ముందస్తు రాజకీయ ‘వేడి’

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముందస్తుగానే రాజకీయ వేడి మొదలైంది.

ముందస్తు రాజకీయ ‘వేడి’


  • జనంలోకి ప్రధాన పార్టీల నేతలు
  • తుక్కుగూడ సభతో బీజేపీ శ్రేణుల్లో జోష్‌
  • మరుసటి రోజే టీఆర్‌ఎస్‌ నిరసన సభ
  • పాదయాత్రలకు కాంగ్రెస్‌ సన్నాహాలు
  • శివార్లలో మరిన్ని బహిరంగ సభలకు సన్నద్ధం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముందస్తుగానే రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆయా రాజకీయ పార్టీలు జనం బాటపట్టాయి. నియోజకవర్గాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. పలు పార్టీల్లో ఆయారాం గయారాంల సందడి మొదలైంది. తటస్థులు, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు రప్పించుకునేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. ఈ మేరకు అన్ని వనరులు సమకూర్చుకుంటున్నాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నిరంతరం జనంలో ఉండే విధంగా  ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, మే 16) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పొలిటికల్‌ హడావిడి మొదలైంది. ఇప్పటికే నగరశివార్లలో కాంగ్రెస్‌, బీజేపీలు భారీ బహిరంగ సభలు నిర్వహించగా అధికార టీఆర్‌ఎస్‌ కూడా సత్తాచాటేందుకు శివార్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. తాజాగా భారతీయ జనతాపార్టీ తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభకు భారీగా జనం హాజరయ్యారు. దీంతో కమలనాథుల్లో కదనోత్సాహం మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండోవిడత చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రంగారెడ్డిజిల్లాలో కొనసాగిన విషయం తెలిసిందే. తుక్కుగూడలో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ అగ్రనేత, మాజీ హోంమంత్రి అమిత్‌షా విచ్చేశారు. బీజేపీ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సభకు భారీగా జనం హాజరుకావడంతో ఆ పార్టీ శ్రేణులు జోష్‌తో ఉన్నాయి. దీనికి ముందు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతుభరోసా యాత్ర నిర్వహించి ఇదే ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈసభ కూడా విజయవంతమైంది. తాజాగా బీజేపీ కూడా ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి తన బలాన్ని ప్రదర్శించింది. అయితే మరుసటి రోజే టీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గంలో పెట్రో, గ్యాస్‌ ధరలకు నిరసనగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాదిగా జనాన్ని సమీకరించారు. తాజాగా టీడీపీ కూడా రాజేంద్రనగర్‌లో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌, అరవింద్‌కుమార్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సుభా్‌షయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ దూకుడు

 దూకుడుఅధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలో తటస్థులు, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకుంటోంది. ఇంతకుముందు మీర్‌పేట మున్సిపాలిటీలోని ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు, కందుకూరు మండలం పులిమామిడి బీజేపీ సర్పంచ్‌ అనితాశ్రీనివా్‌సలను టీఆర్‌ఎస్‌ తమ వైపు తిప్పుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలోనే పులిమామిడి సర్పంచ్‌ టీఆర్‌ఎ్‌సలో చేరడం గమనార్హం. తాజాగా సోమవారం టీడీపీకి చెందిన కందుకూరు మండలం ముచ్చెర్ల గ్రామసర్పంచ్‌ ఇంజమూరి రామచంద్రారెడ్డి తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌  సమక్షంలో అధికార పార్టీలో చేరారు. మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మున్ముందు మరిన్ని చేరికలు ఉంటాయని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఇదిలాఉంటే పార్టీ అధినాయకత్వమే నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలను రూపొందించి ఈమేర ఎమ్మెల్యేలకు, స్థానిక ముఖ్యనేతలకు షెడ్యూల్‌ ఇస్తున్నారు. ఏ రోజు.. ఏ ప్రాంతాల్లో పర్యటించాలి? అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు సైతం అధిష్ఠానం కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌లు సర్వేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా నిత్యం జనంలోనే ఉంటున్నారు. 

చాపకింద నీరులా బీజేపీ

వచ్చే ఎన్నికలకు బీజేపీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా నగర శివార్లలో పాగా వేసేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తటస్థులు, ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేయత్నంచేస్తోంది. ఇప్పటికే చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు మరికొందరు ముఖ్యనేతలతో బీజేపీ నాయకత్వం మంతనాలు జరుపుతోంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ ముఖ్యనేతలందరితో మాట్లాడారు. చేవెళ్ల ఎంపీ సీటు ఆశిస్తున్న ఆయన చేరిక దాదాపు ఖాయమని తెలుస్తోంది. విశ్వేశ్వరెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు చెందిన కొందరు నేతలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీజేపీ గణనీయంగా ఓటు బ్యాంకు పెంచుకున్న విషయం తెలిసిందే. దీంతో శివారు ప్రాంతాల్లో ఈ సారి తన సత్తా చాటాలని భావిస్తోంది. శివారు నియోజకవర్గాల్లో ముమ్మరంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర రెండో దశ ముగింపు సభను తుక్కుగూడలో నిర్వహించారు. వాస్తవానికి అమిత్‌షా సభను అలంపూర్‌లో నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం ముందు భావించింది. అయితే నగర శివార్లలో బహిరంగ సభ పెడితే హైదరాబాద్‌ నగరంపై ఎక్కువ ప్రభావం ఉంటుందని పార్టీ నేతలు భావించి తుక్కుగూడలో సభ నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో నగర శివార్లలో మరికొన్ని బహిరంగ సభలకు బీజేపీ ప్రయత్నిస్తోంది. 

కదనరంగంలోకి కాంగ్రెస్‌

మరోవైపు కాంగ్రెస్‌ కూడా జనంలోకి వెళ్లేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఏఐసీసీ దేశవ్యాప్తంగా ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్‌ పాదయాత్రలకు సెంటిమెంట్‌గా ఉన్న చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టే అవకాశాలున్నాయి. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రానికి రాహుల్‌గాంధీని తీసుకురావాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అలాగే రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా ఈనెల 21వ తేదీ నుంచి నెలరోజులపాటు  రైతురచ్చబండ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా హాజరుకావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇదిలాఉంటే నగర శివార్లలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అమిత్‌షా సభకు ధీటుగా ఈకార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST