Abn logo
Aug 6 2021 @ 01:00AM

రాబందుల విందుకు రంగం సిద్ధం!

ఎల్‌ఐసిలో త్వరలో ప్రకటించబోయే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) ద్వారా రాబందులకు విందు సిద్ధం కానున్నట్లు సంకేతాలు వస్తున్్నాయి. ఇదివరకు అనేక బ్యాంకుల్లోనూ, కోల్ ఇండియా వంటి దిగ్గజ కంపెనీల్లోనూ వాటాల విక్రయం జరిగినప్పుడు లేనంత హడావిడి ఇప్పుడు మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఎల్ఐసి దేశంలోని అత్యంత లాభదాయక కార్పోరేషన్ కావటం, నిరర్థక ఆస్తుల ఏర్పాటుకూ, వ్యవహారిక నష్టాలకూ అవకాశం లేని సురక్షితమైన సంస్థ కావటం. దివంగత ప్రధాని జవహర్‍లాల్ నెహ్రూ చట్టం ద్వారా ఐదు కోట్లిచ్చి నెలకొల్పిన ఈ సంస్థలో నేడు పది శాతం అమ్ముకుంటే ఒక్క ఐపిఒ ద్వారానే లక్ష కోట్లకు పైగా ఖజానా నిండుతుంది. ఆ తరువాత పబ్లిక్ ఆఫర్ ద్వారా కనీసం మరో పది లక్షల కోట్లను రాబట్టుకునే అవకాశముంది. అందువల్లనే ప్రభుత్వానికి ఇంత అత్యుత్సాహం. ఇక ఇరవై ఏళ్ళ కాలం వెచ్చించినా తమ ఉనికి నమోదు చేయలేకపోయాయి కాబట్టి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాగైనా ఎల్ఐసిని కంపెనీగా మార్చి స్టాకు మార్కెట్ ఆటలో తమకూ స్థానం దక్కేలా చూసుకోవచ్చని ఆరాటపడుతున్నాయి.


ఐఆర్‌డిఎ నిబంధనల ప్రకారం ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రారంభించడానికి వంద కోట్ల పెట్టుబడి కావాలి. సంస్థ కార్యకలాపాలు పెరిగేకొద్దీ సాల్వె‌న్సీ మార్జిన్ కొనసాగించేందుకు, చర వ్యయాలను ఎదుర్కొనేందుకు మూలధన సమీకరణ అవసరమవుతుంది. ఎల్ఐసి 2048 ప్రధాన శాఖలతో మరో మూడు వేల ఉప, శాటిలైట్ శాఖలతో పటిష్టమైన పునాది కలిగి ఉన్నది కాబట్టి మూలధనం అవసరం లేదు. ఏటా పోగవుతున్న మిగులు దృష్ట్యా, సాల్వెన్సీ మార్జిన్ సరిపోయిన దానికన్నా ఎక్కువగానే ఉన్నది. ఏ కంపెనీకైనా 1.5శాతం సాల్వెన్సీ మార్జిన్ కావాలి. కానీ ఎల్ఐసి 1.76శాతం కలిగి ఉన్నది. ఐ.పి.ఒ దృష్ట్యా – ఎల్ఐసి అధీకృత మూలధనం (ఆథరైజ్డ్‌ క్యాపిటల్) రూ.25వేల కోట్లు ఉండాలంటూ, వాటా ముఖ విలువ పది రూపాయలు ఉంటుందంటూ నిర్ధారణ అయినట్లు వార్తలు ప్రచారంలో పెట్టారు, అనగా 2500 కోట్ల వాటాలన్నమాట. ఎంత మొత్తానికి ఐ.పి.ఒ కి వెళ్ళేది ఆర్థిక శాఖ మంత్రి ఆధ్వర్యంలోని బృందం నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఎల్.ఐ.సి వాటా ప్రారంభ ప్రీమియం ధర రూ.450 నుంచి 600 వరకు ఉండవచ్చని కూడా సంకేతాలు స్పష్టంగా పంపిస్తున్నారు. ఎల్.ఐ.సి వాటా విలువ రమారమి రూ.500 అనుకున్నా, పది రూపాయల ముఖ విలువ గలిగిన 2500 కోట్ల వాటాలు రూ.12.5 లక్షల కోట్ల విలువ పలుకుతాయన్నమాట! ఎనిమిది శాతం మేరకు అమ్మినా లక్ష కోట్ల రూపాయలు వస్తాయి మరి! ఒకవైపు ఎల్.ఐ.సి ఎంబెడెడ్ వ్యాల్యూ (వాస్తవ విలువ)ను మదింపు చేసేందుకు మిల్లి మాన్ సెక్యూరిటీస్ అనే సంస్థను నియమించుకొని ఆ పని జరుగుతుండగానే మరోపక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ 25 వేల కోట్లు ఉండాలంటూ ముందే నిర్ణయించడం దేని ఆధారంగా జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఐ.పి.ఒ అంశంలో సవరించిన నిబంధనల ప్రకారం లక్ష కోట్ల విలువ కలిగిన సంస్థలో కనీసం ఐదు శాతం వాటాలు విక్రయించాలని ఉన్నది. గత బడ్జెట్టులో ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగిస్తూ 10శాతం వాటాలు విక్రయంచడం ద్వారా లక్ష కోట్లు ఎల్.ఐ.సి ఐ.పి.ఒ ద్వారా సాధించాలని అభి ప్రాయపడ్డారు. అనగా సంస్థ ఆస్తుల మదింపు జరగకముందే సరాసరి 8 నుంచి 10 శాతం వాటా విక్రయానికి లక్ష కోట్లు వస్తుందని అంచనా వేశారు! మూలధన మొత్తం, అమ్మవ లసిన శాతం, రాబట్టుకోబోయే రొక్కం బడ్జెట్టు పత్రాల్లోనే ప్రకటించినప్పుడు మరి ఎంబెడెడ్ విలువ నిర్ధారించటం, దాని కోసం ఒక సంస్థను ఎన్నుకునే ప్రక్రియకు సలహాదారులుగా డెల్లాయిట్, ఎస్.బి.సి క్యాప్స్‌ని నియమించుకోవడం ఇవన్నీ శంఖంలో పోయటం కోసమేనా? అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో హెయిర్ కట్టింగ్, ఆర్బిట్రేటర్ రెసొల్యుషన్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్‍ల రూపంలో తగ్గించబడుతున్న నిరర్థక ఆస్తుల్లో బయట పడుతున్న క్రోనీ క్యాపిటలిజం కళ్ళకు కట్టిన సత్యం. వాటాదారులకు ఓ పది శాతం వాటాలు కేటాయిస్తారనీ, ఉద్యోగులకు డిస్కౌంట్ ఇస్తారని వార్త వెలువడింది. ఇది మెహర్బానీ అవుతుందా? మార్కెట్ రేటుకే అర్హత కలిగిన వారికి వాటాలు కేటాయించవచ్చు. సాంకేతికంగా చూస్తే ఈ మొత్తం వాటాలు పాలసీదారులకు చెందినవే, ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ పాలసీదారుల సొమ్ముతో చేకూరినవే. గుడ్‌విల్ మాత్రం ప్రభుత్వ గైడెన్స్‌లో ఉద్యోగులు నిలబెట్టిన గొప్పతనమే. 


ఎల్.ఐ.సి కార్పొరేషన్‌ను కంపెనీగా మార్చేందుకు, స్టాఫ్ రెగ్యులేషన్స్‌‍ను స్టాఫ్ రూల్స్‌‍గా పిలిచేందుకు, చైర్మన్‌ను ఇక నుంచి చీఫ్ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్ (సీఈవో)గా పిలిచేందుకు కావలసిన మార్పులు చేర్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్లను విడుదల చేసింది. ఈ పేర్ల మార్పు వలన జరిగేదేమంటే సంస్థ కార్యకలాపాలన్నీ ఇక కంపెనీల చట్టం ప్రకారం జరుగుతాయి. ఎల్.ఐ.సి పనితీరులోనూ, అందిస్తున్న సేవల్లోనూ ఏమాత్రం తేడా ఉండదు. రాబోయే తేడా మొత్తం సంస్థ ఆర్జించే లాభాలకు లేదా మిగులు పంపిణీకి సంబంధించినదే. సేవా దృక్పథం నుంచి లాభాపేక్ష పైపు విధానాలు మారతాయి. లాభాపేక్షే ప్రధానమైనప్పుడు గ్రామీణ ప్రదేశాలు, తక్కువ లాభార్జన కలిగిన ప్రదేశాల నుంచి ఎల్.ఐ.సి ఆఫీసులు నిష్క్రమించే ప్రమాదం ఉన్నది. సేవా ధృక్పథంతో నడుస్తూ అత్యధిక లాభాలార్జిస్తున్న సంస్థ దేశంలో ఎల్‍ఐసి మాత్రమే. ఎల్.ఐ.సి.లో రెండు రకాల పాలసీలుంటాయి. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, దీనికి సంస్థ లాభాలతో సంబంధం ఉండదు. విపత్తు జరిగినప్పుడు హామీ మొత్తం చెల్లిస్తారు. రెండవది కన్వెన్షనల్ లేదా ఎండోమెంట్ పాలసీలు. వీటిపై ఏటా బోనస్ ప్రకటిస్తారు. అయితే ఐ.పి.ఒ అనంతరం వాటాదారులకు లాభాలు పెంచేందుకు వీటిని విడివిడిగా లెక్కించే అవకాశముంది. ఐ.పి.ఒ ద్వారా కొంత శాతం వాటాలను అమ్మినప్పటికీ మెజారిటీ వాటాలు దగ్గరే ఉంచుకుంటానని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అది ఆ మాటపై నిలబడినంతకాలం సంస్థ కార్యకలాపాలపై ప్రైవేటు భాగస్వామ్య ప్రభావం తక్కువే ఉంటుంది. కానీ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీని పూర్తిగా ప్రైవేటీకరించాలన్న ఉద్దేశం బయటపడ్డాక ప్రభుత్వం మాటపై మరింత నమ్మకం పోయింది. ఎల్.ఐ.సి మనుగడలో అత్యంత ప్రధాన భూమిక పోషిస్తోంది ఏజెంట్లు. ఒత్తిడిలేని, స్వతంత్ర, శాశ్వత ఆదాయ మార్గంగా ఎల్.ఐ.సి ఏజెన్సీ వృత్తి ఉన్నది కాబట్టి ఏజెంట్లు తమ వృత్తిని కొనసాగించగలుగుతున్నారు. ప్రైవేటు కంపెనీల ఆగమనం తర్వాత ఎల్.ఐ.సి ఏజెంట్ల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ గత సంవత్సరం నుంచి మళ్లీ మెరుగవుతూ 13లక్షల 50వేలకు చేరింది. అదే ప్రైవేటు సంస్థలు నియమించిన ఏజెంట్లలో శాశ్వత కొనసాగింపు చాలా తక్కువ. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనూ ఎల్.ఐ.సి ఒక అడుగు ముందుకేసి త్వరిత ప్రాతిపదికన సర్వీస్ అందించే సంస్థల్లో అగ్రగామిగా ఉన్నది కాబట్టే ఆ ఘనత ఇప్పటికిప్పుడే కరిగిపోయేది కాదు.


స్టాఫ్ ‘రెగ్యులేషన్స్’ అంటే ఇరువర్గాలను బాధ్యులను చేసే నియమ నిబంధనలు. స్టాఫ్ ‘రూల్స్’ అంటే కేవలం ఉద్యోగులకు వర్తించే నియమ నిబంధనలు అని అర్థం. అంటే ఇక నుంచి యజమానికి ఎలాంటి బాధ్యత ఉండకపోగా ఫలానా రూల్ కింద ఫలానా ఉద్యోగిపై చర్య తీసుకునేందుకు మార్గం సుగమం అవుతుందన్నమాట. లాభం పెరగాలంటే దాని సృష్టికి కారకులయ్యే వర్కర్లపై కొరడా ఝుళిపించే అధికారాలు యజమానికి ఉండాలి! కార్పోరేషన్లు అయితే ప్రభుత్వ గైడెన్సులో సహకార పద్ధతిలో పని చేస్తాయి, కంపెనీలు ప్రభుత్వం ఖరారు చేసిన చట్టంలోని నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. బడా పెట్టుబడిదారులు, ఇన్సూరెన్సు రంగంలో ఉన్న పోటీదారులు కోరుకున్నట్లుగానే ప్రభుత్వం ప్రభుత్వరంగాలపై తమ బాధ్యతను వదులుకోవడమే ఈ రకమైన చర్యలన్నింటి వెనక అర్థం. 


ఎల్.ఐ.సి పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుందనేది ఒక వాదన. అవును మరి నేడున్న స్టాక్ మార్కెట్‌కు ప్రస్తుతం మరో లక్ష కోట్లు, రాబోయే మూడేళ్ళలో మరో ఐదులక్షలకోట్లను చేరుస్తూ ఒక కంపెనీ తన వాటాలను మార్కెట్లో ఉంచితే క్యాపిటలైజేషన్ బాగా ఏర్పడినట్లేగా. ఇంటి పొదుపును స్టాక్ మార్కెట్లోకి లాగాలన్నది ప్రధాన అజెండాగా మార్కెట్ ఎకానమిస్టులు బోధిస్తుంటారు. దీని అర్థమేమంటే ప్రతి పౌరుడూ తన తిండి గింజలు కొనుక్కున్న తరువాత తక్కిన సంపాదన అంతా స్టాక్ మార్కెట్లో దాచుకోవాలి. అలా దాచుకోబడిన సొమ్మును కంపెనీలు ట్రాన్స్‌పరెన్సీ–అభివృద్ధి అనే సాకును అడ్డం పెట్టుకుని స్వాహా చేస్తూ ఉంటాయి. కరోనా వంటి ఏ విపత్తుకో స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది, అప్పుడు ఆసుపత్రి ఖర్చుల కోసం వాటాల మ్ముకున్న వాళ్ళకి ఆశల కన్నీరు ఎదురొస్తుంది. ఆపత్కాలంలో కామధేనువుల్లా సాయపడే ప్రభుత్వరంగాలను విస్మరించడం సరికాదు.

జి. తిరుపతయ్య

ప్రత్యేకంమరిన్ని...