హనుమ జన్మస్థలంపై రేపే చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2021-05-14T09:07:05+05:30 IST

హనుమంతుడి జన్మస్థల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమంటూ గత నెలలో టీటీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటకలోని కిష్కిం

హనుమ జన్మస్థలంపై రేపే చర్చకు సిద్ధం

టీటీడీకి కిష్కింధ ట్రస్టు మరో లేఖ 

తిరుమల, మే 13(ఆంధ్రజ్యోతి): హనుమంతుడి జన్మస్థల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమంటూ గత నెలలో టీటీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపక ధర్మకర్త గోవిందానంద సరస్వతి స్వామి స్పందిస్తూ గతనెల 30న టీటీడీకి ఓ లేఖ పంపారు. హనుమజన్మస్థలంపై టీటీడీ సమర్పించిన నివేదిక పూర్తిగా అవాస్తవమని, పురాణ ఇతిహాసాలను తమ స్వార్థానికి వాడుకుంటూ అసత్యాలను సత్యాలుగా చిత్రీకరిస్తున్న టీటీడీ అధికారుల శ్రమను చూస్తే జాలివేస్తోందంటూ మండిపడ్డారు. ఈ లేఖపై టీటీడీ కూడా స్పందించింది. టీటీడీ కౌంటర్‌పై గోవిందానంద సరస్వతి స్వామి తాజాగా బుధవారం మరో లేఖను టీటీడీకి పంపారు. అందులో.. ‘చర్చకు 10, 20 రోజులు ఎందుకు? మేము రేపే సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమేనా? మీ లేఖలో మా ప్రశ్నలు ఏంటని అడుగుతున్నారు. మీరు చేసిన 4నెలల పరిశోధనపైనే మీకు నమ్మకం లేదు. 


ఒకవేళ ఉంటే ఇలా ప్రశ్నల గురించి అడగరు. అనేక రకాలుగా పురాణ, ఇతిహాస, వైజ్ఞానికాలు వడపోసి తయారు చేసిన మీ పనిపై మీకు నమ్మకం లేదా? ఈ విషయంపై ఎవరు, ఎప్పుడైనా, ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పే ధైర్యం, విషయం మీ దగ్గర లేదా? మా ప్రశ్నలన్నీ సభలోనే ఉంటాయి. లేదంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని ఒప్పుకోండి. అసలు మాకు లేఖ రావాల్సింది మీనుంచి(ఎస్వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారిని ఉద్దేశించి)కాదు. ఈవో, చైర్మన్‌, కమిటీ సభ్యుల లెటర్‌ ప్యాడ్‌ నుంచి. వారు తమను తాము రక్షించుకునేందుకు తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. దీనికి తాము బాఽధ్యులం కాదని చెప్పుకుంటారు. ఈ పనిని వారికిస్తే చేశారని, వారిచ్చిన నివేదికను మాత్రమే మేం చదివామంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తప్పిదానికి కారణం ఒకరిపై ఒకరు వేసుకుంటారు. ఇకపై లేఖలతో సమయం వ్యర్థం చేయకండి. మీ విలువలపై మీకు నమ్మకం ఉంటే చర్చ సభ తేదీ ప్రకటించండి. సమయం తేదీ మీరు చెప్తారా, మమల్ని చెప్పమంటారా.. నిర్ణయించుకుని తేదీ ప్రకటించండి చాలు’ అంటూ గోవిందానంద ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-14T09:07:05+05:30 IST