తునికాకు సేకరణకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-04-23T06:41:51+05:30 IST

వేసవి సీజన్‌లో గ్రామీణ నిరుపేదలకు ఉపాధితో పాటు ఆదాయాన్ని ఇచ్చే తునికాకు సేకరణకు అటవీ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

తునికాకు సేకరణకు సన్నద్ధం
తునికి ఆకు కట్టలను ఆరబెట్టిన దృశ్యం



జిల్లాలో 12 యూనిట్లకు టెండర్లు పూర్తి
కట్ట ధర రూ.2.25లకు పెంచిన ప్రభుత్వం
ఈ ఏడాది 9300 స్టాండర్డ్‌ బ్యాగుల లక్ష్యం
గ్రామీణ నిరుపేదలకు మంచి ఉపాధి మార్గం
మే 1 నుంచి తునికాకు సేకరణకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : వేసవి సీజన్‌లో గ్రామీణ నిరుపేదలకు ఉపాధితో పాటు ఆదాయాన్ని ఇచ్చే తునికాకు సేకరణకు అటవీ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్థుతం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 4153 చదరపు కిలోమీటర్లు కాగా అటవీ ప్రాంతం 1706.89 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. జిల్లాలోని ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌ సబ్‌ డివిజన్‌ల పరిధిలో ఆకు సేకరణకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఆదిలాబాద్‌ డివిజన్‌లో 9, ఇచ్చోడ 1, ఉట్నూర్‌లో 2 మొత్తం 12 యూనిట్లకు గాను ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈయేడు 9300 స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకు సేకరణే లక్ష్యంగా పెట్టుకు న్నా రు. ఈ సీజన్‌లో పూర్తి స్థాయిలో తునికాకు సేకరణ చేయా లన్న ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం రూ.2 ఉన్న 50 ఆకుల కట్ట ధర ఈయేడు రూ. 2.25 పైసలకు ప్రభుత్వం పెంచింది. ఆకు సేకరణ కోసం ఇప్పటికే కొన్ని యూనిట్లలో కొమ్మకొట్టడం (చాక్‌తరస్‌) ప్రక్రియను మొదలు పెట్టారు. జిల్లాలో నమోదవుతున్న పగ టి ఉష్ణోగ్రతల ప్రభావానికి ఈసారి ఆకు ఆశాజనకంగానే కనిపిస్తోంది. కొన్నిప్రాంతాల్లో బీడీ ఆకు తెంపడాన్ని ప్రారం భించిన మహిళలు కల్లాల ప్రారంభానికి ఎదురుచూస్తు న్నారు. ఉపాధి కూలీతోపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో మహిళలు అడవిలో ఆకులు సేకరిస్తూ అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే మే1 నుంచి తునికాకును సేకరించేందుకు అధికారులు కసరత్తును మొదలు పెట్టారు.
అదనపు ఆదాయం..
గ్రామీణ నిరుపేద కుటుంబాలు వేసవి సీజన్‌లో తునికాకు సేకరి స్తూ అదనంగా ఆదాయం పొందుతున్నారు. ఇప్పటికే యాసంగి వ్యవసాయ పను లు ముగించుకున్న గ్రామీ ణులకు తునికి ఆకు సేకర ణ మంచి ఉపాధి మార్గం గా మారుతుంది. నిత్యం ఒక్కొక్కరూ రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించే అ వకాశం ఉంది. ఈ వేసవి సీజన్‌లో జిల్లాలోని దాదాపు 2 లక్షల మందికి పైగా కూలీలు ఆకు సేకరణతో ఉపాధి పొందుతారు. ప్రతీ రోజు తెల్లవారు జా మునే ఇంటిళ్లిపాది కలిసి అడవికి వె ళ్తారు. చెట్టూ, గుట్టలను తిరు గుతూ బీడీ ఆకులను సేక రిస్తారు. ఇలా సేకరిం చిన ఆకులను ఇంటి వద్ద కట్టలుగా కట్టి అటవీ శాఖ ఏర్పాటు చేసిన కల్లాలకు తరలి స్తారు. సుమారు రెండు నె లల పాటు బీడీ ఆకును సేక రించిన అనంతరం వచ్చే వానాకాలం పనుల్లో నిమగ్నమవుతారు. అయితే తునికి ఆకు సేకరణపై మారుమూల గ్రామాల ప్రజలకు అవగాహన లేకపోవడంతో ప్రమాదాల భారిన పడుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. వడదెబ్బతోపాటు ఎలుగుబంట్లు, విషసర్పాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఆకు సేకరించే సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్న అలాంటి పథకాలు పేద ధరికి చేరడంలేదంటున్నారు.
కాంట్రాక్టర్ల ఎత్తుగడ..
జిల్లాలో టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు కొత్త ఎత్తుగడలతో ప్రయత్నాలు మొదలు పెట్టారు. అసలు టెండర్లు దక్కించుకున్న అటవీ ప్రాంతం పరిధిలో కూలీలతో తునికి చెట్ల కొమ్మలను కొట్టాల్సి ఉంటుంది. అయితే కొన్నే ళ్లుగా కాంట్రాక్టర్‌లు ఇలా చేయకుండా గుట్టు చప్పుడు కా కుండా అడవికి నిప్పంటిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కొమ్మకొట్టడం అధిక ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇలా చేస్తే నష్టపోతామని భావిస్తున్న కాంట్రా క్టర్‌లు అడవికి నిప్పంటించేస్తున్నారు. దీంతో తునికాకు చెట్టు మొదలు కాలిపోతుంది. కాంట్రాక్టర్‌ల ఇష్టారాజ్యంతో యేటా రూ.కోట్ల విలువైన అటవీ సంపద కాలిబూడిదవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లాలో ఎక్కువగా టైగర్‌ జోన్‌ ఉండడంతో ఆకు సేకరణకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఈ జోన్‌లో ఆకు సేకరణను అధికారులు నిషేధించడంతో కూలీలకు కొంత ఇబ్బందిగా మారనుంది. కాంట్రాక్టర్ల కదలికలపై నిఘా లేక పోవడంతో కొందరు అధికారులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే జిల్లా బీడు, పోడు భూముల్లో లభ్యమయ్యే తునికాకులు ఎంతో నాణ్యతగా ఉండడంతో ఎక్కువగా డిమాండ్‌ ఏర్పడుతోంది. దీంతో టెండర్లను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్‌లు పోటీ పడుతుంటారు. బీడీలను తయారు చేసేందుకు జిల్లా నుంచి తునికి ఆకును బర్మా, బంగ్లాదేశ్‌లతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టర్‌లు జిల్లాలో మకం వేసి ఏటా తునికి ఆకును తరలించుకుపోవడం కొనసాగుతూనే ఉంది.
టెండర్లను పూర్తి చేశాం..
- రాజశేఖర్‌ (డీఎఫ్‌వో, ఆదిలాబాద్‌)

జిల్లాలో ఈ యేడు తునికాకు సేకరణ చేపట్టేందుకు టెండర్లను పూర్తి చేయడం జరిగింది. ఈ సారి 9300ల స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నాం. కొంత ఆలస్యమైన ఆకుసేకరణను చేపడుతాం. మే 1 నుంచి జిల్లా వ్యాప్తంగా 12 యూనిట్లలో కల్లాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. గ్రామీణ కూలీలు దళారులకు ఆకును విక్రయించకుండా ప్రభుత్వ కల్లాలకు తరలించి మద్ధతు ధరను పొందాలి.

Updated Date - 2022-04-23T06:41:51+05:30 IST