పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-22T06:36:20+05:30 IST

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం అయ్యే 10వ తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి మొదలై వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
పరీక్ష కేంద్రాల్లో హాల్‌టికెట్ల నెంబర్‌లు వేసిన దృశ్యాలు

- రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు

- పరీక్షల నిర్వహణకు జిల్లాలో మొత్తం 69 సెంటర్ల ఏర్పాటు

- హాజరుకానున్న 12,505 మంది విద్యార్థులు


కామారెడ్డి టౌన్‌, మే 21: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం అయ్యే 10వ తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి మొదలై వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,505 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 69 సెంటర్‌లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి గంట ముందే విద్యార్థులను అనుమతించనున్నారు.

ఉదయం 9.30 వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందే..

పరీక్షలు ఉదయం 9.30 నిమిషాల నుంచి 12.45 నిమిషాల వరకు జరుగనున్నాయి. విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేటప్పుడు, పరీక్ష కేంద్రంలో వ్యవహరించాల్సిన పలు సూచనలను వివరిస్తూ వాటిని పకడ్బందీగా అమలు చేసే పనులలో విద్యాశాఖ అధికారులు ఉండనున్నారు.పరీక్ష కేంద్రానికి హాజరయ్యే విద్యార్థి హాల్‌ టికెట్‌, రైటింగ్‌ ప్యాడ్‌, పెన్నులు, పెన్సిల్‌ వంటి రాత సామగ్రి తప్ప మిగిలిన ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, ప్రింటెండ్‌ పుస్తకాలు ఎట్లాంటివి అనుమతించబడవని సూచించారు. విద్యార్థులు పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లకూడదు. సమాధాన పత్రం పూర్తిగా నింపినప్పటికీ కేటాయించబడిన పూర్తి పరీక్ష సమయం ముగిసే వరకు హాల్‌ నుంచి బయటకు అనుమతించబడదు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్లలో ఏ పొరపాట్లు ఉన్నా ఇన్విజిలేటర్‌ లేదా చీఫ్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.

హాల్‌ టికెట్‌ చూపిస్తే.. బస్సులో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడింది. అందుకుగాను విద్యార్థులు వారి హాల్‌టికెట్‌ను బస్సు కండక్టర్‌ గారికి చూపిస్తే సరిపోతుంది. ఎండలు మండే అవకాశమున్నందున పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంను నియమించి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు మందులు అందుబాటులో ఉంచనున్నారు.

విద్యార్థులే కాకుండా సిబ్బంది నిబంధనలు పాటించాల్సిందే..

పరీక్షలో హైదరాబాద్‌ నుంచి స్టేట్‌ అబ్జర్వరుతో పాటు ఇన్విజిలేషన్‌ చేసే సిబ్బంది, చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసరులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం పరీక్షల విధులలో పాల్గొనన్నారు. అయితే విద్యార్థులతో పాటు వారు పలు నియమాలను పాటించాలని విద్యాశాఖ వారు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రానికి కేటాయించబడిన సిబ్బంది అందరూ గుర్తింపు కార్డును ధరించాలి. సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. పరీక్ష పర్యవేక్షణ అధికారి అనుమతి లేనిదే ఎవరికీ పరీక్ష హాల్‌లోకి ప్రవేశం ఉండదు. పరీక్ష కేంద్రంలోకి చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసర్‌, ఇన్విజిలేటర్‌, మెడికల్‌ సిబ్బంది, అటెండర్‌, వాటర్‌ బాయ్స్‌, అభ్యర్థులు, ఇతర పరీక్ష నిర్వహణ సిబ్బంది ఎవరు కూడా సెల్‌ఫోన్‌, పేజర్లు, క్యాలిక్యులేటర్‌, ఇతర ఎలకా్ట్రనిక్‌ వస్తువులకు అనుమతి లేదు. ఒకవేళ అలా కనిపించినచో మాల్‌ ప్రాక్టీస్‌ కింద కేసు నమోదు చేయనున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో అత్యవసర సమాచారంలో పోలీస్‌ సిబ్బంది ఫోన్‌ మాత్రమే వినియోగిస్తూ ఇన్‌కమింగ్‌ ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ రిజిస్టర్‌లో రాయాలి. పరీక్ష కేంద్రం చుట్టు పక్కల 100 మీటర్ల వరకు 144 సెక్షన్‌ విధించనున్నారు. అంతేకాకుండా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిరాక్సు సెంటర్‌లను మూసి ఉంచాలి.


పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నాం

- రాజు, డీఈవో, కామారెడ్డి

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం అయ్యే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడా ఏ చిన్న అవంతరం జరగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించనున్నాం. ఇందుకోసం 69 సెంటర్లను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ముందురోజే తమ పరీక్ష కేంద్రాని సందర్శిస్తే సులువుగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన సామగ్రి తప్ప ఏ ఇతర సామగ్రి వెంట తీసుకురాకూడదు.

Updated Date - 2022-05-22T06:36:20+05:30 IST