సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-09-18T04:54:11+05:30 IST

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం
కలెక్టరేట్‌ : మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ, ఎచ్చెర్ల : చిలకపాలెంలో లెక్కింపు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌,

- రేపు ఉదయం 8 గంటలకు పరిషత్‌ ఓట్ల లెక్కింపు 

- 4,301 మంది సిబ్బంది నియామకం  

- వెబ్‌ కాస్టింగ్‌తో వీడియో రికార్డింగ్‌

- కేంద్రాల వద్ద రెండంచెల భద్రత  

- విజయోత్సవాలకు అనుమతిలేదు

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 

కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: ‘జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనున్నాం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశా’మని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. పరిషత్‌ ఓట్ల లెక్కింపుపై శుక్రవారం  ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పదిచోట్ల ఓట్ల లెక్కింపు జరగనుందన్నారు. అన్ని లెక్కింపు కేంద్రాలకు రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమించామని తెలిపారు. స్ర్టాంగ్‌రూమ్‌ల నుంచి లెక్కింపు గదుల వరకు బారికేడ్లు, పోలీసు బందోబస్తు, తదితర ఏర్పాట్లు చేశామన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు   ప్రారంభమవుతుందని వివరించారు. సిబ్బంది, ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకే సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి కౌంటింగ్‌ హాల్‌లో వెబ్‌కాస్టింగ్‌ వీడియో రికార్డింగ్‌, జనరేటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాలు ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి టేబుల్‌ వద్ద ఒక పర్యవేక్షణ అధికారి, ముగ్గురు సిబ్బంది ఉంటారని, వీరితో పాటు రిజర్వు సిబ్బందిని కూడా సిద్ధం చేశామని కలెక్టర్‌  తెలిపారు.


68 కౌంటింగ్‌ హాళ్లు... 627 టేబుళ్లు 

జిల్లాలో 38 మండలాలకు గాను 37 మండలాల జడ్పీటీసీ స్థానాలకు 37 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. 667 ఎంపీటీసీ స్థానాలకు గాను 66 మంది ఏకగ్రీవం కాగా, మరో 11 చోట్ల ఎంపీసీటీసీ అభ్యర్థులు మరణించారు. మిగిలిన 590 స్థానాలకుగాను 590 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 68 కౌంటింగ్‌ హాళ్లను.. 627 టేబుళ్లను సిద్ధం చేసినట్లు  చెప్పారు. 854 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 863 మంది అసిస్టెంట్‌ సూపర్‌ వైజర్లు 2,584 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లను కలిపి 4,301 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. లెక్కింపు  కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, సిబ్బందికి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 


నేడు లెక్కింపు సిబ్బందికి శిక్షణ

ఓట్ల కౌంటింగ్‌ సిబ్బందికి శనివారం శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మండల స్థాయి అధికారులతో శుక్రవారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు సంబంధిత సిబ్బంది హాజరుకావాలని చెప్పారు. పోటీచేసిన అభ్యర్థుల నుంచి ఏజెంట్ల వివరాలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ అభ్యర్థులకు పాసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. 50 మీటర్లు, వంద మీటర్ల చొప్పున రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయిలో  కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి ఊరేగింపులు, విజయోత్సవాలు నిర్వహించేందుకు  అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌, జేసీలు కె.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్‌, ఆర్‌.శ్రీరాములునాయుడు, ఆర్డీవో ఐ.కిషోర్‌, జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, డీపీవో వి.రవికుమార్‌, డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు  పాల్గొన్నారు. 


జిల్లాలో పది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు 

రాజాం రూరల్‌, సెప్టెంబరు 17 : జిల్లాలో పది నియోజకవర్గాలకుగానూ పది కేంద్రాల్లో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

నియోజకవర్గం       లెక్కింపు కేంద్రం పేరు

------------------------------------------------------------

రాజాం        : జీఎంఆర్‌ వరలక్ష్మి డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ 

ఇచ్ఛాపురం     : ఏపీ మోడల్‌ స్కూల్‌ (పురుషోత్తపురం)

పలాస        : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 

టెక్కలి        : ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల 

పాతపట్నం    : ఏపీఎస్‌ డబ్ల్యుఆర్‌ స్కూల్‌(బ్రిడ్జి స్కూల్‌) 

శ్రీకాకుళం      : ప్రభుత్వ డిగ్రీ కళాశాల 

ఆమదాలవలస  : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 

ఎచ్చెర్ల         : శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కళాశాల (చిలకపాలెం) 

నరసన్నపేట     : ప్రభుత్వ డిగ్రీ కళాశాల 

పాలకొండ      : డీఏవీ స్కూల్‌ (అన్నవరం)


============= 


పటిష్ట భద్రత

- ఫిర్యాదులు ఉంటే 63099 90933 నంబర్‌కు సమాచారం ఇవ్వండి

- ఎస్పీ అమిత్‌బర్దర్‌

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ఎచ్చెర్ల, సెప్టెంబరు 17: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ అమిత్‌బర్దర్‌ తెలిపారు. చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. అలాగే రాత్రి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు  చెప్పా రు. కేంద్రాల వద్ద రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అవసరం మేరకు ట్రాఫిక్‌ మళ్లింపు చేయాలని.. బందోబస్తు ఏర్పాటులో ఎటువంటి లోపాలు ఉండకూడదని పోలీసు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే ‘‘63099 90933’’ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. జెండాలు, లాఠీలు, అగ్ని అయుధాలు అనుమతించబడవని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద 30 పోలీసు యాక్ట్‌, 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్ప వని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర, తహసీల్దార్‌ ఎస్‌.సుధాసాగర్‌, జేఆర్‌పురం సీఐ చంద్రశేఖర్‌, ఎచ్చెర్ల ఎస్‌ఐ కె.రాము పాల్గొన్నారు. 



 

Updated Date - 2021-09-18T04:54:11+05:30 IST