సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-06T06:47:42+05:30 IST

కరోనా పరిస్థితుల అనంతరం పూర్తి స్థాయిలో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను శుక్రవారం నుంచి నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

సర్వం సిద్ధం
పరీక్ష ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న అధికారులు

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం

కరోనా పరిస్థితుల తర్వాత పూర్తిస్థాయిలో పరీక్షలు

ఏర్పాట్లను పూర్తి చేసిన జిల్లా శాఖ అధికారులు

జిల్లావ్యాప్తంగా హాజరుకానున్న 19,650 మంది విద్యార్థులు

జనరల్‌ విద్యార్థులు 17,618 మంది కాగా, వొకేషనల్‌  1955 మంది, బ్యాక్‌లాగ్‌ 77 మంది విద్యార్థులు

ఈసారి కూడా నిమిషం నిబంధన.. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలు

ఆదిలాబాద్‌, మే 5(ఆంధ్రజ్యోతి): కరోనా పరిస్థితుల అనంతరం పూర్తి స్థాయిలో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను శుక్రవారం నుంచి నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో మాదిరిగానే నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి నిరాకరించనున్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గతంలో కొవిడ్‌ కారణంగా వార్షిక పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చారు. గతేడు అక్టోబర్‌ మాసంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను మాత్రమే నిర్వహించారు. ఈ సారి మునుపటి మాదిరిగానే ప్రథమ, ద్వితీయ పరీక్షలను ఒకేసారి నిర్వహిస్తున్నారు. గత ఆరు మాసాల క్రితం వరకు ఆన్‌ లైన్‌ తరగతులనే నిర్వహించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు సరిగా హాజరుకాక పోవడంతో అంతంత మాత్రంగానే విషయ పరిజ్ఞానంతో పరీక్షలపై విద్యార్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది.

జిల్లాలో 19,650 మంది విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా 19,650 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 17,618 మంది కాగా వోకేషనల్‌ విద్యార్థులు 1955 మంది, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు 77 మంది ఉన్నారు. ఈసారి కూడా నిమిషం నిబంధన నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను గంట ముందు నుంచే అనుమతిస్తారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను విధిస్తున్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జిరాక్స్‌ సెంటర్లను తెరిస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 33 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 33 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఆరుగురు కస్టోడియల్‌ అధికారులు, ప్లయింగ్‌ స్క్వాడ్‌ రెండు టీంలు, మరో రెండు టీంలు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించనున్నారు.

మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో..

కరోనాతో గందరగోళ పరిస్థితుల నడుమ వరుసగా వార్షిక పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చారు. 2019 నుంచి 2020 వరకు పరీక్షలను వాయిదా వేశారు. 2021లో మాత్రం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను కొవిడ్‌ నిబంధనల ప్రకారం నిర్వహించి ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పైతరగతులకు పంపించారు. ఆ తర్వాత 2022 మేలో మాత్రమే ఒకేసారి ప్రథమ, ద్వితీయ పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు పరీక్షలు లేకుండానే పైతరగతులకు వెళ్లిన విద్యార్థులు.. ప్రస్తుతం పరీక్షల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగానే పైచదువులకు వెళ్లనున్నారు. కరోనా కారణంగా సిలబస్‌ను కొంతమేరకు తగ్గించినా.. పూర్తిస్థాయిలోనే ఈసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మండిపోతున్న ఎండలకు విద్యార్థుల కు అనారోగ్య సమస్యలు తలెత్తినా.. తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతీ సెంటర్‌లో తాగు నీటి వసతిని కల్పిస్తున్నారు. అలాగే, ప్రతీ సెంటర్‌లో ఏఎన్‌ఎంతో పాటు పోలీసు సిబ్బందిని నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇంర్మీడియట్‌ పరీక్షల వివరాలిలా..

పరీక్ష సమయం           : ఉదయం 9గంటల నుంచి

                                     మధ్యాహ్నం 12గంటల వరకు

జిల్లాలో పరీక్ష కేంద్రాలు                 : 33

మొదటి సంవత్సరం విద్యార్థులు (జనరల్‌) : 9085

ఒకేషనల్‌ విద్యార్థులు                    :1022

ద్వితీయ సంవత్సరం విద్యార్థులు (జనరల్‌) : 8533

వొకేషనల్‌ విద్యార్థులు                    : 933

బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు                    : 77

ఇన్విజిలెటర్స్‌                    : 388 మంది

డిపార్ట్‌మెంటల్‌ అధికారులు                    : 33

చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులు          : 33

అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌             : 11

కస్టోడియల్‌ అధికారులు                     : 06

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీంలు                     : 02

సిట్టింగ్‌ స్క్వాడ్‌ టీంలు                     : 02

గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

: పి.రవీందర్‌కుమార్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి, ఆదిలాబాద్‌

విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం నిబంఽధన అమలవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సరైన సమయంలో చేరుకుంటే మంచిది. విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లను తీసుకుని పరీక్ష కేంద్రానికి వస్తే సరిపోతుంది. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా పరీక్ష హాల్‌లోకి అనుమతి ఉంటుంది. విద్యార్థులపై ప్రైవేట్‌ కాలేజిల ఫీజు ఒత్తిడి లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా విద్యార్థులు పరీక్షలు రాసి మంచి ప్రతిభను కనబర్చాలి. ప్రతీ పరీక్ష తరగతి గదిలో బెంచీలను ఏర్పాటు చేయాలని సంబంధిత కాలేజీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Read more