కోర్టుకు భవనాలు సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2022-05-21T04:53:11+05:30 IST

కోర్టుకు భవనాలు సిద్ధం చేయండి

కోర్టుకు భవనాలు సిద్ధం చేయండి
కోర్టు ఏర్పాటుకు భవనాలను పరిశీలిస్తున్న ప్రేమావతి

ఆమనగల్లు, మే 20: ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు ఆమనగల్లు పట్టణంలో జూనియర్‌ సివిల్‌ జడ్డి, మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్డు ఏర్పాటుకు న్యాయశాఖ కార్యాచరణ రూపొందించిందని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి అన్నారు. కల్వకుర్తి జూనియర్‌ సివిల్‌జడ్డి పరిధిలో కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల మండలాలకు కలిపి ఆమనగల్లు పట్టణంలో జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. పట్టణంలో కోర్టు ఏర్పాటుకు శుక్రవారం సాయంత్రం తహసీల్దారు పాండునాయక్‌, సీఐ ఊపేందర్‌, కల్వకుర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రదీప్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిందం కృష్ణయ్య, ఎంపీపీ అనితావిజయ్‌, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డిలతో కలిసి ప్రేమావతి భవనాలను పరిశీలించారు. మండల పరిషత్‌ పాత సమావేశ భవనం, పాత కార్యాలయ భవనం, ఓల్డ్‌సిబ్బంది క్వార్టర్స్‌ను ఆమె పరిశీలించి త్వరగా భవనాలను ఆధునీకరణ, మరమ్మతులు చేసి సిద్ధం చేయాలని ఆమె అధికారులను, బార్‌ అసోసియేషన్‌ సభ్యులను ఆదేశించారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేస్తే కోర్టు ఏర్పాటుకు అంత సక్రమంగా ఉంటుందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌కుమార్‌. మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య. బార్‌ అసోసియేషన్‌ సభ్యులు యాదిలాల్‌, జగన్‌, భాస్కర్‌రెడ్డి, శేఖర్‌, ఆంజనేయులు, సుధాకర్‌రెడ్డి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

కోర్టు ప్రారంభానికి  ముమ్మరంగా ఏర్పాట్లు 

ఆమనగల్లు పట్టణంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి, మెట్రోపాలిటిన్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు ఏర్పాటుకు ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం కొనసాగుతున్న భవనం, పాత సమావేశ భవనం, రెండు సిబ్బంది క్వార్టర్లు కోర్టు నిర్వాహణకు ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లా జడ్జి సీహెచ్‌ హరికృష్ణ భూపతి గురువారం  మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్జి ప్రేమావతి శుక్రవారం ఆయా భవనాలను పరిశీలించారు. ఆయాభవనాల ఆధునీకరణ, మరమ్మతులు, వసతుల కల్పనకు ప్రతిపాదనలు అందజేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ ఆధ్వర్యంలో ఆయా భవనాలను శుక్రవారం శుభ్రం చేశారు. పాత సమావేశ భవనంలో ఉన్న మండల పరిషత్‌ సామగ్రిని మండల పరిషత్‌ కార్యాలయంలోకి మార్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వ తేదీన ఆమనగల్లులో కోర్టు ప్రారంభానికి న్యాయశాఖ, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనుల నిర్వహణను తహసీల్దార్‌ పాండు నాయక్‌, సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ ధర్మేశ్‌, ఎంపీడీవో వెంకట్రాములు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ అర్జున, ఏఈ రవితేజలు పర్యవేక్షిస్తున్నారు. 

Updated Date - 2022-05-21T04:53:11+05:30 IST