విద్యా రంగంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలి
కలెక్టర్ నిశాంత్‌కుమార్
పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, జూలై 2 : విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలను పూర్తిస్థాయిల సిద్ధం చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు. విద్యా రంగంలో జిల్లా ప్రఽథమ స్థానంలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్న దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూళ్ల పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రత, మధ్యాహ్న భోజన నిర్వహణ, తరగతి గదులు, సామగ్రిలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్కారీ బడులు ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని సూచించారు. విద్యార్థులు సంతోషంగా పాఠశాలలకు వచ్చి వెళ్లాలని అన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వారిని సత్కరించాలని తెలిపారు. చిన్నారులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ మంచి ప్రేరణ కల్పించాలని కోరారు. నాడు-నేడు పనులను వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. ఆయా పనులకు సంబంధించి ఇసుక, సిమెంటు, ఇతర సామగ్రికి ఇండెంట్‌ను ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీ వరహాలును ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీఈవో బ్రహ్మాజీరావు, ఎస్ఈ శాంతేశ్వరరావు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు విజయ్‌కుమార్, ప్రభాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.