Abn logo
Jun 16 2021 @ 23:08PM

హరితహారానికి మొక్కలు సిద్ధం

- ఈ ఏడాది లక్ష్యం 52.68లక్షల మొక్కలు

- 335నర్సరీల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ మొక్కల పెంపకం

- శాఖలవారీగా లక్ష్యాలు నిర్ణయం

- ఐటీడీఏ, సింగరేణి మొక్కలు వీటికి అదనం

- ఇప్పటికే పూర్తైన శాఖల సమన్వయ సమావేశాలు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 23శాతం అటవీ ప్రాంతాన్ని 30శాతానికి పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 6ఏళ్ల క్రితం ప్రారంభించిన హరితహారం కార్యక్రమానికి జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో కోటి మొక్కలు పెంచిన జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికకు తగ్గట్లుగానే మొక్కలు నాటుతూ వచ్చింది. ఈ క్రమంలో యేయేటికాయేడు లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం జిల్లాలో ఈసారి 52.68లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో శాఖల వారిగా విభజించి  ల క్ష్యాలను నిర్ణయించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా నర్సరీలు, మొక్కల పెంపకంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధదే ముఖ్య భూమిక. ఆ తర్వాత ద్వితీయ స్థానంలో అటవీశాఖ పెద్దఎత్తున అటవీజాతి మొక్కలను పెంచు తోంది. రాబోయే వారం పది రోజుల్లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తున్నట్టు అధికారులు విల్లడించారు. అటవీశాఖ నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు అదనంగా సహజ సిద్ధమైన పద్ధతుల్లో విత్తనాలు మొలకెత్తేలా సీడ్‌బాల్‌ పద్ధతిని అనుసరించి గుట్టలు, కొండలపై మొక్కల పెంపకానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతోపాటు వర్షాకాలం ప్రారంభమైనందున సహజ సిద్ధంగా కూడా వివిధజాతుల మొక్కలు మొలుస్తు న్నందున వాటి రక్షణగా పశువులు అడవుల్లోకి ప్రవే శించకుండా ఇప్పటికే కందకాల తవకాలు వంటి పనులను పూర్తిచేశారు. ఇకపోతే సింగరేణి యాజమాన్యం కూడా తమ సామాజక బాధ్యతలో భాగంగా ప్రతీఏటా సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే కలప, ఫలాలు, పూల జాతి మొక్కలను పంపిణీ చేస్తోంది. అయితే సింగరేణి పంపిణీ చేసే మొక్కల పరిమాణం డిమాండ్‌ను బట్టి మారుతూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థ ద్వారా ఎక్కువగా మామిడి, సపోట, జామ, కొబ్బరి, టేకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. అలాగే మూతబడిన ఓపెన్‌ కాస్టుల మట్టిదిబ్బలపై కూడా సుబాబుల్‌, యూకలిప్టస్‌ వంటి మొక్కలతోపాటు వివిధరకాల మొక్కల జాతులను నాటనున్నారు. ఇక గిరిజనాభివృద్థి సంస్థ ఆద్వర్యంలోనూ మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాంప్రదాయం ప్రకారం వానాకాలం సీజన్‌ ప్రారంభం కాగానే వర్షాపాతానికి అనుగుణంగా జూన్‌ రెండు లేదా మూడో వారంలో ప్రారంభించాలి. కానీ ఈసారి ముఖ్యమంతి కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో ప్రభుత్వ ఆదేశాలు అందగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభి స్తామని గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. 

 ఇవీ శాఖలవారి లక్ష్యాలు..

2021-22ఆర్థిక సంవత్సరానికి గాను హరితహారం కింద జిల్లాలో ఈఏడాది 52.68లక్షల మొక్కలని నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా గ్రామానికి ఒకటి చొప్పున మొత్తం 335నర్సరీలలో మొత్తం 54.97లక్షల మొక్కలను పెంచుతూండగా 34లక్షల మొక్కలను నాటాలని సంకల్పించారు. అలాగే జిల్లా అటవీశాఖ ద్వారా మొత్తం 18లక్షల 59వేల మొక్కలను పెంచు తూండగా 10లక్షల 38వేల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయశాఖ 50వేలు మొక్కలు, ఎక్సైజ్‌ 30వేల మొక్కలు, సింగరేణి 2 లక్షలు, ఉద్యానవన శాఖ 20వేలు, పోలీస్‌ 10వేలు, మున్సిపాలిటీల్లో 3.7లక్షలు, నీటి పారుదలశాఖ 20 వేలు, రెవెన్యూ 10వేలు, మత్స్యశాఖ 5వేలు, పశు సంవర్ధక శాఖ 5వేలు, జిల్లా విద్యాశాఖ 40వేలు, మాధ్యమిక విద్యాశాఖ 5వేలు, ఆర్‌అండ్‌బి 5వేలు, పంచాయతీరాజ్‌ 5వేలు, వైద్యఆరోగ్యశాఖ 5వేలు, పౌర సరఫరాల శాఖ ఒక వెయ్యి, జిల్లా సహకార శాఖ మూడు వేలు, విద్యుత్‌శాఖ  4300, ఉపాధి కల్పన శాఖ 100మొక్కలు, తూనికలు, కొలతల శాఖ100 మొక్కలు, జిల్లా క్రీడలు, విభజన సర్వీసుల విభాగం 200, జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ 500మొక్కలు, మైన్స్‌1500మొక్కలు, పరిశ్రమలు 5వేలు, దేవాదాయ ఒక వె య్యి, సాంఘిక సంక్షేమశాఖ మూడు వేలు, ఐటీడీఏ 5వేలు, బీసీ సంక్షేమశాఖ రెండు వేలు, మైనారిటీ సంక్షేమం రెండు వేలు, మార్కెటింగ్‌ ఒక వెయ్యి, ఆర్‌డబ్ల్యూఎస్‌ 2500మొక్కలు, ఆర్టీసి 5వేలు, ఇతరులు 5వేల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యాలని నిర్ణయించారు.