రైతు వేదికలు సిద్ధం

ABN , First Publish Date - 2020-10-28T11:22:41+05:30 IST

ప్రభుత్వం ఒక్కో క్లస్టర్‌లో ఒక రైతు వేదిక నిర్మించాలని నిర్ణయించింది. జగిత్యాల జిల్లాలో 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి

రైతు వేదికలు సిద్ధం

జిల్లాలో 71 క్లస్టర్లు.. ఇప్పటికే 64 భవనాలు పూర్తి


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ప్రభుత్వం ఒక్కో క్లస్టర్‌లో ఒక రైతు వేదిక నిర్మించాలని నిర్ణయించింది. జగిత్యాల జిల్లాలో 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. విజయదశమి నాటికి అన్ని భవనాలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ వారం, పది రోజుకోసారి వీడియో కాన్ఫరెన్స్‌లో రైతు భవనాలపై సమీక్షించారు. దీనికి తోడు ప్రజాప్రతినిధులకు టార్గెట్లు పెట్టారు. దీంతో చాలా వరకు రైతు భవనాలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల ప్రారంభోత్సవానికి ముస్తాబు చేశారు. దసరా పండుగ గడిచిపోవడంతో వీటిని ఎప్పుడు ప్రారంభిస్తారో అనే చర్చ మొదలైంది.


జిల్లాలో 71 భవనాలు

జగిత్యాల జిల్లాలో 18 మండలాలు, 380 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే వ్యవసాయ శాఖ 71 క్లస్టర్లుగా విభజించింది. మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 71 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించారు. ఐదు చోట్ల స్థలాలు దొరకక భవన నిర్మాణాలు కాస్త ఆలస్యమయ్యాయి. మిగిలిన చోట్ల పనులు వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్‌ జి.రవి ఒకవైపు, అదనపు కలెక్టర్‌ బి.రాజేశం మరోవైపు నిత్యం సుడిగాలి పర్యటన చేశారు. రైతు వేదికల నిర్మాణాలను దసరానాటికి పూర్తి చేయాలని సర్పంచులకు టార్గెట్లు పెట్టారు. కొన్ని చోట్ల నిర్మాణాల్లో వెనుకబడిన సర్పంచులను మందలిస్తూ  వచ్చారు. ఎట్టకేలకు 90 శాతంకు పైగా రైతు వేదికలు సిద్ధమయ్యాయి. అయితే ప్రభుత్వం నుంచి ప్రారంభోత్సవానికి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో విజయదశమి రోజు ప్రారంభోత్సవాలకు నోచుకోలేదు.


ప్రారంభోత్సవాలు ఎప్పుడో..?

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ జి.రవి ప్రత్యేక చొరవ తీసుకుని రైతు వేదికల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించారు. 71 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టగా, 65 పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు వీటిని ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టమైన ఆదేశాలు లేవు. హడావిడిగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజయదశమి నాటికి అన్ని భవనాలు పూర్తి చేయాలని పదే పదే అధికారులు హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేయకపోవడంపై అంతటా చర్చ నడుస్తోంది.  

Updated Date - 2020-10-28T11:22:41+05:30 IST