సాగుకు సన్నద్ధమిలా...

ABN , First Publish Date - 2021-06-25T06:13:10+05:30 IST

వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగం నష్టాల్లో కూరుకుపోతుంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్పడంతో కోటి ఆశలతో రైతులు తిరిగి సాగుకు సిద్ధమవుతున్నారు.

సాగుకు సన్నద్ధమిలా...
వేసవి దుక్కులు చేపడుతున్న రైతు (ఫైల్‌ఫొటో)

విత్తన రకాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి

అదునులోగా విత్తుకుంటే అధిక దిగుబడులు సాధ్యం


పరవాడ, జూన్‌ 24: వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగం నష్టాల్లో కూరుకుపోతుంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్పడంతో కోటి ఆశలతో రైతులు తిరిగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే విత్తన రకాల ఎంపికే కీలకం. మేలు రకాలను ఎంపిక చేసుకుని విత్తుకోవడానికి భూమిని దున్ని సిద్ధం చేసుకోవాలి. వ్యవసాయాధికారుల సూచనలు, శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ పంట సాగు చేయాలి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పంట సాగుకు ముందు చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలిద్దాం.  

నియోజకవర్గంలోని పరవాడ, పెందుర్తి, సబ్బవరం మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ సుమారు 3200 హెక్టార్లలో వరి పంట వేసేందుకు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతుల గురించి అధికారులు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటల సాగు చేస్తే అనుకున్న దిగుబడి వస్తుందని అంటున్నారు. 

విత్తనాల ఎంపిక

పంటల సాగులో ప్రధానమైనది విత్తనం. నియోజకవర్గంలో అధికంగా సాగయ్యేది వరి. ఈ పంటకు చెందిన విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా కొనుగోలు చేసుకున్నప్పటికీ సకాలంలో విత్తనాలు అందుబాటులో రాకపోవడం, బయోమెట్రిక్‌ విధానం అమలు కావడం, రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. నేలకు అనుకూలమైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని విత్తుకోవాలి. కొంత మంది వ్యాపారులు నకిలీ విత్తనాల అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం అమోదిత కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. 

వేసవి దుక్కులతో ప్రయోజనం

విత్తుకోవడానికి ముందు భూమిని సిద్ధం చేసుకోవాలి. గత సీజన్లో వేసిన పంట తీసేసి, భూమిని 25-30 సెంటీ మీటర్ల లోతు  వరకు దున్నాలి. ఇది ఇప్పుడే పూర్తి చేసుకుంటే మేలు. వేసవి దుక్కుల వల్ల నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి.నేల కోతను అరికట్టవచ్చు. కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. పంటలపై చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడానికి వీలుంది. దీని వల్ల నేలలో పోషక విలువలు పెరుగుతాయి. లోతుగా దున్నినప్పుడు పొరలు విచ్ఛినమై నేల గుల్లగా తయారుకావడమే గాక నేలలో గాలి శాతం,నీటిని పీల్చుకునే లక్షణాన్ని పెంపొందిస్తుంది. వేసవి దుక్కిలో బాగా లోతుగా, వాలుకు అడ్డంగా దున్నుకోవడంతో వర్షపు నీరు లోపలి పొరల్లోకి చేరుతుంది.

భూసార పరీక్షలు తప్పనిసరి

పంట సాగు కంటే ముందుగానే భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాల ఆధారంగా ఎరువులు వేయాలి. ఫలితంగా ఖర్చు తగ్గించుకోవచ్చు. రెండేళ్లలో ప్రతీ రైతుకు భూసార ఫలితాలు అందించాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. భూసార పరీక్షలను ప్రయోగాత్మకంగా మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఫలితాల కోసం పంపించారు. 

వర్షపు నీటిని ఒడిసిపట్టాలి

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి. పంట చేలల్లో వర్షపు నీరు ఇంకించుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. చేనులోని వాలుకు అడ్డంగా ప్రతి వంద మీటర్లకు ఒక మీటరు లోతు, అరమీటరు వెడల్పు గల సమతల కందకాలను తవ్వుకోవాలి. దీని వల్ల చేనులో కురిసిన వర్షపు నీరంతా చేనులోని భూగర్భంలోకి ఇంకుతాయి. 


ప్రణాళిక సిద్ధం

ఖరీఫ్‌ సీజన్‌లో ప్రధానంగా వరి పంట అధికంగా సాగు చేసే అవకాశం ఉంది. రైతుల అవసరాలకు సరిపడిన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇప్పటికే విత్తనాలు ఆర్‌బీకే కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాం. అవసరం మేరకు మరిన్ని విత్తనాలు తేనున్నాం. అదును చూసి విత్తనాలు విత్తుకోవాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడులు వస్తాయి. 

- సీహెచ్‌ చంద్రావతి, వ్యవసాయాధికారిణి, పరవాడ


Updated Date - 2021-06-25T06:13:10+05:30 IST