కొవిడ్‌ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2020-09-25T06:01:48+05:30 IST

కొవిడ్‌ నియంత్రణకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన 7వేల కోట్లలో జిల్లాకు ఎన్నికోట్లు తెచ్చారు..

కొవిడ్‌ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం

బీజేపీ నేతల సవాల్‌కు మేయర్‌ సునీల్‌రావు ప్రతిసవాల్‌ 


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 24: కొవిడ్‌ నియంత్రణకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన 7వేల కోట్లలో జిల్లాకు ఎన్నికోట్లు తెచ్చారు.. అలాగే ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఎన్ని నిధులు తీసుకువచ్చారు.. ఏం అభివృద్ధి పనులు చేశారనే దానిపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమేనని నగర మేయర్‌ వై.సునీల్‌రావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు సవాల్‌ను స్వాగతిస్తూ ప్రతి సవాల్‌ చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలచే కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలువని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు కేంద్రమంత్రి రాష్ట్రానికి రూ.290.29 కోట్లు ఇచ్చారని ప్రకటిస్తే మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఏడు వేల కోట్లు ఇచ్చారని చేసిన ఆరోప ణలపై చర్చకు రావాలని పిలిస్తే వివిధ పద్దుల కింద 7వేల పైచిలుకు నిధులు ఇచ్చారంటూ మాట్లాడటం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఖండించారు. ప్రజలను అబద్దాల మాటలతో మోసం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకుల అబద్దాల మాటలు, మోసపూరిత వాఖ్యలను ప్రజలు ఇప్పటికే గుర్తించారని అన్నారు.


కరీంనగర్‌లో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి లేక ఇబ్బందులు పడుతుంటే కనీసం దాన్ని మంజూరుకు అతిగతీ లేదని ఆరోపించారు. నగరపాలక సంస్థ ప్రస్తుత పాలక వర్గం కొలువుతీరిన తర్వాత ఆరునెలల్లో మంత్రి గంగుల కమలాకర్‌ నాయ కత్వంలో, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ సహకారంతో 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నామని చెప్పారు. స్మార్ట్‌సిటీ పనుల్లో వేగం పెంచి, రెండవ దశ పనులకోసం డీపీఆర్‌ పూర్తిచేసి టెండర్లు కూడా పూర్తిచేశామని చెప్పారు. ఇంటింటికీ మొక్కల పంపిణీ, పార్కులు, ఓపెన్‌ జిమ్స్‌, వాకింగ్‌ ట్రాక్స్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 14 కోట్లతో ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌ ప్రా రంభించబో తున్నామని, ఇవన్నీ అభివృద్ధి పనులు కావా అని ప్రశ్నించారు. పట్టణ ప్రగతిలో రూ.30 లక్షల కుంభకోణం జరిగినట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, తప్పుడు నెంబర్లతో రికార్డులను తయారు చేసిన 7.75 లక్షల బిల్లులను నిలిపి వేశామని చెప్పారు. ఆస్తిపన్ను వసూళ్లలో అవినీతి జరిగినట్లు గుర్తించి తామే విచారణ జరిపిస్తున్నామని, ఒకరిపై చర్యకూడా తీసుకున్నామని అన్నారు. వాస్త వాలు ఇలా ఉంటే వాటిని తెలుసుకోకుండా బాస సత్యనారాయణరావు మాట్లాడ టం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇప్పటికైనా వాస్తవాలను మాట్లాడాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. 

Updated Date - 2020-09-25T06:01:48+05:30 IST