హైదరాబాద్‌లో సీన్ రివర్స్.. లాక్‌డౌన్ సడలింపులతో..

ABN , First Publish Date - 2020-05-21T16:02:12+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపులతో రెండు నెలల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో నగరమంతా సందడిగా మారింది. కొన్ని షాపులు వినియోగదారులు లేక వెలవెలబోయాయి. కంప్యూటర్‌, ఎలకా్ట్రనిక్‌ సర్వీసింగ్‌ సెంటర్లు బిజీగా కనిపించాయి. అత్యధిక శాతం డిజిటల్‌ పద్ధతిలోనే లావాదేవీలు కొనసాగించినట్లు వ్యాపారవేత్తలు తెలిపారు

హైదరాబాద్‌లో సీన్ రివర్స్.. లాక్‌డౌన్ సడలింపులతో..

వాహనాలు, ప్రజల రాకపోకలు

ఊపిరి పీల్చుకున్న వ్యాపారులు

ఇప్పటికీ ప్రారంభంకాని కొన్ని వ్యాపారాలు

చాలాచోట్ల కానరాని భౌతిక దూరం

డిజిటల్‌ లావాదేవీల వైపే మొగ్గు 


హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సడలింపులతో రెండు నెలల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో నగరమంతా సందడిగా మారింది. కొన్ని షాపులు వినియోగదారులు లేక వెలవెలబోయాయి. కంప్యూటర్‌, ఎలకా్ట్రనిక్‌ సర్వీసింగ్‌ సెంటర్లు బిజీగా కనిపించాయి. అత్యధిక శాతం డిజిటల్‌ పద్ధతిలోనే లావాదేవీలు కొనసాగించినట్లు వ్యాపారవేత్తలు తెలిపారు. చాలా చోట్ల సరి బేసి సంఖ్యల పద్ధతి పాటించినప్పటికీ... మంగళ, బుధవారాల్లో కొన్ని షాపులు అస్సలు తెరుచుకోలేదు. కొందరు మాస్కులు ధరించకుండానే బయటకు రావడం, భౌతికదూరం పాటించకపోవడం లాంటి దృశ్యాలు కనిపించాయి. వాహనాల రిపేరింగ్‌ సెంటర్లు, హెయిర్‌ సెలూన్లు, సెల్‌ఫోన్‌ దుకాణాలు, రిపేరింగ్‌ సెంటర్లు మాత్రం రద్దీగా కనిపించాయి. వాహనాల షోరూమ్‌లు తెరుచుకున్నా... కొనేందుకు ఎవరూ రాలేదని కొందరు నిర్వాహకులు తెలిపారు.


భోజన ప్రియుల ఉత్సాహం

రెండు నెలల నుంచి ఇంటి భోజనాలకే పరిమితమైన భోజన ప్రియులు టేక్‌ అవే ద్వారా ఆహారం అందించే హోటళ్ల వద్ద భౌతికదూరం పాటిస్తూ బారులు తీరారు. కొందరు ఆన్‌లైన్‌ ద్వారా హోమ్‌ డెలివరీ చేయించుకున్నారు. చాలా చోట్ల బేకరీలు, పిజ్జా సెంటర్లు, స్వీట్‌ షాపులు కూడా తెరుచుకున్నాయి. 


వస్త్ర దుకాణాలు వెలవెల...

వస్త్ర దుకాణాలు వినియోగదారులు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. కొన్ని దుకాణాల నిర్వాహకులు క్లియరెన్స్‌ సేల్‌ పేరుతో 50 శాతానికిపైగా డిస్కౌంట్లు ప్రకటించినా... కొనుగోలుదారులు లేకపోవడం గమనార్హం. రంజాన్‌ సందర్భంగా పాతబస్తీ, ఆబిడ్స్‌, మలక్‌పేట్‌, మెహిదీపట్నం, టోలీచౌకీ, నాంపల్లి, మల్లేపల్లి ప్రాంతాల్లో వస్త్ర దుకాణాల్లో కస్టమర్లు కనిపించారు. భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్‌ మార్కెట్‌ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. సికింద్రాబాద్‌లోని వస్త్ర బజార్‌ బోసిపోయింది. 


ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కోసం...

ఏసీలు, కూలర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఇతర గృహోపకరణాలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆయా షోరూంలు వినియోగదారులతో కళకళలాడాయి. నగరంలోనే అతి పెద్ద కంప్యూటర్‌ మార్కెట్‌గా పేరొందిన సీటీసీ (షెనాయ్‌ ట్రేడ్‌ సెంటర్‌)లో సరి-బేసి మార్కింగ్‌ ప్రక్రియ బుధవారం పూర్తయినందున పాక్షికంగా దుకాణాలు తెరుచుకున్నాయి. 


రద్దీగా రాణిగంజ్‌

హార్డ్‌వేర్‌, అగ్రికల్చర్‌ మార్కెట్‌గా ప్రసిద్ధిగాంచిన రాణిగంజ్‌ మార్కెట్‌ బుధవారం ట్రాఫిక్‌ వ్యూహంలో ఇరుక్కుంది. వారం రోజుల క్రితమే హార్డ్‌వేర్‌ అగ్రికల్చరల్‌, పెయింట్‌, ఎలక్ట్రికల్‌  వ్యాపారాలకు అనుమతి లభించినప్పటికీ... సరి-బేసి మార్కింగ్‌ చేయకపోవడంతో దుకాణాలు తెరవడంలో జాప్యం జరిగింది. బుధవారం దుకాణాలు పాక్షికంగా తెరుచుకున్నాయి. ఒక్కసారిగా కొనుగోలుదారులు తరలిరావడంతో రాణిగంజ్‌, విక్టోరియా గంజ్‌, డిస్టిలరీ రోడ్‌ ప్రాంతాలు ట్రాఫిక్‌ వలయంలో చిక్కుకుపోయాయి. 


బేగంబజార్‌ జోష్‌...

నగరంలోనే అతిపెద్దదైన బేగంబజార్‌ మార్కెట్‌లో బుధవారం భారీగా క్రయవిక్రయాలు జరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు ఉన్నట్లే మార్కెట్‌లో జనం గుంపులు.. గుంపులుగా తిరుగుతున్నారు. లాక్‌డౌన్‌లో సరిబేసి అమలు జరుగుతున్నప్పటికీ.. బేగంబజార్‌లో ఆ ఆనవాళ్లు కనిపించలేదు. నగరవాసులు, చిరు వ్యాపారులు కొనుగోలు నిమిత్తం భారీ ఎత్తున తరలివచ్చారు. వాహనాలతో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. భౌతికదూరం పాటించిన దాఖలాలు ఎక్కడా కనిపించ లేదు. అతిపెద్దదైన అజీజ్‌ప్లాజా మార్కెట్‌లో వ్యాపారాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ దాదాపు 300పైగా వివిధ దుకాణాలు ఉన్నాయి. సరి బేసి సంఖ్యల నెంబరింగ్‌ పూర్తయినా.. బుధవారం కేవలం 10శాతం దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. అతి పెద్దదైన బేగంబజార్‌ చేపల మార్కెట్‌ పూర్తిగా తెరుచుకుంది. 


దిల్‌సుఖ్‌నగర్‌.. 

నిత్యం రద్దీతో కళకళలాడే దిల్‌సుఖ్‌నగర్‌ మార్కెట్‌ వెలవెల బోయింది. నెంబర్ల ఆధారంగా కొన్ని షాపులు తెరుచుకున్నా వినియోగదారుల సంఖ్య రెండంకెలు దాటలేదని దుకాణదారులు వాపోయారు. 


అమీర్‌పేట ఓకే

అమీర్‌పేట, మైత్రీవనం, గురుద్వార్‌ తదితర ప్రాంతాల్లో బుధవారం షాపులు తెరుచుకున్నాయి. అమీర్‌పేటలో నాలుగు నర్శింగ్‌ షోరూంలు ఉండగా అందులో రెండు ప్రారంభం అయ్యాయి. సిబ్బంది మాస్క్‌లు ధరించి వినియోగదారులకు అవసరమైన వస్తువులను చూపిస్తున్నారు. సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్‌ వంటి షాపింగ్‌మాల్స్‌లో శానిటైజేషన్‌, ఽథర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తూ భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. అన్నపూర్ణ బ్లాక్‌, ఆదిత్య ఎన్‌క్లేవ్‌లలోని మొబైల్‌ షాపుల నిర్వాహకులు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. కొన్ని నిత్యావసర సరుకుల విక్రయం షాపులలో కనీసం మాస్క్‌లు ధరించకుండా కొనుగోళ్లు సాగుతున్నాయి. 


సికింద్రాబాద్‌లో జరిమానాలు

సరిబేసి విధానం సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో సవ్యంగా అమలవుతోంది. ఇప్పటికే జీహెచ్‌ఏంసీ సిబ్బంది చిలకలగూడ, మైలార్‌గడ్డ, సీతాఫల్‌మండి, నామాలగుండు, శ్రీదేవీ నర్సింగ్‌హోమ్‌, వారాసిగూడ తదితర ప్రాంతాల్లో షాపులకు నంబర్లు వేసి సరిబేసి విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించిన షాపులకు జరిమానా విధిస్తున్నారు. 


టీ, టిఫిన్‌ సెంటర్ల పరిస్థితేంటి..?

టీ స్టాళ్లు, చిన్నచిన్న టిఫిన్‌ సెంటర్లు, ఫాన్‌షాపుల యాజమాన్య వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. షాపులు తెరుచుకోవచ్చా లేదా అన్న సందేహాలు వెలిబుచ్చుతున్నారు. గ్రీన్‌ జోన్లలో అన్ని షాపులు, తెరుచుకోవచ్చన్న నిబంధనలు వీటికి వర్తిస్తాయో లేదో.. తెలియక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నుంచి సరైన సమాధానం రావడం లేదని వాపోతున్నారు.


మా పరిస్థితేంటి..?: శివకుమార్‌, వీధివ్యాపారి, కేపీహెచ్‌బీ కాలనీ

సడలింపుల్లో వీధివ్యాపారుల ప్రస్తావన లేకపోవడంతో అధికారులు దుకాణాలను తెరవనివ్వడంలేదు. సరి, బేసి నెంబర్లు ఇవ్వకపోవడంతోపాటు మరికొద్దిరోజులు వేచి ఉండాలని అంటున్నారు. 


మాల్స్‌ తెరవచ్చా?: సామ మల్లారెడ్డి, అధ్యక్షుడు, వెంకటాద్రి ట్రేడర్స్‌ అసోసియేషన్‌

మాల్స్‌కు అనుమతి లేదని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. అయినా దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు పాలు ప్రాంతాలలో షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయమన్నారు. వారికి ఫోన్‌ చేస్తే పట్టించుకోవడం లేదు.


అద్దెలు చెల్లించుకోలేని స్థితి...:శేఖర్‌, రెడీమేడ్‌ వ్యాపారి, దిల్‌సుఖ్‌నగర్‌

లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా షాపులు మూసే ఉన్నాయి. వేలల్లో ఉన్న అద్దెను చెల్లించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తీరా షాపులు తెరచుకోడానికి అనుమతి వస్తే వారంలో మూడు రోజులే అని  నిబంధనలు పెట్టారు. పైగా కొనుగోలుదారులు కూడా రావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

Updated Date - 2020-05-21T16:02:12+05:30 IST