ఎనిమిదో విడతకు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-05-19T05:46:31+05:30 IST

తెలంగాణకు హరితహారంలో భాగంగా పచ్చదనంను కాపాడడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా జిల్లాలో ఎనిమిదో విడుత హరితహారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎనిమిదో విడతకు సన్నాహాలు

- మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు

- జిల్లాలో హరితహారం లక్ష్యం 32.56 లక్షల మొక్కలు

- ఇప్పటికే ప్రభుత్వ శాఖల వారిగా నిర్ధేశించిన లక్ష్యం

- ప్రభుత్వ శాఖల వారిగా లక్ష్యాల కేటాయింపు

- వర్షాలు కురువగానే మొక్కలు నాటనున్న అధికారులు

- నర్సరీల్లో సిద్ధంగా ఉన్న హరితహారం మొక్కలు


కామారెడ్డి, మే 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు హరితహారంలో భాగంగా పచ్చదనంను కాపాడడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా జిల్లాలో ఎనిమిదో విడుత హరితహారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తుండడంతో ఆ దిశగా కార్యాచరణ రూపొందించి సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా పట్టణాలతో పాటు మండలాల్లో, గ్రామాల్లో పండుగ వాతావరణంలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎనిమిదో విడత కింద 32.56 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల వారిగా లక్ష్యాలను నిర్ధేశించారు. నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులకే అప్పగిస్తున్నారు.

జిల్లా లక్ష్యం 32.56 లక్షల మొక్కలు

రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 2015 జూలైలో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఏడు విడతలుగా నిర్వహించారు. ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిదో విడత కింద జిల్లాలో 32,56,200 మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రకృతి సమతుల్యంగా ఉంటే కాలానికి అనుగుణంగా మొక్కలు నాటనున్నారు. ప్రధానంగా జూన్‌లో వర్షాకాలం మొదలైన తర్వాత చిరుజల్లులు పడే సూచనలు ఉండడంతో మొక్కల పెంపకంపై అందరు దృష్టి సారించారు. ప్రధానంగా పచ్చదనం ఆశించిన స్థాయిలో పెంచడం ద్వారా ప్రకృతి సమతుల్యం కాపాడాలన్న విశ్వాసం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో మొక్కల పెంపకంపై పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు. వర్షం జల్లులు ప్రారంభంకాగానే మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు.

శాఖల వారిగా లక్ష్యాలు

జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఆయా ప్రభుత్వ శాఖల వారిగా లక్ష్యాలను నిర్ధేశించారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 20.07లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 12.49లక్షల మొక్కలు, ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలు, మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో 2 వేలు, మార్కెటింగ్‌ శాఖకు 1200, ఐసీడీఎస్‌కు 3 వేలు, బీసీ డెవలప్‌మెంట్‌కు 3వేలు, ఎస్సీ డెవలప్‌మెంట్‌కు వెయ్యి, సివిల్‌ సప్లయ్‌కు 2 వేలు, పరిశ్రమలశాఖకు 3 వేలు, పోలీసుశాఖకు 1000, కామారెడ్డి మున్సిపాలిటీకి 2.50 లక్షలు, బాన్సువాడ మున్సిపాలిటీకి లక్ష, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి 40 వేలు, మత్స్యశాఖకు 1000, హార్టికల్చర్‌కు 25 వేలు, మైనింగ్‌శాఖకు 2 వేలు, విద్యుత్‌శాఖకు 7 వేలు, ఆర్‌టీసీకి 1000, కోఆపరేటివ్‌ శాఖకు 1000, రెవెన్యూకు 1000, ట్రైబల్‌ వెల్ఫెర్‌కు 500, మైనార్టీ వెల్ఫెర్‌కు 1000 మొక్కలతో పాటు ఇతర శాఖలకు మొక్కలను నాటాలని లక్ష్యాలను నిర్ధేశించారు.

మొక్కలు నాటేందుకు యాక్షన్‌ ప్లాన్‌

గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు పచ్చదనంతో ఉండాలని ఆలోచనతో సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారంపై జిల్లా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మొక్కలు నాటడడంపై ప్రత్యేక ప్రణాళికలో భాగంగా జిల్లా అధికారులు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇంటింటా మొక్కలను పంపిణి చేయడం, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో, 526 గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి రోడ్లకు ఇరువైపుల, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా 20.07 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టారు. ఈ శాఖ ఆధ్వర్యంలో ఇరిగేషన్‌ శాఖకు 20 వేలు, విద్యాశాఖకు 10వేలు, వైద్య ఆరోగ్యశాఖకు 2వేలు, వ్యవసాయశాఖకు 2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల అంతర్గత రోడ్ల వద్ద 2 లక్షలు, జిల్లా పంచాయతీ శాఖకు 1.50 లక్షలు, కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో 25వేలు, పశు సంవర్థక శాఖకు 50వేలు, ఇళ్లకు పంపిణీ చేయాల్సినవి 12లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక ప్రకారం జిల్లాలోని అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థలు మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టనున్నారు.

హరితహారంపై ప్రత్యేక దృష్టి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 33శాతం మేరకు అడువులు పెంచాలనే ఆలోచనతో హరితహారం కార్యక్రమం చేపడుతున్నారు. నాటిన వాటిలో 85 శాతం మొక్కలు దక్కేలా చర్యలు తీసుకోవాలని అందుకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, చైర్మన్‌లతో పాటు అధికారులు బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు మొక్కలు నాశనం చేసిన వారికి భారీగా జరిమానాలు విధించిన సంఘటనలు ఉన్నాయి.

Updated Date - 2022-05-19T05:46:31+05:30 IST