మన వాళ్ల వ్యాక్సిన్‌ను అడ్డుకోవాలని చూశారు

ABN , First Publish Date - 2021-12-24T08:48:52+05:30 IST

ఓ తెలుగువాడి ఎదుగుదలను మరో తెలుగువాడు గుర్తించకపోగా చిన్నచూపు చూసే దురలవాట్లు మానుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

మన వాళ్ల వ్యాక్సిన్‌ను  అడ్డుకోవాలని చూశారు

  • తెలుగు వాడంటే చిన్నచూపు పోవాలి! 
  • మనవాళ్లు తయారు చేసిన వ్యాక్సిన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు
  • ఈ ధోరణి వద్దు.. ఐక్యంగా పనిచేసుకోవాలి: సీజేఐ ఎన్వీ రమణ
  • డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రదానం


హైదరాబాద్‌ సిటీ, రాయదుర్గం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఓ తెలుగువాడి ఎదుగుదలను మరో తెలుగువాడు గుర్తించకపోగా చిన్నచూపు చూసే దురలవాట్లు మానుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగువాడు రూపొందించిన కొవాగ్జిన్‌ ఇతర వ్యాక్సిన్‌లతో పోల్చితే ప్రభావంగా పనిచేస్తోందని, కొత్త వేరియంట్‌లను కూడా నిరోధించగలుగుతోందని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ తయారీ సమయంలో నిరుత్సాహ పరచడంతోపాటు, డబ్యూహెచ్‌వో నుంచి అనుమతులు రాకుండా ఉండేందుకు కొంత మంది ప్రయత్నించారని, వారిలో విదేశీయులతో పాటు మనవాళ్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి ధోరణి విడిచిపెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. తెలుగువాళ్లంతా  ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లో గురువారం డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రదానోత్సవానికి సీజేఐ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురస్కారాలను ప్రదానం చేసిన అనంతరం మాట్లాడారు. కోర్టు గదుల్లో రోజుల తరబడి కూర్చోవడం వల్ల వెన్నెముక, మెడ నొప్పితో బాధపడే వాడినని, తనకు గత 20 ఏళ్లుగా ప్రకృతి వైద్యులు డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ చికిత్సను అందిస్తున్నారని, తనతోపాటు సుప్రీం కోర్టులో మరో 10 మంది  న్యాయమూర్తులకు కూడా ఆయనే వైద్యం చేశారని చెప్పారు. 


ఇలాంటి గొప్ప వారికి అవార్డులను అందించడం తన అదృష్టమని  పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఎంతో మంది సేవచేస్తున్న వారిని గుర్తించి అవార్డులు అందిస్తున్న రామినేని ఫౌండేషన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తల్లిని, మన సంస్కృతి, మాతృభాషను గౌరవించడం మన సంప్రదాయమని.. తెలుగు భాషను, తెలుగు జాతిని రక్షించుకోవడం మనందరి కర్తవ్యమని ఉద్బోధించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు నేర్పించడంతోపాటు ఇంట్లో ఉన్న సమయంలో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. కాగా 2020 ఏడాదికి గాను నబార్డ్‌ ఎండీ డాక్టర్‌ చింతల గోవిందరాజుకు విశిష్ట పురస్కారం, యాంకర్‌ సుమ, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌, సంఘసేవకుడు బండ్లమూడి శ్రీనివా్‌సలకు విశేష పురస్కారాలు అందించారు. 2021 ఏడాదికి భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లాలకు విశిష్ట పురస్కారం, నటుడు బ్రహ్మానందం, నిమ్స్‌ ఎన స్తీషియా విభాగం డాక్టర్‌ దుర్గా పద్మజ, సినీకవి ఎస్‌వీ రామారావులకు విశేష పురస్కారాలు అందించారు.

Updated Date - 2021-12-24T08:48:52+05:30 IST