H-1B Visa: బైడెన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వేలాదిమంది భారతీయులకు భారీ ఊరట!

ABN , First Publish Date - 2022-10-01T12:57:07+05:30 IST

హెచ్‌-1బీ వర్క్‌ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులకు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి కొత్త వీసాలజారీ లేక వాటి క్రమబద్ధీకరణకు సంబంధించిన స్టాంపింగ్‌ విధానాన్ని సరళతరం చేయాలని ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఈ వీసాల గడువు పెంపు కోసం ఇప్పటివరకు తమ తమ దేశాల్లో వీసా స్టాంపింగ్‌ పొందాల్సి ఉండగా, ఇకపై అమెరికాలోనే దరఖాస్తు..

H-1B Visa: బైడెన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వేలాదిమంది భారతీయులకు భారీ ఊరట!

హెచ్‌-1బీ వీసాదారులకు భారీ ఊరట!  

వీసా రెన్యువల్‌ ఇకపై అమెరికాలోనే.. 

వేలాదిమంది భారతీయ నిపుణులకు లబ్ధి

వాషింగ్టన్‌, సెప్టెంబరు 30: హెచ్‌-1బీ వర్క్‌ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులకు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి కొత్త వీసాలజారీ లేక వాటి క్రమబద్ధీకరణకు సంబంధించిన స్టాంపింగ్‌ విధానాన్ని సరళతరం చేయాలని ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఈ వీసాల గడువు పెంపు కోసం ఇప్పటివరకు తమ తమ దేశాల్లో వీసా స్టాంపింగ్‌ పొందాల్సి ఉండగా, ఇకపై అమెరికాలోనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది వేలాదిమంది భారతీయులకు పెద్ద ఊరటే! ఏటా వేలాదిగా హెచ్‌-1బీ వీసాలను అమెరికా కంపెనీలు పంపిస్తుంటాయి. గడువు ముగియగానే స్వదేశానికి వెళ్లి అక్కడి అమెరికా కాన్సులేట్‌ లేక ఎంబసీలో వీసా స్టాంపింగ్‌ పొందాలి. ఇది చాలా వ్యయప్రయాసగా మారిందని ఆసియన్‌ అమెరికన్లు, హవాయీ, పసిఫిక్‌ వ్యవహారాల ప్రెనిడెన్షియల్‌ కమిషన్‌ గుర్తించింది. 


ప్రస్తుతం భారత్‌లో వీసాల దరఖాస్తు అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్‌ కాలం రెండేళ్లకుపైమాటే! పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో పరిస్థితీ ఇంతే. చైనానే కొంత మెరుగ్గా ఉంది. కమిషన్‌ సభ్యుడు అజయ్‌ జైన్‌ భూటోరియా ఈ పరిస్థితిని సభ్యుల దృష్టికి తెచ్చారు. ‘హెచ్‌-1బీ వీసాల రెన్యువల్‌, వీసా అపాయింట్‌మెంట్‌లో అనిశ్చితి వలన కుటుంబాలకు దూరం అవుతున్నారు. భార్యబిడ్డలు ఇక్కడ.. భర్త ఎక్కడో అన్నట్టు పరిస్థితి ఉంటోంది. ఐసీయూ లేక తీవ్ర అనారోగ్యంతో తమవారు బాధపడుతున్నా చాలామంది అమెరికాదాటి వెళ్లడానికి జంకుతున్నారు. రెన్యువల్‌కు ఎక్కువ సమయం పట్టడంతో చాలాసార్లు ఉద్యోగం కూడా కోల్పుతున్నారు.’’ అని భూటోరియా వివరించారు. అమెరికా లేక యూఎ్‌ససిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ కమిషన్‌ (యూఎ్‌ససీఐఎస్‌) కార్యాలయంలోనే వీసా గడువు పెంపునకు అనుమతించాలని ఆయన సిఫార్సును, కమిషన్‌ చీఫ్‌ కమిషనర్‌ సోనాలీ షా ఆమోదించారు.

Updated Date - 2022-10-01T12:57:07+05:30 IST