Abn logo
Sep 15 2021 @ 09:03AM

Shimla: రాష్ట్రపతి నివాసంలోని నలుగురు ఉద్యోగులకు కరోనా

ప్రైవేట్ హోటల్‌లో బస చేయనున్న రామ్‌నాథ్ కోవింద్

సిమ్లా(హిమాచల్ ప్రదేశ్): రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 4రోజుల పర్యటన సందర్భంగా ఒక ప్రైవేటు హోటల్‌లో బస చేయనున్నారు. సిమ్లా నగరంలోని రాష్ట్రపతి రిట్రీట్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో రాష్ట్రపతి తన అధికారిక భవనంలో కాకుండా ప్రైవేటు హోటల్ లో బస చేయాలని నిర్ణయించారు. రాష్ట్రపతి 4 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం సిమ్లాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్‌లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ యొక్క వాలిడిక్టరీ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

సిమ్లా నగర శివార్లలోని ఛారాబ్రాలో ఉన్న రాష్ట్రపతి నివాసంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా సోకడంతో రామ్‌నాథ్ కోవింద్ రిట్రీట్ కు బదులుగా సిసిల్ హోటల్ లో బస చేస్తారని అధికారులు చెప్పారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా, మాజీ ముఖ్యమంత్రులు శాంత కుమార్, ప్రేమ్ కుమార్ ధుమాల్‌తో సహా 93 మంది మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక సెషన్‌కు హాజరు కావడానికి అంగీకారం తెలిపారు.రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలు కూడా సెషన్‌కు హాజరవుతారు.

 ప్రస్తుత, మాజీ శాసనసభ్యులతో రాష్ట్రపతి గ్రూప్ ఫొటో తీసుకుంటామని అని స్పీకర్ తెలిపారు.ప్రెసిడెంట్ కోవింద్ సెప్టెంబర్ 16 న మధ్యాహ్నం 12 గంటలకు పాలమ్ విమానాశ్రయం ఢిల్లీ నుంచి చండీగఢ్ మీదుగా సిమ్లాలోని అన్నదాలే హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. తదనంతరం రాష్ట్రపతి చౌరా మైదాన్‌లోని సిసిల్ హోటల్‌కు మధ్యాహ్నం 12.25 గంటలకు చేరుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు.