Abn logo
Mar 7 2021 @ 00:28AM

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

- 5.93 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

- 4.20 లక్షల టన్నుల ధాన్యం ఖరీదుకు ఏర్పాట్లు

- గ్రామాల్లో కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్‌ ఆదేశం

- 8 వ్యవసాయ మార్కెట్లలోనూ కొనుగోళ్లు

- ప్రతీ రైస్‌ మిల్లుకు ఒక ప్రత్యేక అధికారి  

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

యాసంగి వరిధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఈసారి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవచ్చని జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ అన్ని గ్రామాల్లోనూ గతంలో మాదిరిగానే కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. ఈ యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,55,153 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడి కూడా బాగానే రానుంది. 5.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, దీనిలో 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. గత యాసంగిలో జిల్లావ్యాప్తంగా 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈసారి గతంలో కంటే సుమారు 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు కేంద్రాలకు రానున్నందున కొనుగోలు చేసేందుకు సరిపడా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని  కలెక్టర్‌ శశాంక పౌరసరఫరాల, మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 8 వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనూ ధాన్యం కొనుగోలు చేయాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగిన సిబ్బందిని నియమించాలని,  వారి వద్ద కొనుగోళ్ల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ట్యాబ్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను కోరారు. రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలని, అన్ని కొనుగోలు కేంద్రాలకు సెంటర్‌ ఇన్‌చార్జిలను నియమించాలని  సూచించారు. ఏప్రిల్‌, మేలో సుమారు 40 రోజులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే అవకాశం ఉందని, ఒకేసారి తీసుకురాకుండా చూసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు తేదీలను కేటాయించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు రవాణా చేసేందుకు జిల్లాలో ఉన్న 1200 లారీలను వినియోగించుకోవాలన్నారు. లారీల ఇబ్బంది లేకుండా రవాణా ప్రణాళికను రూపొందించుకోవాలని, ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించాలని సూచించారు. ప్రతీ రైస్‌ మిల్లుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని,  కొనుగోళ్లు, తరలింపు వ్యవహారాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కోసం   అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, వ్యవసాయాధికారి శ్రీధర్‌, మార్కెటింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మావతి, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్‌, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్‌, రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించి కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చూసేందుకు వీలుగా ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. 

 మార్చి 20 లోగా సీఎంఆర్‌ బియ్యం ఇవ్వాలి

ఈ యాసంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో 2019-20 సంవత్సరం యాసంగిలో కొనుగోలు చేసి మిల్లులకు తరలించిన ధాన్యానికి సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను ఈ నెల 20లోగా చెల్లించాలని కలెక్టర్‌ శశాంక మిల్లర్లను ఆదేశించారు. రైస్‌ మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన కలెక్టర్‌  గత యాసంగికి సంబంధించి  మిల్లర్లు 3,13,154 మెట్రిక్‌ టన్నల బియ్యం చెల్లించాల్సి ఉండగా 2,97,833 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇచ్చారని, ఇంకా చెల్లించాల్సి ఉన్న 15,322 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మార్చి 20లోగా చెల్లించాలని ఆదేశించారు. 

Advertisement
Advertisement