అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం: బైడెన్

ABN , First Publish Date - 2021-03-06T13:07:55+05:30 IST

అమెరికాను భారతీయ ట్యాలెంట్‌ ఆక్రమిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్వయంగా అన్నారు. నాసా మార్స్‌ మిషన్‌ను నడిపించిన స్వాతీ మోహన్‌తో మాట్లాడటమే తనకు దక్కిన గౌరవమని చెప్పారు. భారతీయ అమెరికన్లు అద్భుతమైన వ్యక్తులంటూ కృతజ్ఞతలు తెలిపారు.

అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం: బైడెన్

అమెరికన్‌ సమాజంలో భారతీయుల ప్రాభవం

జీడీపీలో 3% మన ఐటీ కుర్రాళ్లు సృష్టించిందే

ప్రభుత్వ పదవుల్లో పెరుగుతున్న ప్రాధాన్యం 

బైడెన్‌ సర్కారులో 55 మంది మనవాళ్లే

ఒబామా, ట్రంప్‌ సర్కారుల్లోనూ పెద్దపీటే

కొత్తతరం వచ్చాక మరిన్ని మార్పులు!

అమెరికాను భారతీయ ట్యాలెంట్‌ ఆక్రమిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్వయంగా అన్నారు.  నాసా మార్స్‌ మిషన్‌ను నడిపించిన స్వాతీ మోహన్‌తో మాట్లాడటమే తనకు దక్కిన గౌరవమని చెప్పారు. భారతీయ అమెరికన్లు అద్భుతమైన వ్యక్తులంటూ కృతజ్ఞతలు తెలిపారు. 


భారతీయ అమెరికన్‌లు దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. స్వాతీ... మీరు, మా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, నా ఉపన్యాసాల రచయిత వినయ్‌ రెడ్డి... ఇంతకన్నా రుజువు ఏం కావాలి? అయితే, మీ అందరికీ కృతజ్ఞతలు. మీరంతా అద్భుతమైన వ్యక్తులు.


అంగారకుడి మీదకు ఫిబ్రవరి 18న రోవర్‌ను పంపిం చిన నాసా శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడుతున్నపుడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చేసిన వ్యాఖ్యలివి.


అమెరికా సామాజిక, ఆర్థిక వ్యవస్థ మీద భారతీయులు పట్టు సాధించారనడానికి ఆ వ్యాఖ్యలే సాక్ష్యం. ఒబామా లాంటి ఉదారవాదులైన డెమోక్రాట్లు పాలించినా, ట్రంప్‌ లాంటి కరడుగట్టిన వలస వ్యతిరేక రిపబ్లికన్లు పాలించినా ప్రభుత్వాల్లో భారతీయ అమెరికన్లకు పెద్దపీటే వేస్తున్నారు. అవకాశాల స్వర్గధామంగా వెలుగొందుతున్న అమెరికా ఆర్థిక, సామాజిక రంగాలను ప్రభావితం చేసేంతటి ఉన్నత స్థానానికి చేరింది అమెరికన్‌ యూదులు మాత్రమే. కొన్ని దశాబ్దాలుగా భారతీయులకు కూడా అలాంటి ప్రాధాన్యమే లభిస్తోంది.


నాసాలో భారతీయులు

స్వాతీ మోహన్‌ అమెరికా మార్స్‌ మిషన్‌లో గైడెన్స్‌, నావిగేషన్‌, కంట్రోల్‌ ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. నుదుటన బొట్టు పెట్టుకొని, మాస్క్‌ కట్టుకొని ఆమె మార్స్‌ మిషన్‌ను నడిపించిన ఫొటోలు చూసి ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు పులకించిపోయారు. బుధవారం ఆన్‌లైన్‌లో జరిగిన సంభాషణ కార్యక్రమంలో స్వాతీ మోహన్‌ను బైడెన్‌కు పరిచయం చేశారు. ఆమె దేశాధ్యక్షుడితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపబోగా ఆయన వారించారు. ‘‘నన్ను ఆట పట్టిస్తున్నావా? నీతో మాట్లాడే అవకాశం రావడమే నాకు గౌరవం’’ అన్నారు. గత 2 దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష ప్రయోగాల్లో భారతీయులకు మంచి అవకాశాలే వస్తున్నాయి. 2003లో చాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా, ఆ తర్వాత అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా వెళ్లి వచ్చిన సునీతా విలియమ్స్‌ తమదైన ముద్ర వేశారు. తాజాగా రాజా చారి స్పేస్‌ ఎక్స్‌ తొలి ప్రైవేటు అంతరిక్ష ప్రయాణానికి నేతృత్వం వహించనున్నారు. నాసాలో పని చేస్తున్న 8 శాతం మంది ఆసియన్లలో కనీసం 2 శాతం భారతీయులు ఉంటారని అంచనా.


శ్వేతసౌధంలో ప్రాతినిధ్యం 

అమెరికా ప్రభుత్వంలో అత్యధిక సంఖ్యలో భారతీయులను చేర్చుకున్న ఘనత ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కే దక్కుతుంది. జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన 55 మంది భారతీయ అమెరికన్లకు తన ప్రభుత్వంలో అవకాశం ఇచ్చారు. అందులో సగం మంది మహిళలే. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ నేరుగా ఎన్నికల్లో గెలిచి వచ్చారు. 2009-17 మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ఒబామా కూడా భారతీయులకు అత్యధిక అవకాశాలిచ్చి ఆ రోజుల్లో రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ట్రంప్‌ అధికారానికి వచ్చాక శ్వేతసౌధంలో భారతీయుల సంఖ్య కాస్త తగ్గినా(36 మంది) ప్రభ తగ్గలేదు. భారతీయ మహిళ నిక్కీ హ్యాలీకి ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో అమెరికా తరఫున అవకాశం ఇచ్చి, భారతీయులకు కేబినెట్‌ ర్యాంక్‌ కల్పించిన తొలి అధ్యక్షుడు అయ్యారు. బైడెన్‌ వచ్చాక డాక్టర్‌ వివేక్‌ మూర్తినిఅమెరికా సర్జన్‌ జనరల్‌గా నియమించారు. న్యాయవాది వనితా మూర్తి అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా ఖరారు అయ్యారు. 


ఐటీ రంగంలో భారతీయులు

అమెరికా అగ్రశ్రేణి ఐటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లకు భారతీయులైన సత్య నాదెండ్ల, సుందర్‌ పిచాయ్‌లు నేతృత్వం వహిస్తున్నారు. 1990 తర్వాత డజన్ల సంఖ్యలో భారతీయులు అమెరికన్‌ సంస్థలకు సీఈవోలు అయ్యారు. కష్టించేతత్వం కలిగిన భారతీయులను ప్రాధాన్యం కలిగిన పదవుల్లోకి తీసుకోవడానికి అక్కడి సంస్థలు ఇష్టపడతాయి. దాదాపు 2 లక్షల మంది భారతీయులు అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. అమెరికా ఐటీ ఉద్యోగాల్లో దాదాపు పది శాతం మంది భారతీయులే ఉన్నారు. 2017 లెక్కల ప్రకారం అమెరికా జీడీపీలో 3 శాతం సంపదను భారతీయ ఐటీ కంపెనీలే సృష్టిస్తున్నాయి. సిలికాన్‌ వ్యాలీలో మూడో వంతు స్టార్ట్‌పలు భారతీయులవే. 8 శాతం కంపెనీల యజమానులు భారతీయులే. వీరికి తోడు ఏటా రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో చేరుతున్నారు. వారిలో ఎక్కువ మంది పై చదువుల పేరుతో అక్కడే కొనసాగుతున్నారు. అమెరికా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు ఈ విద్యార్థులకు అందించే సేవల రూపంలో భారీగానే లబ్ధి పొందుతున్నాయి. 


సంపన్న భారతీయులు 

అమెరికాకు వచ్చే భారతీయులు ఎక్కువ మంది చదువుకున్న వారే. సాధారణంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుంటారు. దీర్ఘకాలం కుటుంబాలు రెండు జీతాలతో స్థిరంగా ఉంటాయి. ఆదాయాన్ని క్రమశిక్షణతో పొదుపు చేస్తారు. తెలివైన పెట్టుబడులు పెడతారు.  అమెరికాకు వచ్చిన కొన్నేళ్లలోనే చాలా కుటుంబాలు సంపన్నవంతం అవుతున్నాయి. అమెరికాలో భారతీయుల కుటుంబ సగటు ఆదాయం అన్ని జాతుల కన్నా ఎక్కువ. ఎంత కష్టమైనా పడటానికి సిద్ధపడటంతో అవకాశాలు, గుర్తింపు వారికి అదే స్థాయిలో వస్తున్నాయి. భారతీయులు సాధారణంగా డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతుగా ఉంటారు. భారతీయుల రాజకీయ ప్రాధాన్యతకు నిదర్శనంగా క్లింటన్‌, ఒబామా ప్రభుత్వాల్లో భారతీయులకు అనుకూలమైన వలస విధానాలు రూపొందుతూ వచ్చాయి. అమెరికా సమాజంపై వారి ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అమెరికన్‌ భారతీయులు 30 లక్షల మంది వరకు ఉంటారు. అమెరికా జనాభాలో ఇది ఒక శాతం. 2030 కల్లా రెండు శాతానికి పెరుగుతుందని అంచనా. భారతీయ అమెరికన్లు పెద్ద పెద్ద నగరాల్లో స్వింగ్‌ ఓటర్లుగా మారారు. దాంతో పార్టీలు వీరి ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పడం లేదు.

Updated Date - 2021-03-06T13:07:55+05:30 IST