అధ్యక్షా, కొవిడ్ పై పోరు ఇలాగేనా?

ABN , First Publish Date - 2021-07-16T08:19:50+05:30 IST

కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో చోటు చేసుకున్న లోపాలకు, సంభవించిన వైఫల్యాలకు బాధ్యులు ఎవరు? ఇది, జవాబు లేని ప్రశ్న...

అధ్యక్షా, కొవిడ్ పై పోరు ఇలాగేనా?

కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో చోటు చేసుకున్న లోపాలకు, సంభవించిన వైఫల్యాలకు బాధ్యులు ఎవరు? ఇది, జవాబు లేని ప్రశ్న. పార్లమెంటు వర్షాకాల సమావేశాల (జూలై 19-ఆగస్టు 13)‍లో నైనా ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుందా? లభించాలంటే ఈ క్రింద పేర్కొన్న పది ప్రశ్నలపై మన ప్రజాప్రతినిధులు తప్పక చర్చించాలి. అపజయాలను నిర్భయంగా, నిష్పాక్షికంగా సమీక్షించుకుంటేనే అంతిమ విజయం సాధ్యమవుతుంది. 


1) ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను తొలగించారు. ప్రాణాంతక కొవిడ్ ఉద్ధృతి రెండో దశలో కార్యసాధక చర్యలను వేగవంతంగా తీసుకోవడంలో కేంద్రప్రభుత్వ వైఫల్యానికి హర్షవర్ధన్ ఉద్వాసన ఒక మౌనాంగీకారమే. అయితే రెండో అల విరుచుకుపడనున్నదని ముందుగా పసిగట్టి, దాన్ని నిరోధించడం లేదా విషక్రిమి ప్రభావాన్ని కనీసస్థాయికి నియంత్రించడంలో వైఫల్యానికి ఆరోగ్యమంత్రే ఏకైక బాధ్యుడా? కొవిడ్‌పై ‘విజయం’ సాధించామనే తొందరపాటు ప్రకటనకు కారణమైన నిర్లక్ష్య వైఖరి, కీలక మార్చి-ఏప్రిల్ రోజుల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం, కుంభమేళాకు అనుమతి కచ్చితంగా ఒక్క కేబినెట్ మంత్రి నిర్ణయ ఫలితాలు కావు. కనుక విపత్సమయంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వారు ఇంకా అనేక మంది ఉన్నారనేది స్పష్టం. ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న రాజకీయ నాయకులు, పాలనా యంత్రాంగంలోని కీలక అధికారులను జవాబుదారీలను చేసి చర్య తీసుకోవల్సిన అవసరం లేదూ? 


2) మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో మన ప్రధాన ఆయుధం వ్యాక్సినేషన్. ఈ సంవత్సరాంతానికి దేశంలోని వయో జనులు అందరికీ రెండు డోసుల టీకా వేయిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన ఒక అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. మరి ఆ టీకాకరణ కార్యక్రమాన్ని ఎలా పూర్తిచేయనున్నారో దేశ ప్రజలకు విశదంగా తెలియజేస్తారా? ప్రస్తుతం వ్యాక్సిన్ల లెక్కలు విశ్వసనీయంగా కన్పించడం లేదు. ఒక రోజు రికార్డు స్థాయిలో అత్యధిక టీకాలు వేసినట్టు చెప్తున్నారు. ఆ మరుసటి రోజు వేసిన టీకాల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందుకని? ఈ సంవత్సరాంతంలోగా దేశప్రజలకు కొవిడ్ -19 వ్యాక్సిన్లు 216 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని 2021 మే లో ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పింది. నెలరోజులు తిరగక ముందే సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక నివేదనలో ఆ సంఖ్యను 135 కోట్లుగా సవరించింది! ఇంతకూ వ్యాక్సిన్ల లభ్యత విషయమై కచ్చితమైన వివరాలు ఇవ్వలేరా? వచ్చే ఆరునెలల్లో ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి? టీకాకరణ కార్యక్రమం పురోగతి ఎలా ఉండబోతుంది? డాంబికాలకు స్వస్తిచెప్పి వాస్తవిక అంచనాలతో వ్యాక్సినేషన్‌ను ఎందుకు అమలుపరచరు? 


3) వ్యాక్సిన్ ధర విషయమై ఆందోళన వ్యక్తమవుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలందరికీ టీకాలు ఉచితంగా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా 18-–44 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న వారికి ఒకే ధరకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఎందుకు నిర్దేశించవలసివచ్చింది? ప్రైవేట్ ఆసుపత్రులు అనేకం కరోనా వ్యాక్సిన్లకు చాలా అధిక ధరలు వసూలు చేస్తున్నాయని ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ప్రజలందరికీ ఉచిత టీకాకరణ నిమిత్తం 2021–22 బడ్జెట్‌లో రూ.35,000 కోట్లు కేటాయించారు. మరి ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా వినియోగపరుస్తుందో దేశ ప్రజలకు తెలియజేయగలరా? 


4) కేంద్రప్రభుత్వం, కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిదారు భారత్ బయో టెక్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయమై పలువురు పలు ప్రశ్నలు వేస్తున్నారు. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. కొవాగ్జిన్ అభివృద్ధిలో భారత వైద్య పరిశోధనా మండలి పాత్ర కూడా కీలకమైంది. అంతేగాక ఆ పరిశోధనకు ఐసిఎమ్‌ఆర్ ఆర్థిక సహాయమందించింది. అలాంటప్పుడు కొవాగ్జిన్ ధరను ఏకపక్షంగా నిర్ణయించేందుకు భారత్ బయోటెక్‌ను ఎందుకు అనుమతించారు? అంతకంటే ముఖ్యంగా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్ష ఫలితాలు తెలియక ముందే అత్యవసర వినియోగానికి గాను ఆ టీకాకు అనుమతి ఎలా ఇచ్చారు? ఇది శాస్త్ర పరిశోధన నైతిక ప్రమాణాలకు విరుద్ధం కాదా? భారత్‌కు టీకాలు సరఫరా చేసేందుకు విదేశీ సంస్థ ఫైజర్‌కు శీఘ్రగతిన అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడింది? కేవలం రెండు దేశీయ సంస్థలపై మితిమీరిన నమ్మకం ఉంచి అందుబాటులో ఉన్న ఇతర సంస్థల టీకాలకు ముందస్తుగా ఆర్డర్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయింది. విదేశీ ఉత్పత్తిదారులకు కంపల్సరీ లైసెన్సింగ్ ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారు. వ్యాక్సిన్ సంక్షోభానికి ఇటువంటి నిర్లక్ష్య వైఖరులే ప్రధాన కారణం కాదా? భారత్ బయోటెక్, బ్రెజిల్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం వివరాలు కేంద్రప్రభుత్వానికి తప్పక తెలిసే ఉంటాయి. మరి ఆ ఒప్పందంపై బ్రెజిల్‌లో ఇప్పుడు జరుగుతున్న ఒక క్రిమినల్ దర్యాప్తుపై ప్రభుత్వ స్పందన ఏమిటి? 


5) కొవిడ్ వ్యాధితో మరణించిన వారి సంఖ్యపై తీవ్ర గందరగోళం నెలకొనివుంది. కొవిడ్ మరణాల సంఖ్యను ప్రభుత్వాలు కచ్చితంగా తెలియజేయడం లేదని ప్రజలు భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు కొవిడ్ మృతుల సంఖ్య వాస్తవంగా మరింత అధికంగా ఉన్నట్టు తరచు ప్రకటిస్తున్నాయి. కొవిడ్ మరణాలను సరిగ్గా నమోదు చేయడం లేదనడానికి ఇదొక స్పష్టమైన నిదర్శనం. కొవిడ్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించితీరవలసిందేనని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. ఈ దృష్ట్యా కొవిడ్ మరణాల సంఖ్యను న్యాయవ్యవస్థ తనిఖీ చేయడం అనివార్యం కాదా? గ్రామీణ ప్రాంతాలలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే వారి మరణాలు కొవిడ్ మరణాలుగా నమోదు కావడం లేదు. మరి బాధిత కుటుంబాలు నష్టపరిహారానికి అర్హమైనవి కావా? కొవిడ్ మరణాల వాస్తవ సంఖ్యను ఎంతకాలం దాచిపెడతారు? 


6) కరోనామహమ్మారి విజృంభణ అనంతరం పిఎమ్ కేర్స్ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. ఈ నిధికి దాతలు ఎవరు? ఎంత మొత్తంలో విరాళాలు ఇచ్చారు? అలా సమకూరిన సొమ్మును ఎలా వినియోగించారు?... మొదలైన అంశాలపై వివరాలు వెల్లడించేందుకు పిఎమ్‌ కేర్స్ ఫండ్ నిరాకరించింది. అది, సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ప్రభుత్వ సంస్థకాదని అధికారులు వాదిస్తున్నారు. ఈ అపారదర్శకత ఆందోళన కలుగజేస్తోంది. కొవిడ్ బాధితుల సహాయార్థం ఇచ్చిన నిధులను కచ్చితంగా ఎలా ఖర్చుచేస్తుందీ తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేకపోవడం శోచనీయం. పిఎమ్ కేర్స్ ఫండ్ ద్వారా కొనుగోలు చేసిన అనేక వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉన్నట్టు రుజువయింది. గతంలో వెంటిలేటర్లను ఉత్పత్తి చేసిన చరిత్ర లేని కొన్ని కంపెనీలకు ఏ ప్రాతిపదికన వెంటిలేటర్ల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు? కొవిడ్ రెండో ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ప్రజలను ఎలా సమస్యల పాలుచేసిందీ విదితమే. మరి ఆక్సిజన్ ప్లాంట్‌ల ఏర్పాటుకు పిఎమ్ కేర్స్ ఫండ్ నుంచి ఎలాంటి సహాయం ఆందించారో ప్రజలకు వివరిస్తారా? 


7) కొవిడ్ వ్యతిరేక పోరాటంలో మరో కీలక అంశం సంబంధిత శాస్త్ర పరిశోధనలకు, టీకాల అభివృద్ధికి ఆర్థిక సహాయమందించడం. కరోనా వైరస్ ఉత్పరివర్తనాలను ఎప్పటికప్పుడు కనుగొనడానికి ఉద్దేశించిన వైద్య పరిశోధనలకు ప్రభుత్వం ఏ మేరకు ఆర్థిక సహాయమందించిందో వివరాలు వెల్లడించాలి. 


8) మహమ్మారి మూలంగా లక్షలాది కార్మికులు, ఉద్యోగులు వీధినపడ్డారు. నిరుద్యోగం పెరుగుదలపై సిఎమ్‌ఐఇ లాంటి విశ్వసనీయ పరిశోధనా సంస్థలు వెల్లడించిన గణాంకాలను ప్రభుత్వం ఆమోదించడం లేదు. మరి మహమ్మారి మూలంగా కోల్పోయిన ఉద్యోగాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టాల గురించి కచ్చితమైన వివరాలను కార్మిక మంత్రిత్వ శాఖ ఎందుకు వెల్లడించదు? గత ఏడాది రాజ్యసభలో నష్టపోయిన ఉద్యోగాల విషయమై ఒక నిర్దిష్ట ప్రశ్నకు కార్మిక మంత్రి చాలా నిస్సారంగా ప్రతిస్పందించారు. వాస్తవాలను తేటతెల్లంగా చెప్పాల్సిన సమయమాసన్నమయింది.


9) పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇంచుమించు ప్రతి రోజూ పెరుగుతున్నాయి. ఇది, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాద ప్రతివాదాలకు కారణమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ సెస్‌లు అన్నిటినీ రద్దు చేసి, ఇంధన పన్నులను తగ్గించేందుకు రాష్ట్రాలతో చర్చలకు కేంద్రం ఎందుకు చొరవ చూపదు? పార్లమెంటులో ఈ విషయమై తప్పక చర్చను ప్రారంభించాలి. ఈ చర్చను ఆ తరువాత జీఎస్టీ కౌన్సిల్‌లో కూడా మరింత ముందుకు తీసుకు వెళ్లి మరింత హేతుబద్ధమైన పన్నుల వ్యవస్థ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను ఎందుకు తీసుకురాకూడదు? 


10) అంతిమంగా ఒక అనివార్య ప్రశ్న: కొవిడ్ మహమ్మారి రెండో విజృంభణను నియంత్రించడంలో కంటే సంభావ్య మూడో ఉద్ధృతిని అదుపు చేసేందుకు దేశం అన్ని విధాల మెరుగ్గా సంసిద్ధమై ఉందా? కరోనా విషక్రిమి మరో సారి చెలరేగిపోతే (ఈ ఆపద రాకూడదని ఆశిద్దాం) అందుకు ఎవరిని బాధ్యుడిని చేస్తారు? 


తాజా కలం: వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు చేయడంలో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు ప్రాంగణంలోని జాతిపిత మహాత్మా గాంధీ ప్రతిమ వద్ద పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. పైన పేర్కొన్న పది ప్రశ్నలపై సమగ్ర చర్చ జరిగేలా చూడడం ద్వారా పార్లమెంటు గౌరవాన్ని ఆయన సమున్నతం చేస్తారని ఆశించవచ్చునా?


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-07-16T08:19:50+05:30 IST