భారత్‌లో ట్రంప్ మేనియా చూస్తే మతిపోవాల్సిందే..!

ABN , First Publish Date - 2020-02-19T19:11:22+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, రోజూ పూజలు చేస్తున్నాడో భక్తుడు.

భారత్‌లో ట్రంప్ మేనియా చూస్తే మతిపోవాల్సిందే..!

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారతీయుల్లో అభిమానం కట్టలు తెంచుకుంటోంది. కొందరు ఏకంగా ఆయనకు గుడి కట్టి పాలాభిషేకాలు చేస్తుంటే, కొందరేమో ఆయన్ను స్వాగతించడానికి ప్రత్యేక గీతాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. వచ్చే వారంలో యూఎస్ ప్రెసిడెంట్ భారత్ పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరిని ఓసారి పలకరిస్తే.. 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, రోజూ పూజలు చేస్తున్నాడో భక్తుడు. అయితే ఇలా చేయడం వల్ల తమ పరువు పోతోందని మిగతా కుటుంబసభ్యులు అతన్ని తిట్టిపోస్తున్నారట. అయినా తాను పద్ధతి మార్చుకోనని కరాఖండీగా చెప్పేస్తున్నాడా పరమ భక్తుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన బుస్సా కృష్ణ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ భక్తుడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తున్న అతనికి.. 2016లో ఓ రోజు కలలో డొనాల్డ్ ట్రంప్ సాక్షాత్కరించాడట. దాంతో ట్రంప్‌ను పూజించడం మొదలెట్టాడు. ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి వ్యాపారం ఊపందుకుంది. మంచి లాభాలు వచ్చాయి. ఇదంతా ట్రంప్ భగవానుడి చలవే అని నమ్మిన కృష్ణ.. తన ఇంట్లోనే డొనాల్డ్ ట్రంప్ విగ్రహం ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలెట్టాడు. ఇంటినే గుడిగా మార్చేశాడు. తను చేసే పనులు తన కుటుంబసభ్యులకు నచ్చడంలేదని, వాళ్ల పరువు తీస్తున్నానని తిడుతున్నారని చెప్పాడు. కానీ ట్రంప్‌పై తన నమ్మకం భక్తిగా మారిందని, మిగతావారంతా శివుడిని ఎలా పూజిస్తున్నారో తాను ట్రంప్‌ను అలానే పూజిస్తానని చెప్తున్నాడు. 


ఇలా ట్రంప్‌పై భక్తి పెంచుకున్న భారతీయుడు కృష్ణ ఒక్కడే కాదు. న్యూఢిల్లీకి చెందిన హిందూ సేన సభ్యులు కూడా అమెరికా అధ్యక్షుడిపై విపరీతమైన ప్రేమ కనబరుస్తున్నారు. ట్రంప్‌ను స్వాగతించేందుకు ఓ ప్రత్యేక గీతాన్ని కూడా వారు సిద్ధం చేస్తున్నారట. ట్రంప్ కూడా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తమలాగే అంగీకరించడని హిందూసేన సభ్యులంటున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తానని ట్రంప్ ప్రకటించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు చెప్తున్నారు. వీరు కూడా ట్రంప్‌పై మమకారాన్ని బాగానే చూపుతారు. ఆయన పుట్టిన రోజున కేక్ కోసి, ట్రంప్ ఫొటోలకు తినిపిస్తూ మన కళ్లబడతారు. మరి ఈ ట్రంప్ మేనియా ఇంకెంత దూరం వెళ్తుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే

Updated Date - 2020-02-19T19:11:22+05:30 IST