20న హైదరాబాద్‌కు రాష్ట్రపతి కోవింద్‌

ABN , First Publish Date - 2021-12-03T16:26:58+05:30 IST

దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 20న శీతాకాల విడిది కోసం నగరానికి వస్తున్నారు...

20న హైదరాబాద్‌కు రాష్ట్రపతి కోవింద్‌

హైదరాబాద్ సిటీ/అల్వాల్‌/తిరుమలగిరి : దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 20న  శీతాకాల విడిది కోసం నగరానికి  వస్తున్నారు. నాలుగు రోజులపాటు రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో ఆయా విభాగాల అధికారులు తలమునకలయ్యారు. రాష్ట్రపతి కోసం రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉన్న  ఈఎంఈ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. వాస్తవానికి రాష్ట్రపతి న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌లో దిగుతారు.


అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అయితే, అత్యవసర పరిస్థితుల కోసం అధికారులు ప్రత్యామ్నాయంగా హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతోపాటు ఆక్టోపస్‌ విభాగం అధికారులు రాష్ట్రపతి నిలయంలో సమావేశాన్ని నిర్వహించారు. తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లతోపాటు రూట్‌ కాన్వాయ్‌, వసతుల ఏర్పాట్ల కోసం కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాక్‌ డ్రిల్‌ను నిర్వహించారు.

Updated Date - 2021-12-03T16:26:58+05:30 IST