సహకార రుణ ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2020-06-06T10:11:54+05:30 IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2020- 21 సంవత్సరానికి రూ.1000 కోట్లతో రుణ ప్రణాళికను సిద్ధం చేసింది

సహకార రుణ ప్రణాళిక సిద్ధం

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయింది. రైతులకు పంట రుణాలు అందించి ఆదుకునేందుకు జిల్లా సహకార బ్యాంకు రుణ ప్రణాళికను సిద్ధం చేసింది. పంట రుణాల కింద అందజేసే స్వల్పకాల రుణాల నిమిత్తం ఈ ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లా సహకార సంస్థ రూ.1000 కోట్లను కేటాయించింది. వ్యవసాయ అభివృద్ధి, అనుబంధ అవసరాలకు సంబంధించి రూ.190 కోట్లతో దీర్ఘకాలిక రుణ ప్రణాళికను సిద్ధం చేసింది.


(ఏలూరు- ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2020- 21 సంవత్సరానికి రూ.1000 కోట్లతో రుణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎకరానికి రూ.28 వేలు చొప్పున స్వల్పకాల రుణం అందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రూ.198.92 కోట్లను సహకార రంగ రైతులకు రుణం గా అందించింది. కిందటేడాది ఇదే సమయానికి 280 కోట్లు స్వల్పకాల రుణాలు అందించారు. ఖరీఫ్‌ సమయం దగ్గర పడడంతో అధికారులు కసరత్తు వేగం పెంచారు.  జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూపొందించిన ఈ రుణ ప్రణాళిక ద్వారా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని 2.18 లక్షల మంది సహకార సంఘ సభ్యులకు పంట రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఇందులో అగ్రభాగం వరి పంటకే కేటాయించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, వసతుల కల్పన, అనుబంధ అవసరాల నిమిత్తం అందించే దీర్ఘకాలిక రుణాల నిమిత్తం రూ.190 కోట్లతో రుణ ప్రణాళిక సిద్ధ మవ్వగా ఇప్పటి వరకు రూ.14 కోట్లను రుణాలుగా అందించారు. బంగారం కుదువ పెట్టుకుని ఇచ్చే రుణాలకు రూ.100 కోట్లు కేటాయించారు. గ్రాము బంగారానికి గతంలో రూ.2,400 ఇవ్వగా ప్రస్తుతం దానిని రూ.2,800కి పెంచారు. ఇప్పటికి రూ.34 కోట్లు రుణాలు అందజేశారు. 


ఈ ఖరీఫ్‌లో కొత్తగా..

స్పెషల్‌ లిక్విడిటీ ఫెసిలిటీ పథకం కింద రూ.100 కోట్లు ఈ ఖరీఫ్‌లో అదనంగా కేటాయించారు. కొవిడ్‌- 19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్కెటింగ్‌ సౌకర్యం, విక్రయాల వెసులుబాటు నిమిత్తం రుణాలు అందించేం దుకు ఈ రూ.100 కోట్లను రైతులకు రుణాలుగా అందజేస్తారు. స్వయం సహాయక సంఘాల సభ్యులైన రైతులకు రుణ సహాయం అందించేందుకు జిల్లా సహకార బ్యాంకు ఈసారి రూ.45 కోట్లు కేటాయించింది. ఒక్కో గ్రూపుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పథకం కింద రూ.12.32 కోట్లు అంద జేశారు. జనధన్‌ ఖాతాలున్న రైతు మహిళలకు మార్చి, ఏప్రిల్‌, మే నెల లకు రూ. 500 చొప్పున మొత్తం రూ.1500 ఆర్థిక సహాయం అందించారు. 

Updated Date - 2020-06-06T10:11:54+05:30 IST