Abn logo
Nov 25 2020 @ 17:23PM

దూసుకొస్తున్న ‘నివర్’.. సిద్ధంగా ఉన్నామన్న ఎన్‌డీఆర్ఎఫ్!

చెన్నై: అతి తీవ్రమైన తుఫానుగా మారిన ‘నివర్’ తమిళనాడు వైపుకు దూసుకువస్తోంది. బుధవారం సాయంత్రం లేదా గురువారం తెల్లవారు జామున మమ్మళ్లపురం, కరైకల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. నివర్ కారణంగా కురుస్తున్న వర్షాలతో చెన్నై మహానగరం తడిసి ముద్దవుతోంది. కాగా నివర్‌ను తట్టుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. సీఏం పళనిస్వామి ఇప్పటికే..చెన్నై, వెల్లూర్, కడలూర్, నాగపట్టనమ్, తిరువారూర్, చెంగల్‌పేట్, కాంచీపురం జిల్లాల్లో గురువారం ప్రభుత్వ సెలవని ప్రకటించారు. 

మరోవైపు.. ప్రజల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్‌డీఆర్‌ఎఫ్ పేర్కొంది. ‘నివర్ తుఫాన్ అతి తీవ్రమైనదిగా ఐఎమ్‌డీ వర్గీకరించింది. దీంతో ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మేం పలు చర్యలు తీసుకుంటున్నాం. గత రెండు రోజులుగా మా బృందాలు క్షేత్రస్థాయిలో అనేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చెరీల్లో మొత్తం 25 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి ’అని ఎన్‌డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. తమిళనాడు నుంచి 30 వేల మందిని, పుదుచ్చెరీ నుంచి మరో 7 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement