మంచి ఉద్దేశంతోనైనా మాట జారొద్దు!: కోవింద్‌

ABN , First Publish Date - 2021-11-28T08:20:31+05:30 IST

కోర్టు హాల్లో వ్యాఖ్యానాలు చేసే సమయంలో న్యాయమూర్తులు అత్యంత వివేకాన్ని ప్రదర్శించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు.

మంచి ఉద్దేశంతోనైనా మాట జారొద్దు!: కోవింద్‌

న్యూఢిల్లీ, నవంబరు 27: కోర్టు హాల్లో వ్యాఖ్యానాలు చేసే సమయంలో న్యాయమూర్తులు అత్యంత వివేకాన్ని ప్రదర్శించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. సదుద్దేశంతో చేసినప్పటికీ జాగ్రత్తలేని మాటలు న్యాయవ్యవస్థకు దురుద్దేశాన్ని ఆపాదించేందుకు అవకాశాన్ని ఇస్తాయని, దాని ప్రతిష్ఠను తగ్గిస్తాయని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శనివారం రెండోరోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవాల్లో  ఆయన మాట్లాడారు.  భారతీయ సంప్రదాయంలో న్యాయమూర్తులను స్థితప్రజ్ఞులుగా, నైతిక ప్రవర్తనకు, తటస్థ వైఖరికి ప్రతిరూపాలుగా చూస్తారని చెప్పారు. . భారత న్యాయవ్యవస్థ ఈ అత్యున్నత ప్రమాణాలకు మొదటి నుంచీ కట్టుబడి ఉందని ప్రశంసించారు. సామాజిక మాధ్యమాల వేదికల మీద న్యాయమూర్తులపై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల విచారం వ్యక్తం చేశారు.  

చట్టాలను, న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయలేని పరిస్థితి ఉండరాదని కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజుజు అన్నారు. తమ హక్కుల గురించి నిలదీసే సమయంలో కొందరు ఇతరుల హక్కులను, తమ బాధ్యతలను మరచిపోతున్నారని వ్యాఖ్యానించారు. హక్కులకు, బాధ్యతలకు మధ్య సమతూకం పాటించాలన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి దేశాన్ని నడపాలని చెప్పారు. 

Updated Date - 2021-11-28T08:20:31+05:30 IST