వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో సోమవారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం ప్రకారం) ఆయన ఫైజర్ టీకా మూడో డోసు తీసుకోవడం జరిగింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే బైడెన్ మొదటి రెండు డోసులు తీసుకున్న విషయం తెలిసిందే. తొలి రెండు డోసులు తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకపోవడంతో మూడో డోసు తీసుకున్నట్లు శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. కాగా, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారం రోజుల కింద ఫైజర్ అభివృద్ధి చేసిన బూస్టర్ డోసును అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. 65 ఏళ్లకు పైబడిన వారు ఈ బూస్టర్ డోసు తీసుకోవచ్చు. కనుక అర్హత ఉన్నవారు మూడో డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని బైడెన్ పేర్కొన్నారు.
మహమ్మారిని కట్టడికి చేసి ప్రాణాలను కాపాడేది కేవలం టీకాలు మాత్రమేనని ఈ సందర్భంగా అధ్యక్షుడు మరోసారి గుర్తు చేశారు. అందుకే వ్యాక్సిన్లు తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా అందరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ల విషయంలో చాలా మంది అమెరికన్లు చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కనీసం ఒక్కడోసు తీసుకున్న వారు 77 శాతం మంది ఉన్నట్లు వెల్లడించారు. మిగతా 23శాతం మంది కూడా తగిన నిర్ణయం తీసుకోవడం మంచిదన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో కఠినపరిస్థితులు ఎదురుకావొచ్చని పేర్కొన్నారు.