కొనుగోళ్లకు సిద్ధం

ABN , First Publish Date - 2021-10-18T06:13:17+05:30 IST

వానాకాలం సాగుదిగుబడి మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే కోతులు మొదలై వచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే నిల్వ చేస్తున్నారు.

కొనుగోళ్లకు సిద్ధం

- ప్రభుత్వ మార్గదర్శకాలతో ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

- నేటినుంచే ప్రారంభించడానికి ఏర్పాట్లు

- జిల్లాలో వానాకాలం సాగులో 1.73 లక్షల ఎకరాల్లో వరి

- 3.78 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

- రైతుల్లో వీడిన కొనుగోలు సందిగ్ధం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వానాకాలం సాగుదిగుబడి మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే కోతులు మొదలై వచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే నిల్వ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటనలతో రైతులు ఆయోమయంలో పడ్డారు. రాష్ట్ర పభుత్వం తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని మార్గదర్శకాలు జారీ చేయడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. సోమవారం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కేంద్రాల ప్రారంభోత్సవం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడం కాళేశ్వరం జలాలతో ముందస్తుగానే చెరువులు, ప్రాజెక్టులు నింపుకోవడం దానికి తోడుగా భారీ వర్షాలతో సాగునీటికి ఇబ్బంది లేకుండా వానాకాలం సాగు జోరుగా సాగింది. రైతులు వరిసాగుపైనే ప్రత్యేక దృష్టిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడంతో మొదట ఆందోళన చెందినా, తర్వాత రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన భరోసాతో దానికి అనుగుణంగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. యాసంగిలో మాత్రం వరిసాగు తగ్గించుకునే దిశగా పంట మార్పిడిపై సదస్సులు నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించారు. 

- 1.73 లక్షల ఎకరాల్లో వరి సాగు.. 

జిల్లాలో ప్రస్తుత వానాకాలం సాగు 2.48 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 1.73 లక్షల ఎకరాలు, పత్తి 62,959 ఎకరాలు, మొక్కజొన్న 2,501 ఎకరాలు, కందులు 4,975 ఎకరాలు, ఇతర పంటలు 613 ఎకరాలు, ఉద్యాన పంటలు 4,422 ఎకరాలు సాగు చేశారు. వరిసాగు ద్వారా జిల్లాలో 3లక్షల 78వేల 696 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగతా 28,696 మెట్రిక్‌ టన్నులు మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తారని అంచనాలు వేశారు. నవంబరు మొదటి వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని భావించినా ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే కొనుగోళ్లు చేపడుతున్నారు. 2019-2020లో వానాకాలం సీజన్‌లో 36,584 మంది రైతుల నుంచి రూ 332.12 కోట్ల విలువైన 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా రబీలో 50,574 మంది రైతుల నుంచి రూ 450.22 కోట్ల విలువైన ధాన్యం 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 2020-21లో ఖరీఫ్‌లో 53,862 మంది రైతుల నుంచి రూ 333.33 కోట్ల విలువైన 1.76 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రబీలో 60,471 మంది రైతుల నుంచి రూ 682. 32 కోట్ల విలువైన 3.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం 2021-22 సంవత్సరానికి ఖరీఫ్‌లో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమయ్యారు. 

- 236 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో కొవిడ్‌ సమయంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతీ గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన జిల్లాలో అన్ని గ్రామాల్లో కొనుగోళ్లు చేసేవిధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. వీటితో పాటు అదనంగా మరో 20 కేంద్రాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐకేపీ ద్వారా 58 కేంద్రాలు, సింగిల్‌ విండో ద్వారా 162 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా ఏడు కేంద్రాలు, ఏఎంసీ ద్వారా ఏడు కేంద్రాలు, మెప్మా ద్వారా రెండు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 75 రైసుమిల్లులు ఉన్నాయి. వీటికి ధాన్యాన్ని కేటాయించనున్నారు. కొనుగోలుకు సంబంఽధించిన గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, ఇన్నోవింగ్‌ మిషన్‌లు, పాడీ క్లీనర్‌లు వంటి పరికరాలను సిద్ధం చేశారు. 

-  పెరిగిన వరి సాగు

జిల్లాలో గతంలో కంటే దాదాపు 30 ఎకరాల్లో వరిసాగు పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,73,450 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇందులో ఇల్లంతకుంట మండలంలో 22127.18 ఎకరాలు, సిరిసిల్లలో 3576.27 ఎకరాలు, తంగళ్లపల్లిలో 20324.03 ఎకరాలు, బోయిన్‌పల్లిలో 12345.03 ఎకరాలు, చందుర్తిలో 12435.34 ఎకరాలు, కోనరావుపేటలో 16099.20 ఎకరాలు, రుద్రంగిలో 4462.30 ఎకరాలు, వేములవాడలో 4165.12 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 10290.35 ఎకరాలు, గంభీరావుపేటలో 19784.14 ఎకరాలు, ముస్తాబాద్‌లో 24213,30 ఎకరాలు, వీర్నపల్లిలో 6589.25 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 17034.29 ఎకరాల్లో సాగుచేశారు. 


Updated Date - 2021-10-18T06:13:17+05:30 IST