంకారివి.. నీ అసమర్ధతతో వేలమంది చనిపోయారు.. అధ్యక్షపదవికి నువ్వు అనర్హుడివి...


- జో బైడెన్‌


క్లీవ్‌లాండ్‌, సెప్టెంబరు 30: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన అభ్యర్థుల మధ్య జరిగిన తొలి ముఖాముఖి చర్చ పూర్తిగా రసాభాస అయింది. అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌లిద్దరూ పరస్పరం దూషించుకుంటూ, అరుచుకుంటూ, ఒకరిపై మరొకరు అభాండాలు మోపుకుంటూ దీన్ని సాగించారు తప్ప ఒక్క విధానంపై కూడా ఆసక్తికర, నిర్మాణాత్మక చర్చ జరపలేదు. ఆధునిక చరిత్రలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు ఇంత నీచంగా, అసహ్యంగా, అతి దారుణంగా పరస్పరం తిట్టిపోసుకున్న సందర్భాలు లేవని విశ్లేషకులంటున్నారు. ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో బుధవారం జరిగిన ఈ చర్చలో బైడెన్‌ను ట్రంప్‌ పదేపదే అడ్డుకున్నారు. ఎన్‌బీసీ లెక్క ప్రకారం కనీసం 73 సార్లు ట్రంప్‌ తన ప్రత్యర్థి చెప్పేది వినకుండానే అడ్డుపడ్డారు. దీంతో సాత్విక స్వభావం ఉన్న బైడెన్‌ ఒక దశలో ‘కాస్త నోరు మూస్తారా..’ అని విసుగ్గా అన్నారు. అంతేకాక ట్రంప్‌కు ఓ పద్ధతీ పాడూ లేదని, రోజుకో తీరు అనీ, సర్క్‌సలో జోకర్‌లాంటివాడని హేళన చేశారు. ఆయన పుతిన్‌ దగ్గర పెంపుడు కుక్కపిల్ల అనీ, అబద్ధాలకోరని ఘాటు గా వ్యాఖ్యానించారు. అంతకుముందు ట్రంప్‌ కూడా బైడెన్‌ అతివాద వామపక్షవాది అనీ, దేశం పట్ల అనురక్తి లేదనీ, తన కుమారుడి వ్యాపారం కోసం దేశ ఉపాధ్యక్ష పదవిని వాడుకున్నారని దుయ్యబట్టారు. 


ఇన్షా అల్లా..

వేల డాలర్ల మేర తాను పన్ను ఎగవేసినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, నిజానికి తన కంపెనీలు పన్ను రూపేణా లక్షల డాలర్ల మేర చెల్లించాయని ట్రంప్‌ సమర్థించుకున్నారు. అధ్యక్షుడైన తొలి రెండేళ్లలో 2016, 17ల్లో ట్రంప్‌ కేవలం 750 డాలర్లు మాత్రమే పన్ను చెల్లించారనీ, అంతకు ముందు పదిహేనేళ్లుగా ఆయన ఆదాయపు పన్ను ఎగవేశారని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని బైడెన్‌ లేవనెత్తినపుడు- మీకు త్వరలోనే టాక్స్‌ రిటర్న్స్‌ చూపిస్తా అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ు ఇన్షా  అల్లా...(దేవుడు దయ తలిస్తే) అవి ఎప్పుడు చూపుతారు మహానుభావా...్‌ అని బైడెన్‌ ప్రశ్నించారు. ఈ ఇన్షా అల్లా వ్యాఖ్య ఇపుడు అమెరికా అంతటా వైరల్‌ అయింది. బైడెన్‌కు ఇస్లామిక్‌ దేశాలు, అనేక ముస్లిం సంస్థలు ఫైనాన్స్‌ చేస్తున్నాయని వార్తలు వస్తున్న దశలో ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 


కొవిడ్‌పై..

‘ఇది చైనా తెచ్చిన ప్లేగు. మేం చాలా అప్రమత్తంగా ఉండడం వల్ల మరణాల సంఖ్య తగ్గింది. నా పనితీరును ఆరోగ్య నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కూడా మెచ్చుకున్నారు. వ్యాక్సిన్‌ తయారుకావడమే ఆలస్యం. తక్షణ పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశాం’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. దీన్ని బైడెన్‌ తిప్పికొడుతూ ‘అసలు ఈ వైరస్‌ గురించి ట్రంప్‌కు అవగాహనే లేదు, కట్టడికి ప్రణాళిక లేదు. మరణాలు చూసి బెంబేలెత్తిపోయి, ఏం చేయాలో తెలియక స్టాక్‌మార్కెట్‌ చూస్తూ కూర్చున్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. సామాజిక దూరం పాటించరు. మాస్కు పెట్టుకోరు. వేల మంది చనిపోయారు. ఇంకా లక్షల మంది బాధపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో ఇంకా కొవిడ్‌ ఉధృతంగానే ఉంది. కరోనా విషయంలో ట్రంప్‌ వైఫల్యం సుస్పష్టం’ అని దుయ్యబట్టారు.


బరాక్‌ ఒబామా-జో బైడెన్‌లు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఉన్నపుడు తెచ్చిన ఒబామా కేర్‌ ఆరోగ్య పథకం భారీ ఖర్చుతో కూడినదనీ, అందుకే దాన్ని మార్చాననీ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అయితే తాను ఆరోగ్య బీమాను రద్దు చేయని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బైడెన్‌ మాత్రం ‘ఒబామా కేర్‌ రద్దు చేయడం పెద్ద తప్పిదమనీ, దీని వల్లే వేలమంది చనిపోయారనీ, ప్రజారోగ్యంపై ట్రంప్‌కు ఏమాత్రం శ్రద్ధ లేదని’ విమర్శించారు.


ఆర్థిక విధానాలు

కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పుంజుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. 70 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఇంకా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని ట్రంప్‌ అనగా.. అమెరికాలో అతి తక్కువ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ట్రంప్‌దేనని బైడెన్‌ అన్నారు. తాను అధికారంలోకొస్తే అదనంగా  70లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కొవిడ్‌కు ముందునుంచీ ఆర్థిక స్థితి దెబ్బతింటోందని మొత్తం 22.1 మిలియన్ల మంది రోడ్డున పడ్డారన్నారు. 


నల్లజాతివారిపై దాడులు

పెరుగుతున్న శ్వేతజాతి దురహంకారాన్ని ఖండిస్తారా అని చర్చను నిర్వహించిన మాడరేటర్‌ ప్రశ్నించగా ట్రంప్‌ సమాధానాన్ని దాటవేశారు. అంతేకాక నల్లజాతి పౌరులు, ఆఫ్రికన్లపై దాడుల్లో హస్తముందని ఆరోపణలొచ్చిన ప్రౌడ్‌ బాయ్స్‌ అనే గ్రూప్‌ను వెనకేసుకొచ్చారు. దేశంలో అశాంతిని రగిలిస్తున్నది అతివాద వామపక్ష వాదులేనంటూ ఫాసి్‌స్ట-వ్యతిరేక ఉద్యమం ‘యాంటీఫా‘ కార్యకలాపాలను ప్రస్తావించారు. 


బైడెన్‌ కుమారుడే ట్రంప్‌ టార్గెట్‌

జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌నే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు ట్రంప్‌. ‘చైనాలో వ్యాపారం చేసి కోట్లు సంపాదించారు. ఉక్రెయిన్‌లోనూ అనేక కంపెనీల్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అతని వ్యాపారాల కోసం బైడెన్‌ గతంలో ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని లాబీయింగ్‌కు పాల్పడ్డారు. ప్రవర్తన సరిగా లేని కారణంగా మన దేశ సైన్యం నుంచి హంటర్‌ను వెలివేశారు. మాదక ద్రవ్యాలకు హంటర్‌ బానిస’’ అని ట్రంప్‌ వ్యక్తిగత దాడి చేశారు. ‘నా కొడుకును ఎందుకు బరిలోకి లాగుతారు? చాలా మంది అమెరికన్లలాగే హంటర్‌ కూడా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. కానీ అది ఒకప్పుడు. తర్వాత మారాడు. ఇప్పుడు నా కొడుకును చూసి గర్విస్తున్నా’’ అని బైడెన్‌ తిప్పికొట్టారు. ‘మీ కుటుంబంలో మీకే మద్దతు లేదు’ అని ఎదురుదాడి చేశారు. 


మెయిల్‌ బ్యాలెట్‌పై అభ్యంతరం

మెయిల్‌ బ్యాలెటింగ్‌ విధానంలో అక్రమాలు చోటుచేసుకునేందుకు ఎక్కువ ఆస్కారముందని, ఫలితాలు తారుమారవుతాయని ట్రంప్‌ అన్నారు. అయితే బైడెన్‌ మాత్రం ఈ బ్యాలెట్‌ పద్ధతిని సమర్థించారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చినా తాను స్వీకరిస్తానన్నారు. ట్రంప్‌ ఈ హామీ ఇవ్వలేదు. సజావుగా అధికార బదిలీ చేస్తారా, ఓటమి చెందితే మీ అనుచరులు హింసకు దిగకుండా పిలుపునిస్తారా.. అన్న ప్రశ్నకు ‘ఓటింగ్‌పై ఓ కన్నేసి ఉంచమని నేను మా మద్దతుదారులకు చెప్పాను’ అని బదులిచ్చారు. 


ప్రభావం శూన్యం?

అధ్యక్ష ఎన్నికల చర్చ మూడుసార్లు జరుగుతుంది. తొలి చర్చ పేలవంగా ముగియడంతో మిగిలినవి కూడా గొప్పగా ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే మొదటి చర్చలో విజేత బైడెనేనని, ఆయన హుం దాగా వ్యవహరించారని, తన విధానాలను ట్రంప్‌ సమర్ధంగా సమర్థించుకోలేకపోయారని విశ్లేషకులంటున్నారు. అయినా ఈ చర్చ వల్ల ఓటింగ్‌ సరళి పెద్దగా మారిపోదని కూడా చెబుతున్నా రు. అధ్యక్ష ఎన్నికలు నవంబరు 3న జరగనున్నాయి. ప్రస్తుతం అన్ని సర్వేల్లోనూ ట్రంప్‌ కంటే బైడెన్‌ 6ు ముందంజలో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఈ గ్యాప్‌ తగ్గవచ్చనీ, సమ ఉజ్జీలుగా నిలవొచ్చనీ  అంటున్నారు.


భారత్‌ లెక్కలు సరికావు

కొవిడ్‌ మరణాలపై భారత్‌ చెబుతున్న లెక్కల్లో నిజం లేదు. ‘చైనా, రష్యా, ఇండియా చెబుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తప్పు. వారు సరైన లెక్కలు ఇవ్వట్లేదు.

- ట్రంప్‌


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement