విజయ సందేశాలు!

ABN , First Publish Date - 2022-07-23T06:46:09+05:30 IST

భారత కొత్త రాష్ట్రపతిగా ద్రౌపదిముర్ము ఎన్నిక సంతోషించవలసిన, స్వాగతించవలసిన చారిత్రాత్మకఘట్టం. దేశ అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ ఆమె.

విజయ సందేశాలు!

భారత కొత్త రాష్ట్రపతిగా ద్రౌపదిముర్ము ఎన్నిక సంతోషించవలసిన, స్వాగతించవలసిన చారిత్రాత్మకఘట్టం. దేశ అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ ఆమె. ప్రతిభా పాటిల్ అనంతరం రెండవ మహిళ. ఆమె ఎన్నిక ఖాయమే అయినప్పటికీ, అది ఎంతోఘనంగా ఉండాలన్న పట్టుదలతో కృషిచేసిన బీజేపీని అభినందించాలి. అగ్రస్థానంలో ఒక ఆదివాసీ మహిళ ఉండటమన్నది స్వతంత్ర భారతచరిత్రలో అరుదైన ఘట్టమైతే, ఈ అమృతోత్సవ వేళలోనే అది సుసాధ్యమవడం మరో విశేషం. వేలాది సంవత్సరాలుగా అణగారిన పదికోట్లమంది ఆదివాసులకు ఆమె రాక ఆనందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తుంది.


తెర వెనుక బీజేపీ ఎంత కృషి ఉన్నదో ద్రౌపది విజయం తెలియచెబుతోంది. దాదాపు సగం బలం ఉన్న ఎన్డీయే ఓట్లనే నమ్ముకొని ఉంటే ఈ ఘనత సాధ్యపడేది కాదు. ఒక ఆదివాసీని, అందునా ఓ మహిళను ఎంపికచేయడం ద్వారా శత్రుశిబిరాన్ని బీజేపీ పెద్దదెబ్బే తీసింది. ఎన్డీయే పక్షాల ఓట్లు చెక్కచెదరకుండా పడటంలోనూ, ఎన్డీయేలో లేనప్పటికీ బీజేపీతో అనాదిగా సయోధ్యగా ఉండే పార్టీల ఓట్లు చేజిక్కించుకోవడంలోనూ విశేషమేమీ లేదు. కానీ, జార్ఖండ్ ముక్తిమోర్చా, శివసేన, శిరోమణి అకాలీదళ్ వంటివి కూడా బీజేపీ బాణానికి విలవిల్లాడక తప్పలేదు. ఆదివాసీ పేరిట జార్ఖండ్ ముక్తిమోర్చా ద్రౌపదిని సమర్థించింది. బీజేపీమీద అలిగి దూరమైన శిరోమణి అకాలీదళ్ కూడా ఆమెకే ఓట్లు వేసింది. ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి మరీ విచిత్రం. ద్రౌపదికి అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఎమ్మెల్యేల మాదిరిగానే మేమూపోతామని ఎంపీలు కూడా హెచ్చరిస్తే, అగాఢీలో ఉంటూ కూడా ద్రౌపదికే జై కొట్టవలసి వచ్చింది. తన ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ పక్షం వహిస్తే కనీసం ఎంపీలనైనా నిలబెట్టుకోవచ్చునని నమ్మారాయన. బీజేపీతో సయోధ్యకు అందివచ్చిన అవకాశం అనుకున్నారు. కానీ, ఓటింగ్ ముగిసిన అతికొద్దిసమయంలోనే పార్లమెంటులోనూ వేరుకుంపటి పుట్టుకొచ్చింది.


బీజేపీకి ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ నూరుశాతం ఓట్లు తెచ్చుకోవడం దాని పరపతికీ, సమర్థతకూ నిదర్శనం. మా బలం ఇది మాకు వచ్చిన ఓట్లు ఇవీ అంటూ అస్సాం శర్మగారు ఎదుటివారినుంచి తెచ్చుకున్నది ఎంతో తెలివిగా లెక్కవిప్పేశారు. దేశవ్యాప్తంగా కరడుగట్టిన బీజేపీ వ్యతిరేక పక్షాలనుంచి డజనున్నరమంది ఎంపీలు, వందకు పైబడిన ఎమ్మెల్యేలు ‘ఆత్మప్రభోదం’ మేరకు ముర్ముకు ఓటేయడంతో, ఆమె బలం అనూహ్యంగా మరో నాలుగుశాతం పెరిగింది. ఈ ఆత్మప్రభోదం విపక్షాల్లోనే కనిపిస్తూ, యశ్వంత్ సిన్హాకు ఎన్డీయే నుంచి ఒక్క ఓటుకూడా పడకపోవడం విశేషం. ముర్మును నిలబెట్టడం నుంచి అధికమెజారిటీతో అధ్యక్షపీఠం మీద కూచోబెట్టడం వరకూ బీజేపీ చెప్పదల్చుకున్నదొక్కటే. ఈ దేశంలో విపక్షం లేదనీ, సైద్ధాంతిక నిబద్ధత లేని, స్వప్రయోజనాలకు పరిమితమయ్యే ప్రాంతీయపార్టీలు తనను ఏమాత్రం ఢీకొట్టలేవని. సార్వత్రక ఎన్నికలముందు ఈ సందేశం ప్రజలకు చేరాలన్న దాని ఆశయం నెరవేరింది. ముందే ఎందుకు చెప్పలేదన్న ఒక్క ఆత్మరక్షణ వాక్యంతో ఓటింగుకు ముందే మమత యావత్ కూటమి ఓటమిని ప్రకటించారు. ఆదివాసీ ఆయుధాన్ని బీజేపీ ప్రయోగిస్తుందని ఊహించలేకపోవచ్చు. కానీ, మమత తెచ్చిన మనిషిని బీజేపీ వ్యతిరేక సైద్ధాంతిక పోరాటానికి ప్రతీకగా ఎవరు మాత్రం అనుకోగలరు? బీజేపీలో ఉంటూ పలుమార్లు పదవులు అనుభవించి, రాజకీయచరమాంకంలో మోదీతో పడక మమత పక్షాన చేరిన సిన్హాకు వీరతాళ్ళు ఎలా వేయగలరు? ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటింగుకు దూరంగా ఉండాలన్న ఆమె నిర్ణయం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. బెంగాల్ గవర్నర్ ఆమెతో మూడుచెరువుల నీళ్ళు తాగించి, రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడానికి సహకరించిన జగదీప్ ధన్‌ఖడ్ శత్రుపక్షం అభ్యర్థిగా నిలిచినప్పుడు అపరకాళిలాగా విజృంభించాల్సిన ఆమె అస్త్రసన్యాసం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలో ఆమె అభ్యర్థికి ఓటు వేసిన కాంగ్రెస్ ఇప్పుడు తమ ఆల్వాకు మమత అన్యాయం చేస్తున్నందుకు విస్తుపోవలసివచ్చింది. బీజేపీ మీద వీరంగాలు వేసే చాలాపార్టీలు యుద్ధానికి సిద్ధపడవనీ, స్వప్రయోజనాలు తప్ప వాటికి సైద్ధాంతిక నిబద్ధత లేదని ఈ రెండుపదవుల ఎన్నికల సందర్భంగా తేలిపోయింది. రెండేళ్ళ తరువాత జరగబోయే సార్వత్రక ఎన్నికల్లో సాధించబోయే ఘనవిజయాన్ని ఇప్పుడే జరుపుకుంటున్నంత స్థాయిలో ద్రౌపది విజయోత్సవ వేడుకలు ఉండటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.

Updated Date - 2022-07-23T06:46:09+05:30 IST