టెన్త్‌ పరీక్షలకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-16T05:01:13+05:30 IST

టెన్త్‌ పరీక్షలకు సన్నద్ధం

టెన్త్‌ పరీక్షలకు సన్నద్ధం

  • ఈ నెల 23వ తేదీ నుంచి పరీక్షలు
  • మేడ్చల్‌ జిల్లాలో 252 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
  • హాజరవనున్న 43,253 మంది విద్యార్థులు
  • 70శాతం సిలబ్‌సలోనే ప్రశ్నాపత్రం
  • ఈ సారి నుంచి సబ్జెక్టులకు సింగిల్‌ పేపర్‌

మేడ్చల్‌, మే 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వాహణకు విద్యాశాఖ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరంలో అన్ని తరగతుల పరీక్షలను సంపూర్ణంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే టెన్త్‌ బోర్డు ఎగ్జామ్స్‌ను కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్త ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులను చేసింది. ఆ విద్యా సంవత్సరాల్లో విద్యార్థులకు తరగతులు కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. కానీ ఈ విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహణ ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌లో నిర్వహించారు. ఆగస్టు నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించారు. సెలవు దినాల్లో టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులూ నిర్వహించారు. ఇంటర్నల్‌, ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌-1 అసెస్మెంట్లు కూడా పూర్తిస్థాయిల్లో నిర్వహించారు. విద్యా సంవత్సరం మధ్యమధ్యలో కరోనా వేవ్‌ కొనసాగడంతో విద్యార్థులకు సిలబ్‌సను కూడా 70శాతానికి తగ్గించారు. మే 23 నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు నిర్ధారిత 70శాతం సిలబస్‌ నుంచి మాతమ్రే ప్రశ్నలు ఇవ్వనున్నారు. గతంలో టెన్త్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కు రెండు పేపర్ల చొప్పున రెండు రోజులు పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఒక సబ్జెక్ట్‌కు ఒకే పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థులకు ఊరట అంశం. మార్కులను కూడా తదనుగుణంగా కేటాయించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు 252 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్‌ విద్యార్థులకు 251 కేంద్రాలు కాగా, ఒక ఎగ్జామ్‌ సెంటర్‌ను ప్రైవేట్‌ విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు.


  • పరీక్ష రాయనున్న 43,253 మంది విద్యార్థులు

మేడ్చల్‌ జిల్లాలో 43,253 మంది పదో తరగతి రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 104 జిల్లా పరిషత్‌ పాఠశాలలకు చెందిన టెన్త్‌ విద్యార్థులు 7,216 మంది, 868 ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు 34,271 మంది, నాలుగు ఎయిడెడ్‌ పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు, బీసీ వెల్ఫేర్‌ ఐదు పాఠశాల విద్యార్థులు 385 మంది, ఐదు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 224 మంది, గురుకుల పాఠశాల నుంచి 83 మంది, ఐదు సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల విద్యార్థులు 481 మంది, 8 టీఆర్‌ఎంఎస్‌  స్కూళ్ల నుంచి 460 మంది, గిరిజన పాఠశాల నుంచి 116 మంది విద్యార్థుల చొప్పున పబ్లిక్‌ పరీక్షలు రాస్తారు.


  • ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక తరగతులు.. నిరంతర పర్యవేక్షణ

ఒంటిపూట బడి ముగిసిన వెంటనే టెన్త్‌ విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లలలో రోజూ రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులను నిర్వహించారు. పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు టీచర్లు నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ సందేహ నివృత్తి, స్టడీ అవర్లు నిర్వహించారు. అలాగే చాలాచోట్ల విద్యార్థులకు ఎగ్జామ్స్‌ కోసం తయారు చేసిన మెటీరియల్‌ను సైతం అందజేశారు. స్లిప్‌ టెస్ట్‌లు, వారాంతాల్లో ఆల్‌ సబ్జెక్ట్స్‌ టెస్ట్‌లు నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధ వహించారు. విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని దాతలతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌, స్టేషనరీ ఇప్పించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయాల్లోనూ స్నాక్స్‌, టిఫన్‌ వంటి సౌకర్యాలను సైతం కల్పించారు. పరీక్షలకు పూర్త సన్నద్ధతలో భాగంగా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సిబ్బంది నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండి సేవలందించారు. జిల్లాలో చాలా స్కూళ్లకు యునైటెడ్‌ అఫ్‌ హైదరాబాద్‌ అనే సంస్థ రూ.10లక్షలతో విద్యార్థులకు ప్రిపరేషన్‌ మెటిరియల్‌ను అందజేసింది.


  • విద్యార్థులను ప్రిపేర్‌ చేశాం : విజయకుమారి, డీఈవో, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల గడువు దగ్గర పడింది. ప్రభుత్వం ఈ సారి సిలబ్‌సలోని 70శాతం పోర్షన్‌ నుంచి మాత్రమే ప్రశ్నాపత్రం రూపొందిస్తోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిర్ధారిత సిలబ్‌సను మాత్రమే విద్యార్థులు చదువుతున్నారు. నాలుగైదు నెలలుగా పరీక్షల కోసం విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశాం. ప్రిపరేషన్‌ పుస్తకాలను కూడా అందజేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించాం. విద్యార్థులు సైతం పూర్తి ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. మేం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం.

Updated Date - 2022-05-16T05:01:13+05:30 IST