లేదంటూనే.. విలీనానికి రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2021-09-13T04:28:08+05:30 IST

విలీనానికి..

లేదంటూనే.. విలీనానికి రంగం సిద్ధం!
ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయం

ఈపీడీసీఎల్‌ పేరుతో విద్యుత్‌ బిల్లుల జారీ

వినియోగదారుల్లో ఆందోళన


(చీపురుపల్లి): రెస్కో విలీనానికి రంగం సిద్ధమైందా? లేదు లేదంటూనే ప్రభుత్వం ప్రక్రియను పూర్తిచేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సెప్టెంబరు నెలకు సంబంధించి విద్యుత్‌ బిల్లులు ఏపీఈపీడీసీఎల్‌ పేరుతో జారీకావడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గత కొద్ది నెలలుగా విలీనంపై వార్తలు వెలువడ్డాయి. ప్రజల్లో కూడా అనుమానాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విలీనం జరగబోదని ప్రకటనలిస్తూ వస్తున్నారు. అటు విద్యుత్‌ శాఖ కూడా దీనిపై స్పష్టతనివ్వడం లేదు. ఈపీడీసీఎల్‌ సంస్థ మాత్రం తన పని తాను చేసుకొంటూ ముందుకు సాగుతోంది. సెప్టెంబరు నెలలో వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్‌ బిల్లులు ఏపీఈపీడీసీఎల్‌ పేరిట జారీచేస్తోంది. ఇది విలీన ప్రక్రియకు సంకేతమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


రెస్కోకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గ్రామీణ ప్రాంతాల విద్యుద్దీకరణ లక్ష్యంగా 1982లో రెస్కో సహకార సంస్థను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీపురుపల్లి, అనకాపల్లి, కుప్పాంలో రెస్కో కొనసాగుతోంది. చీపురుపల్లి రెస్కో సంస్థ చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలతో బాటు గుర్ల మండలంలోని రెండు పంచాయతీలకు సేవలందిస్తోంది. అన్ని కేటగిరీల్లో కొత్త కనెక్షన్లు మంజూరు, సరఫరాకు సంబంధించిన వినియోగదారుల సమస్యల పరిష్కారం దీని ప్రధాన బాధ్యత. పాలకవర్గం కూడా ఉండడంతో ప్రజల సమస్యల పరిష్కారం సులభంగా జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే సిఫారసు లేఖను ఆధారం చేసుకొని ఎలక్ర్టికల్‌ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్‌ ఏటా ఈ సంస్థకు లైసెన్సు మంజూరు చేయాల్సి ఉంది.


అయితే 2019-20 నుంచి రాష్ట్ర ప్రభుత్వం, సంస్థ రెన్యువల్‌కు అవసరమైన సిఫారసు లేఖను నిలిపివేసింది. లైసెన్స్‌కు అవసరమైన మొత్తాన్ని సంస్థ చెల్లించినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా ఈఆర్‌సీ నుంచి లైసెన్స్‌ రాలేదు. దీంతో సంస్థ మనుగడపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా నిరసన గళం వినిపించింది. సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. అటు అధికార పార్టీలో సైతం వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపించింది. కానీ ఏపీఈపీడీసీఎల్‌ పేరుతో విద్యుత్‌ బిల్లులు మంజూరు కావడంతో మరోసారి విలీనాంశం తెరపైకి వచ్చింది. 

Updated Date - 2021-09-13T04:28:08+05:30 IST