మీ సోదరిగా భావించి మద్దతివ్వండి

ABN , First Publish Date - 2022-07-03T13:23:50+05:30 IST

చారిత్రక ప్రసిద్ధి చెందిన తమిళనాట పర్యటించడం తనకెంతో ఆనందంగా ఉందని, అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు తనను సోదరిగా భావించి గట్టి మద్దతు

మీ సోదరిగా భావించి మద్దతివ్వండి

- ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము  

- అన్నాడీఎంకే కూటమి నేతలతో భేటీ


చెన్నై, జూలై 2 (ఆంధ్రజ్యోతి): చారిత్రక ప్రసిద్ధి చెందిన తమిళనాట పర్యటించడం తనకెంతో ఆనందంగా ఉందని, అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు తనను సోదరిగా భావించి గట్టి మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కోరారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ఆమె రాష్ట్రంలో అన్నాడీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాల మద్దతు కోరేందుకు శనివారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు. విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు అన్నామలై, కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ తదితరులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత నుంగంబాక్కంలోని స్టార్‌ హోటల్‌లో అన్నాడీఎంకే, మిత్రపక్షాలైన బీజేపీ, పీఎంకే, టీఎంసీ తదితర నాయకులు, ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్లుప్తంగా ప్రసంగిస్తూ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమిళనాడు కీలకపాత్రను పోషించిందని, తమిళ సమరయోధులు స్వాత్రంత్యం కోసం పోరు సాగించారని ప్రశంసించారు. తనను సోదరిగా భావించి మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాలు మనవేనని, ఆ ప్రాంతాల్లో ఉన్నవారంతా ఆత్మీయులేననే భావంతో కూడిన తమిళ ప్రాచీన కవి పూంగుండ్రనార్‌ సూక్తిని ఆమె ఉటంకించారు. 


అన్నాడీఎంకే సంపూర్ణ మద్దతు

అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు సంపూర్ణ మద్దతునిస్తారని ప్రకటించారు. గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముకు డీఎంకే మద్దతు ఇవ్వకపోడం గర్హనీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ద్రావిడ తరహా పాలన అంటూ గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ ద్రౌపది ముర్మును ఆదరించి ఉండాలన్నారు. దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి గిరిజన వనిత ద్రౌపదిని ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుకొంటున్నానని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ మాట్లాడుతూ ద్రౌపది ముర్ము అత్యధిక మెజారిటీ ఓట్లతో ఘనవిజయం సాధిస్తారని ప్రకటించారు. వీరితోపాటు పార్టీ ప్రముఖులు నయినార్‌ నాగేంద్రన్‌, వానతి శ్రీనివాసన్‌, పీఎంకే తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌, టీఎంకే నేత జీకే వాసన్‌ తదితరులు హాజరయ్యారు. అన్నాడీఎంకే తరఫున  మాజీ మంత్రులు డి. జయకుమార్‌, కేపీ మునుసామి, నత్తం విశ్వనాథన్‌, సెంగోటయ్యన్‌, సి. పొన్నయ్యన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడప్పాడి పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇదే విధంగా బీజేపీ నాయకుడు అన్నామలై, కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ కూడా ఆమెను శాలువాతో సత్కరించారు.


చివరగా ఓపీఎస్‌ భేటీ

ఇదిలా ఉండగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో అన్నాడీఎంకే కూటమి నాయకులు, ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత అన్నాడీఎంకే నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం ఆమెను కలుసుకుని మద్దతు ప్రకటించారు. ఆ సందర్భంగా ద్రౌపది ముర్మును శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయనతోపాటు మాజీ మంత్రి వైద్యలింగం, ఎంపీ రవీంద్రనాధ్‌ కూడా పాల్గొన్నారు.


పార్టీ సమన్వయకర్త నేనే

ఈ సమావేశం ముగిశాక హోటల్‌ వెలుపల పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ పార్టీ నిబంధనల మేరకు తాను అన్నాడీఎంకే సమన్వయకర్త అని ప్రకటించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ఇస్తారని పార్టీ నేతగా ఆమెకు హామీ ఇచ్చానని చెప్పారు. కాగా ఎడప్పాడి, ఆయన వర్గీయులంతా సమావేశం నుంచి వెళ్లిపోయేంతవరకూ పన్నీర్‌సెల్వం ఆయన మద్దతుదారులు హోటల్‌లో మరో గదిలో గంటకు పైగా వేచి ఉన్నారు. ఎడప్పాడి వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాతే ఆయన ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.


పుదువైలో మద్దతు కోరిన ద్రౌపది ముర్ము 

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శనివారం ఉదయం పుదుచ్చేరిలో పర్యటించి అక్కడి అధికార పార్టీ ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మద్దతు కోరారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 11.40 గంటలకు ఆమె పుదుచ్చేరికి చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రంగస్వామి, స్పీకర్‌ సెల్వం, మంత్రులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఓ హోటల్‌లో ఎన్డీఏ మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశమై మద్దతు కోరారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు మురళీధరన్‌, ఎల్‌.మురుగన్‌, బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌, సీఎం రంగస్వామి, మంత్రులు నమశ్శివాయం, సాయ్‌ శరవణకుమార్‌, ఎంపీ సెల్వగణపతితో పాటు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, పుదుచ్చేరి రాష్ట్రంలో ద్రౌపది ముర్ముకు ఒక ఎంపీతో పాటు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‏కు చెందిన 10 మంది, బీజేపీకి చెందిన ఆరుగురు, అంకాళన్‌, శివశంకర్‌, ప్రకాష్‌ కుమార్‌, కొల్లపల్లి అశోక్‌ అనే నలుగురు స్వతంత్ర సభ్యులతో కలిసి మొత్తం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించనుంది.



Updated Date - 2022-07-03T13:23:50+05:30 IST