ఆయిల్‌పాం సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-19T06:17:57+05:30 IST

రైతులు విభిన్న పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వైపు అడుగులు వేసిన రైతులు తాజాగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

ఆయిల్‌పాం సాగుకు సన్నద్ధం
ఆయిల్‌పాం ఫ్యాక్టరీని సందర్శించిన రైతులు (ఫైల్‌)

 - ఆసక్తి చూపుతున్న అన్నదాతలు 

-  ప్రస్తుత వానాకాలంలో 800 ఎకరాల్లో సాగు

- కొనసాగుతున్న మార్కింగ్‌ 

- ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహాలు 

- విజ్ఞాన యాత్రలతో రైతులకు అవగాహన 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రైతులు విభిన్న పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వైపు అడుగులు వేసిన రైతులు తాజాగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే వానాకాలం సీజన్‌లో ఆయిల్‌పాం సాగు చేసే విధంగా సర్వే చేసి మార్కింగ్‌  ప్రారంభించారు. జిల్లాకు  8398 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యం కేటాయించారు. ఈ ఏడాది 1600 ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకొచ్చారు. ఇందులో ప్రస్తుత వానాకాలంలో 800 ఎకరాలు సాగు కానుంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ, ప్రోత్సాహాలు ఉండడంతో ఆయిల్‌పాం సాగు చేయడానికి రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యాన  శాఖ ఆధ్వర్యంలో రైతులకు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వీలుగా ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట ప్రాంతంలోని ఆయిల్‌పాం సాగుకను పరిశీలించడానికి విజ్ఞాన యాత్రలు చేపట్టారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ముందుగానే రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎఫ్‌జీపీ- పీయూ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి కేటాయించారు. 


జిల్లాలో 8,398 ఎకరాల్లో సాగు లక్ష్యం 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,398 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 780 మంది రైతులు ఆయిల్‌పాం సాగుకు కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో కాళేశ్వరం జలాలు, భారీ వర్షాలతో భూగర్భజలాలు పెరగడం, ఆయిల్‌పాం సాగుకు సరిపడ వాతావరణం, తేమ శాతం, ఉండడంతో జిల్లా రైతులు  సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రాలోని కోనసీమ ప్రాంతానికే పరిమితమైన  ఆయిల్‌పాం   వంటి వాటివైపు దృష్టిసారిస్తున్నారు. 


రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం

రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నదాతలకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం సాగుపై ఆసక్తిని పెంచారు.  ఆయిల్‌పాం సాగులో ఎకరానికి 57 మొక్కలు నాటు కోవచ్చు. మొక్కకు మొక్కకు మధ్య  9 మీటర్ల దూరం ఉండేవిధంగా చూసుకుంటారు. ఆయిల్‌పాం   పెట్టిన మూడేళ్లలోపు పంట చేతికి వస్తుంది. ఎకరానికి ఒక సంవత్సరానికి 12 నుంచి 14 టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ఒక టన్నుకు దాదాపు రూ .20 వేల వరకు ధర పలుకుతుంది. రైతులకు ఎకరానికి మొదటి సంవత్సరం రూ.26 వేలు, రెండు, మూడు సంవత్సరాల్లో రూ.5 వేల చొప్పున ప్రోత్సాహం  అందనుంది. దీంతోపాటు డ్రిప్‌ సిస్టమ్‌ కోసం ఓసీ, బీసీలకు 80 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీలు 90 శాతం రాయితీ పొందవచ్చు. పంట ఎదుగుదల కాలంలో అంతర పంట సాగు చేసుకునే వీలుంటుంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు మొక్కలను సరఫరా చేయనున్నారు. ఆయిల్‌పాం  కోతకు వచ్చే సమయానికి ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధమయ్యాయి. డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ను కూడా అందించనున్నారు. 


Updated Date - 2022-05-19T06:17:57+05:30 IST