హరితహారానికి సన్నద్ధం

ABN , First Publish Date - 2020-06-07T10:18:42+05:30 IST

చినుకులు రాలడమే ఆలస్యం మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6వ విడత హరితహారంలో

హరితహారానికి సన్నద్ధం

6వ విడత లక్ష్యం 54 లక్షల మొక్కలు 

26 శాఖలకు టార్గెట్‌

నర్సరీల్లో 72.91 లక్షల మొక్కలు సిద్ధం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): చినుకులు రాలడమే ఆలస్యం మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6వ విడత హరితహారంలో 54 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా నిర్ణయించారు.  జిల్లాలోని నర్సరీల్లో గ్రామీణాభివృద్ధిశాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను సిద్ధంగా ఉంచారు. 255 నర్సరీల్లో 72.91 లక్షల మొక్కలను పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం 26 శాఖలకు టార్గెట్‌ నిర్ణయించింది. గ్రామ పంచాయతీల పరిధిలోనే నర్సరీలను ఏర్పాటు చేయడంతో మొక్కల సరఫరాకు ఇబ్బంది లేకుండా పోయింది. అధికారులతోపాటు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.


ఏటా హరితయజ్ఞంలో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ మొక్కలను నాటుతుండడంలో ఉన్న ఉత్సాహాం వాటి సంరక్షణలో కనిపించడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సారి మాత్రం మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించారు. గ్రామ పంచాయతీలకు సమకూర్చిన ట్రాక్టర్ల ద్వారా మొక్కలకు నీళ్లు పోసేందుకు ప్రణాళిక రూపొందించారు.  మొక్కలను తొలగిస్తే కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. దీంతో మొక్కలు జీవం పోసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పూల మొక్కలు, పండ్ల మొక్కలు. నీడనిచ్చే మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  


హరిత టార్గెట్‌ 54 లక్షలు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6వ విడత హరితహారంలో 54 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 72.91 లక్షల మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. బోయినపల్లి మండలంలో 23 నర్సరీల్లో 4.3 లక్షల మొక్కలు, ఇల్లంతకుంట 33 నర్సరీల్లో 10.55 లక్షలు, చందుర్తి 19 నర్సరీల్లో 8.11 లక్షలు, కోనరావుపేట   28 నర్సరీల్లో 9.54 లక్షలు, రుద్రంగి 10 నర్సరీల్లో1.69 లక్షలు, వేములవాడ అర్బన్‌లో 11నర్సరీల్లో 1.09 లక్షలు, వేములవాడ రూరల్‌ 17 నర్సరీల్లో 4.03 లక్షలు, గంభీరావుపేట 21 నర్సరీల్లో 6.02 లక్షలు, ముస్తాబాద్‌  22 నర్సరీల్లో 10.2 లక్షలు, తంగళ్లపల్లి  30 నర్సరీల్లో 7.82 లక్షలు, వీర్నపల్లి  17 నర్సరీల్లో 2.84 లక్షలు, ఎల్లారెడ్డిపేట 6.72 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. నర్సరీలను సీఎం వ్యక్తిగత కార్యదర్శి ప్రియాంక వర్గీస్‌ పరిశీలించారు. హరితహారంపై పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ నర్సరీలను పరిశీలిస్తూ హరితహారానికి సన్నద్ధం చేస్తున్నారు. 


Updated Date - 2020-06-07T10:18:42+05:30 IST